Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, August 16, 2020

M S Dhoni has excelled in many roles : బహుముఖ పాత్రల్లో ఒదిగిపోయిన ధోనీ.


M S Dhoni has excelled in many roles:
బహుముఖ పాత్రల్లో ఒదిగిపోయిన ధోనీ.

అంతర్జాతీయ క్రికెట్లో ఎంతోమంది ఎన్నో విధాలుగా తమదైన ముద్ర వేశారు. పరుగులు చేయడంలో బ్యాట్స్‌మన్‌, బంతులు విసరడంలో బౌలర్‌ నైపుణ్యం సాధిస్తారు. ఇక ఆల్‌రౌండర్లు రెండింట్లోనూ రాణిస్తారు. స్పెషలిస్టు కీపర్లైతే స్టంపింగులు చేయడంలో క్యాచులు అందుకోవడంలో ఆరితేరి ఉంటారు. కొందరు మాత్రమే నాయకత్వంలో మెరుస్తారు. టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ మాత్రం అందరికీ భిన్నంగా అన్నింటా రాణించాడు. ఎందుకంటే అతడో మేధావి! నాయకుడు! స్నేహితుడు! విరాగి! యోగి!?
క్రికెట్‌ మేధావి

మ్యాచ్‌ పరిస్థితులను అధ్యయనం చేయడంలో మహేంద్రుడు దిట్ట!
తెలివైన చదరంగ నిపుణులు ప్రత్యర్థి చేత ఎలాంటి ఎత్తులు వేయించి ఓడించాలో ముందే ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. మనోఫలకంపై ముద్రించుకున్న మేరకే పావులు కదుపుతారు. మహీ కూడా అంతే. ఆడేది 20 లేదా 50 ఓవర్లైనా ప్రత్యర్థి చేత ఏం చేయించి ఓడించాలో ముందే ఊహిస్తాడు. ఆటలో ఎప్పుడేం చేయాలో అతడికి బాగా తెలుసు! క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్‌ను ఎలా బోల్తా కొట్టించాలో, బౌలర్‌పై ఎలా ఒత్తిడి పెంచాలో తెలుసు. అనూహ్యంగా ఆఖరి ఓవర్లను సాధారణ బౌలర్లతో వేయించి విజయాలెన్నో అందించిన ఘటనలు మనం చూశాం. చెపాక్‌లో మేఘాలను చూసి వర్షం ఎన్ని ఓవర్ల సమయంలో పడుతుందో అంచనా వేయగల సామర్థ్యం అతడి సొంతం. క్రికెట్‌ నియమావళిపై అతడికున్న అవగాహన సమకాలీన క్రికెటర్లలో ఎవ్వరికీ లేదని ఘంటాపథంగా చెప్పొచ్చు.

తెలివైన బ్యాట్స్‌మన్‌

బ్యాట్స్‌మన్‌గా మహీ శైలి ప్రత్యేకం. వన్‌డౌన్‌ నుంచి ఏడో స్థానం వరకు ఆడినా వన్డేల్లో పదివేల పరుగులు చేశాడు. కెరీర్‌ మొదట్లో క్రీజులోకి అడుగుపెట్టిన క్షణం నుంచి వీరబాదుడు బాదేవాడు. ఆఖరి వరకే అలాగే దంచేవాడు. ఆ తర్వాత శైలి మార్చాడు. మొదటి నాలుగు వికెట్లు పడ్డప్పుడు ప్రశాంతంగా ఆడటం మొదలుపెట్టాడు. సింగిల్స్‌ లేదా డబుల్స్‌కే పరిమితం అయ్యేవాడు. రన్‌రేట్‌పై కచ్చితమైన అంచనాతో ఉండేవాడు. రన్‌రేట్‌ తగ్గుతుందేమో అన్నప్పుడు ధనాధన్‌ సిక్సర్‌ బాదేసి మళ్లీ సింగిల్స్‌ మొదలెట్టేవాడు. దాంతో బౌలర్లకే ఏం చేయాలో తోచేది కాదు. అందుకే అతడు ఆఖరి ఓవర్లో క్రీజులో ఉండి చేయాల్సిన పరుగులు ఎక్కువే ఉన్నా ఒత్తిడి బౌలర్‌పైనే ఉండేది. అతడు క్రీజులో ఉంటే అదో ధైర్యం!

బౌలర్‌ను మించిన బౌలర్‌

టీమ్‌ఇండియా బౌలింగ్‌పై ధోనీది చెరగని ముద్రే. అదేంటీ అతడు వేసింది ఒకటో రెండో ఓవర్లే కదా అంటారా! పిచ్‌, వాతావరణాన్ని అధ్యయనం చేయడంలో మహీ దిట్ట అని తెలుసు. అయితే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ బలాబలాలు, వారి ఆటతీరు, వారి బ్యాటింగ్‌ శైలిపైనా అతడికి మంచి అవగాహన ఉంటుంది. అందుకే దీపక్‌చాహర్‌ లాంటి అనుభవం లేని పేసర్‌ను తీసుకొని నిషేధం తర్వాత ఐపీఎల్‌ ట్రోఫీ అందించగలిగాడు. ఏ బ్యాట్స్‌మెన్‌కు ఎక్కడ? ఎలా? బంతులు వేయాలో మహీ చెప్తాడు. బౌలర్లు ఆ సూచనను పాటిస్తే చాలు. సాధారణ బౌలర్‌తోనూ అతడు అద్భుతాలు చేయిస్తాడు. బౌలింగ్‌పై ధోనీ ప్రభావమేంటో కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌ను అడిగితే బాగా చెప్తారు. ఇక బంగ్లాదేశ్‌తో టీ20 మ్యాచులో ఓటమి అంచున నిలిచిన జట్టును హార్దిక్‌ పాండ్యతో ఆఖరి ఓవర్ వేయించి గెలిపించిన తీరు ఎప్పటికీ గుర్తుంటుంది.

సాటిలేని కీపర్‌

ఇక మహేంద్రుడి బలమే వికెట్‌ కీపింగ్‌. కెరీర్‌ తొలినాళ్లలో అనుభవలేమితో ఇబ్బందులు పడ్డా కాలం గడిచే కొద్దీ ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్‌ కీపర్‌గా అవతరించాడు. ఒకప్పుడు ఒకటో రెండో బంతులు వదిలేసిన అతడు బంతి గింగిరాలు తిరిగి వికెట్ల పక్కనుంచి పోతుందేమోనని కాళ్లు పక్కకు చాపి ఆపగలిగే స్థితికి చేరుకున్నాడు. మైక్రో సెకన్లలో వ్యవధిలో అతడు స్టంపింగులు చేస్తాడు. 350 వన్డేల్లో ఏకంగా 123 స్టంపులు చేశాడు. ఇందులో ముప్పావు శాతం 0.08-0.10 సెకన్లలోనే చేసినవి. స్టంపింగ్‌ చేశాక ధోనీ ఆత్మవిశ్వాసం చూసి అంపైర్లు ఔటిచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కీపర్‌గా అతడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.

మెచ్చిన నాయకుడు

ఏదేమైనా ధోనీ ప్రపంచం మెచ్చిన నాయకుడు! గ్రెగ్‌ ఛాపెల్‌ దెబ్బకు కకావికలమై 2007 వన్డే ప్రపంచకప్‌లో పాతాళానికి చేరుకున్న టీమ్‌ఇండియాను అతడు తీర్చిదిద్దిన విధానం అద్భుతం. పగ్గాలు అందుకోగానే యువకులు, సీనియర్లతో కూడిన జట్టుతో అరంగేట్ర టీ20 ప్రపంచకప్‌ అందించాడు. టెస్టుల్లో అగ్రస్థానానికి చేర్చాడు. ఆసియాకప్‌లు ముద్దాడాడు. 2011లో యువీ సహకారంతో వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్నాడు. భారతీయుల సుదీర్ఘమైన ఎదురుచూపులకు ముగింపు పలికాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచి ఐసీసీ టోర్నీలన్నీ గెలిచిన ఏకైక కెప్టెన్‌గా అవతరించాడు. చిత్రవిచిత్ర వ్యూహాలతో ప్రత్యర్థులను దెబ్బకొట్టాడు. తనకు ఇష్టమైన రైనా, కోహ్లీ వంటి యువ క్రికెటర్లకు అండగా నిలిచాడు. మొదట్లో డీఆర్‌ఎస్‌ను ఇష్టపడని అతడు ఆ తర్వాత దాన్ని ధోనీ రివ్యూ సిస్టమ్‌ అనేట్టుగా మార్చాడు.

ప్రాణమిచ్చే స్నేహితుడు

మహీ స్నేహానికి ప్రాణమిస్తాడు! చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు విజయాలకు కారణమిదే. మిత్రుడిగా మెలగని నాయకుడు బృందస్ఫూర్తిని రగిలించలేడు. ధోనీ వీడ్కోలు ప్రకటించిన వెంటనే రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడంటే కారణమేంటో సులువుగానే ఊహించుకోవచ్చు. వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌బ్రావోకు మహీ అంటే పిచ్చి. కోహ్లీలాంటి ఆటగాడు సైతం ఎప్పటికీ తన కెప్టెన్‌ ధోనీయే అని చెప్పడానికి కారణమూ స్నేహమే. కెప్టెన్‌ అయినప్పటికీ తన గది తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయని, ఏ అర్ధరాత్రైనా తన గదికి రావొచ్చని తన జట్టు సభ్యులతో ధోనీ చెప్తాడు. అంత స్వేచ్ఛనిస్తాడు. అంబటి రాయుడిని సైతం అతడెంతో ప్రోత్సహించాడు. అందుకే అతనంటే జట్టు సభ్యులకు చెప్పలేనంత ఇష్టం.

క్రికెట్‌ యోగి!

ధోనీలో ఒక తత్వవేత్తా ఉన్నాడు. అతడిలో విరాగితత్వం కనిపిస్తుంది. ఎందుకంటే మ్యాచులు గెలిచినా ఓడినా అతడిలో స్పందనేమీ కనిపించదు. నరాలు తెగే ఉత్కంఠం ఉన్నా అతడు చలించకుండా ఉంటాడు. గెలిచినా ఓడినా పోయేదేమీ లేదనట్టుగా వ్యవహరిస్తాడు. ఆడంబరాలు, ఆర్భాటాలు కనిపించనివ్వడు. తన దారేదో తనది! సామాజిక మాధ్యమాలకూ దూరంగా ఉంటాడు. భార్యాపిల్లల్ని ప్రేమిస్తాడు. తన సహచరులనూ ప్రేమిస్తాడు. అదే సమయంలో వారితో ఎడబాటూ కలిగి ఉంటాడు. ఎటాచ్‌మెంట్‌ విత్‌ డిటాచ్‌మెంట్‌ అన్నమాట! అనామకుడిగా అరంగేట్రం, గొప్ప ఆటగాడిగా నిష్క్రమణా సాధారణమే. అందుకే అతడో క్రికెట్‌ యోగి! ఇంకా అతడిలో దేశభక్తి వంటి కోణాలు అనేకం ఉన్నాయి.
Thanks for reading M S Dhoni has excelled in many roles : బహుముఖ పాత్రల్లో ఒదిగిపోయిన ధోనీ.

No comments:

Post a Comment