2020 నేర్పిన ఆర్థిక పాఠాలు
ఈ 2020 సంవత్సరం ఎంతో మంది జీవితాలను అతలాకుతలం చేసింది. దాదాపు ఏడాది ఆరంభం నుంచి చివరి వరకూ ఒకే రకమైన పరిస్థితులు నెలకొన్నాయి. అనేక మంది చిరు వ్యాపారులు, ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దీనికి కరోనా వ్యాప్తి ఒక ఎత్తయితే.. దాని మూలంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం మరో ఎత్తు. ముందు చూపుతో వ్యవహరించకపోవడం వల్లే ఎంతో మంది ఆర్థికంగా ఒడుదొడుకులు ఎదుర్కొన్నారని నిపుణులు చెబుతున్నారు. జీవితాలను తలకిందులు చేసినా.. ప్రజలకు 2020 కొన్ని ఆర్థిక పాఠాలను నేర్పిందని చెబుతున్నారు. అవేంటో చూద్దామా?
1.అత్యవసర నిధి తప్పని సరి
కరోనా నేపథ్యంలో మార్చి 22 నుంచి ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. ఆగస్టు చివరి నుంచి నెమ్మదిగా కార్యకలాపాలు మొదలయ్యాయి. దాదాపు ఆరు నెలలపాటు ఆదాయం రాకపోతే సగటు జీవి కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎంతో మంది చిరు వ్యాపారుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. అలా కాకుండా ఉండాలంటే కచ్చితంగా అత్యవసర నిధిని సమకూర్చుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితులను బట్టి కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలలకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధిగా ఉంచుకోవాలని అంటున్నారు. ఇప్పటి వరకు అలా చేయకపోయినా ఇటీవల పరిస్థితులను గుర్తుంచుకొని వచ్చే ఏడాది నుంచైనా ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో కొంత మొత్తాన్ని అత్యవసర నిధి కింది భద్రపరచుకోవాలని చెబుతున్నారు. భవిష్యత్‌లో కరోనా లాంటి సంక్షోభ పరిస్థితులు తలెత్తినా అత్యవసర అవసరాలను ఈ నిధి నుంచి తీర్చుకోవచ్చనే ధీమా ఏర్పడుతుంది.
2. ఆరోగ్య బీమా తీసుకోండి
కేవలం మన దేశంలోనే కాదు..ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎప్పుడు ఎలాంటి విపత్తు ముంచుకొస్తుందో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఈ తరుణంలో ఓ సామాన్యుడు తన కుటుంబ సభ్యులకు సరైన వైద్యమందించడం అంతసులువేం కాదు. ఈ సమస్యలను ఎదుర్కోవాలంటే ఆరోగ్య బీమా కచ్చితంగా తీసుకోవాల్సిందే. అయితే కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వమే కొన్ని పథకాల ద్వారా ఆరోగ్య బీమా కల్పిస్తున్నప్పటికీ, వాటి పరిధిలోకి రానివారు ఎట్టిపరిస్థితుల్లో పాలసీ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని సంస్థలు ఆయా ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు బీమా సదుపాయం కల్పిస్తుంటాయి. అయితే కరోనా లాంటి సంక్షోభాలతో ఉద్యోగం కోల్పోయే ప్రమాదమూ లేకపోలేదు. అందువల్ల సంస్థలు అందించే బీమాతోపాటు వ్యక్తిగతంగా పాలసీ తీసుకోవడం ఉత్తమం.
3. అనవసర రుణాల జోలికి పోవద్దు
తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని, ఒక్క క్లిక్‌తో మీ బ్యాంకు అకౌంట్‌లో డబ్బు చేరుతుందని చాలా మంది ఫోన్లు చేస్తుంటారు. వాటికి ఆకర్షితులై చాలా మంది అంతగా అవసరం లేనప్పటికీ రుణాలు తీసుకుంటారు. వాటిని సరైన పద్ధతిలో తిరిగి చెల్లిస్తే సరేసరి.. లేదంటే ఆయా సంస్థలు వేసిన వడ్డీలకు సామాన్యుడు చితికి పోవాల్సిందే. దీనికి కరోనా కాలమే మంచి ఉదాహరణ. ఉపాధి కోల్పోవడంతో చాలా మంది రుణాలు తిరిగి చెల్లించలేక నానా అవస్థలు పడ్డారు. అదే చిన్నపాటి అవసరాలకు కూడా లోన్లపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తే.. అంతగా ఇబ్బంది పడే అవకాశాలు ఉండేవి కావని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా నూతన సంవత్సరంలో ఆర్థికంగా తగుజాగ్రత్తలు తీసుకొని, వీలైనంత వరకు అనవసర రుణాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
4. పెట్టుబడులను మానొద్దు
జీవిత లక్ష్యాలను నెరవేర్చుకోవాలంటే పెట్టుబడులు చాలా ముఖ్యం. మొదట్నుంచీ రూపాయి రూపాయి కూడబెట్టినప్పుడే అవసరానికి అది ఓ నిధిగా మారుతుంది. దీనిపై అవగాహన ఉన్న కొద్ది మంది మాత్రం..కరోనా సంక్షోభానికి ముందు వరకు మ్యూచువల్ ఫండ్లు, ఇతర ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేవారు. అయితే మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈక్విటీలు, స్టాక్‌మార్కెట్లు చాలా కుదుపునకు లోనయ్యాయి. గత చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నష్టాలను చవి చూశాయి. ఓ పక్క ఉద్యోగాలు కోల్పోవడం, మరోవైపు కుటుంబ పోషణ భారం కావడంతో వాటిని పక్కన పెట్టేసిన వారు కొందరైతే.. సంక్షోభ సమయంలో మార్కెట్లు నష్టాల్ని చవి చూడటంతో.. ఆందోళనకు గురై పెట్టుబడులను నిలిపి వేసిన వారు మరికొందరు. ఇది అంతమంచి పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు పెట్టుబడులను నిలిపివేయవద్దని చెబుతున్నారు. ప్రస్తుతానికి మార్కెట్లు నష్టాలతో సతమతమైనప్పటికీ భవిష్యత్‌లో పుంజుకునే అవకాశముంది. ఏ రంగంలో పెట్టుబడులు పెట్టినా లాభాలు రావాలంటే మాత్రం కొన్ని రోజులపాటు వేచి చూడాలని, ఆదరాబాదరగా నిర్ణయాలు తీసుకోకూడదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
5. వివిధ మార్గాల్లో పెట్టుబడి
కరోనా సంక్షోభంతో పెట్టుబడిదారుల ఆలోచనల్లోనూ చాలా మార్పులు వచ్చాయి. ఒకే చోట పెట్టుబడి పెట్టకుండా వివిధ మార్గాలను ఎంచుకోవడం ముఖ్యమని తెలుసుకున్నారు. ఈ ఏడాది మొత్తాన్ని నిశితంగా గమనిస్తే.. ఓ వైపు స్టాక్‌మార్కెట్లు కుదేలైనప్పటికీ బంగారం ధరలు మాత్రం అమాంతం పెరిగిపోయాయి. దీంతో చాలా మంది సురక్షిత పెట్టుబడి మార్గమైన బంగారం వైపు మొగ్గారు. దీనిని బట్టి కరోనా సంక్షోభానికి ముందు బంగారంలో పెట్టుబడి పెట్టిన వారి పంట పండిందని చెప్పవచ్చు. కాగా, మహమ్మారి సమయంలో ఫార్మా, ఎఫ్ఎంసిజి( ఫాస్ట్ మూవింగ్ కంజ్యూమర్ గూడ్సు) రంగాల షేర్లు లాభపడగా, ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు, ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. అందువల్ల ఎప్పుడూ ఒకే రకమైన పెట్టుబడి మార్గాన్ని ఎంచుకోవడం అంత శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు.
Thanks for reading Financial lessons taught by 2020
No comments:
Post a Comment