Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, December 12, 2020

How is the corona vaccine treated?.......Exclusive interview with Dr. Bapujirao, a prominent Telugu doctor in Britain ...


 కరోనా టీకా తీసుకున్నాక ఎలా ఉంటుందంటే?.......బ్రిటన్‌లో ప్రముఖ తెలుగు వైద్యులు డాక్టర్‌ బాపూజీరావుతో ప్రత్యేక ఇంటర్వ్యూ...

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ అంతానికి వ్యాక్సినే దివ్యౌషధంగా భావిస్తున్న ప్రజలు దానికోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలోనే బ్రిటన్‌లో ఫైజర్‌ టీకా మార్కెట్లోకి వచ్చేసింది. దశల వారీగా వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు యూకే ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లతో పంపిణీకి సిద్ధమైంది. ప్రస్తుతం అక్కడి ప్రజల్లో కొంత మంది టీకాలు తీసుకుంటున్నారు. వారిలో తెలుగు వారు, ప్రముఖ వైద్యులు డాక్టర్ వెలగపూడి బాపూజీరావు కూడా ఉన్నారు. అయితే, ఈ టీకా బ్రిటన్‌లో ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చింది? అక్కడి అధికారులు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎలా చేపడుతున్నారు? టీకాలు తీసుకున్న వారిపై ఎలాంటి ప్రభావాలు ఉన్నాయి? తదితర అనేక అంశాలను ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. టీకా తీసుకున్నాక ఆయన చెప్పిన కీలక అంశాలను పరిశీలిస్తే.. 


డాక్టర్‌ గారూ.. మీరు కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నట్టు తెలిసింది. వ్యాక్సిన్‌ ఎవరు తయారుచేశారు? ఎప్పటి నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది?

యూకేలో నేషనల్‌  హెల్త్‌ సర్వీస్‌లో ఇప్పుడు ఇస్తున్న వ్యాక్సిన్‌ పేరు ఫైజర్‌. ఇది బయోఎన్‌టెక్‌ వాళ్లు అభివృద్ధి చేశారు. దాదాపు 20వేల మందికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టారు. మెడిసిన్స్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొడెక్ట్స్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్‌ఏ) ఈ వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చింది. దీంతో గురువారం నుంచి ఎన్‌హెచ్‌ఎస్‌ యూకేలో 70 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ మొదలుపెట్టింది. 

వ్యాక్సినేషన్‌ కోసం బ్రిటన్‌ ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసింది? 

యూకేలో నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ బాగా అభివృద్ధి చెందినది. రెండో ప్రపంచ యుద్ధం నుంచీ ఇది ఉంది. యూకేలో మంచి వైద్య  సదుపాయాలు ఉన్నాయి.  ఐటీ, మానవ వనరులూ అందుబాటులో ఉన్నాయి. ఆస్పత్రుల్లో పనిచేసే ఆరోగ్య సిబ్బందికి రెండు- మూడు వారాల పాటు శిక్షణ ఇచ్చారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. వ్యాక్సిన్‌ వేయించుకొనేవాళ్లకు తొలుత అపాయింట్‌మెంట్‌ ఇస్తారు. ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకొన్న వాళ్లే వెళ్లాలి. వ్యాక్సిన్‌ వేసే ముందు తొలుత శరీర ఉష్ణోగ్రతలను చూస్తారు. ఆ తర్వాత కొన్ని ప్రశ్నలు అడుగుతారు. మీకు కొవిడ్‌ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? ఈమధ్య ఫ్లూ వ్యాక్సిన్లు ఏమైనా తీసుకున్నారా? మిగతా వ్యాక్సిన్లు తీసుకున్నాక ఒక నెల వరకు కొత్త వ్యాక్సిన్‌ తీసుకోరాదు. కొవిడ్‌ లక్షణాలేమైనా గతంలో వచ్చాయా? కొవిడ్ రోగులను కలిశారా? ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు.  అలర్జీకి సంబంధించిన అంశాలపైనా కొన్ని ప్రశ్నలు అడిగారు. అలర్జీ రియాక్షన్లు ఉన్నవాళ్లకు వ్యాక్సినేషన్‌ తర్వాత కొందరిలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పుడు వాళ్లు బాగానే ఉన్నారు.

కరోనా వ్యాక్సిన్‌ ఎలా తీసుకోవాలి? ఎన్ని డోసులు తీసుకోవాలి? 

యూకేలో పబ్లిక్‌ హెల్త్‌ వాళ్లు ప్రాధాన్య గ్రూప్‌లను ఏర్పాటు చేశారు. రెసిడెంట్స్‌ హోం, నర్సింగ్ హోం రెసిడెంట్స్‌, కేర్‌ స్టాఫ్‌కి, రెండోది హెల్త్‌ అండ్‌ సోషల్‌ కేర్‌ స్టాఫ్‌ 80 ఏళ్లకు పైబడినవారు. మూడో గ్రూప్‌ 75 ఏళ్లు పైబడిన వారు.. నాలుగో గ్రూపు 70 ఏళ్లు పైబడినవారు. ప్రస్తుతం తెచ్చిన శాంపిల్స్‌ 10 మిలియన్‌ పేషెంట్లకు సరిపోయేలా ఉన్నాయి. 40 మిలియన్‌ డోసులు తీసుకొస్తే జనవరి - మార్చి నెలల్లో మిగతా బ్రిటిష్‌ పౌరులందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వొచ్చు. రెండు డోసులుగా ఈ వ్యాక్సిన్‌ ఇవ్వాలి. తొలి డోసు తీసుకున్న నాలుగు వారాల తర్వాత రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుంది. రెండో డోసు తీసుకున్న కొద్ది రోజుల తర్వాత ఇమ్యూనిటీ వస్తుంది.

వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత మీపై ఎలాంటి ప్రభావం ఉంది?

వ్యాక్సిన్‌ ఇచ్చిన తర్వాత 15 నిమిషాలు అక్కడే హాలులో కూర్చోమంటారు. సైడ్‌ ఎఫెక్ట్స్‌ గురించి కరపత్రం ఇచ్చారు. వ్యాక్సినేషన్‌ తర్వాత ఒక్కోసారి 24గంటల్లో జ్వరం, తలనొప్పి, ఇతర ఇబ్బందులేవైనా ఉంటే గుర్తించేందుకు. క్లినికల్‌ ట్రయల్స్‌లో కూడా ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి తీవ్రమైన సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమీ రాలేదు. కాకపోతే, పారాసిటమాల్‌ వంటి డ్రగ్స్‌ తీసుకుంటే చాలని చెబుతున్నారు. వ్యాక్సిన్‌ వేసుకున్నాక కరోనా లక్షణాలు కొంత వరకు రావొచ్చు. వ్యాక్సినేషన్‌ తర్వాత కొవిడ్ వ్యాధి రాదు.. కాకపోతే ఆ వ్యాధి సంబంధిత లక్షణాలైతే కనబడవచ్చు. ఫ్లూ వ్యాక్సినేషన్‌లాగానే ఉంది.

ఫైజర్‌ టీకా ఎంత కాలం పాటు భద్రతను ఇస్తుంది? ఫలానా టైం వరకు పనిచేస్తుందని ఏమైనా చెప్పారా?


తాత్కాలికంగానే ప్రభావం చూపుతుందనేది ఒక భావన. ఫుడ్‌ అండ్‌ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఎమర్జెన్సీ ఆథరైజేషన్‌ కిందే చూపించారు. ప్రజల్లో టీకా వేసిన తర్వాత ఫలితాలపై సర్వే చేస్తారు. ప్రస్తుతం ఫ్లూ వ్యాక్సిన్లు ఏటా చేస్తున్నట్టే ఇది కూడా మళ్లీ రిపీట్‌ చేస్తారనేది కూడా వినబడుతోంది. కాకపోతే సైంటిఫిక్‌  ఒపీనియన్‌ పూర్తిగా తెలియదు.

ఫైజర్‌ టీకా ఏ వయస్సు వాళ్లు తీసుకోవాలి?

ఎవరు తీసుకోవాలి? తీసుకోకూడదనే దానిపై వయస్సు పరిమితులేమీ పెట్టలేదు. గర్భిణులు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్లు తీసుకోకూడదని పెట్టారు గానీ.. వయో పరిమితి మాత్రం పెట్టలేదు.

అలర్జీ వంటి లక్షణాలు ఉన్నవారు కూడా వ్యాక్సిన్‌ తీసుకోవచ్చో, లేదో ఏమైనా చెప్పారా? అలాంటి వారు తీసుకూడదనే ప్రచారం భారత్‌లో జరుగుతోంది. దీంట్లో వాస్తవం ఉందా?

సీరియస్‌ అలర్జీ రియాక్షన్స్‌ ఉన్నా.. ఇదివరకు పెన్సిలిన్, మిగతా ఔషధాలు గనక రియాక్షన్‌ చూపించి ఉంటే ఈ టీకాలను వెంటనే తీసుకోకూడదు. జనరల్‌ ప్రాక్టీషనర్‌ను సంప్రదించాలి. ప్రతి అలర్జీకి కాదు గానీ అంతకు ముందు సీరియస్‌ రియాక్షన్‌ వచ్చినవారికి మాత్రం వ్యాక్సిన్‌ తీసుకోకూడదు.

కరోనా వ్యాక్సిన్‌ ఇప్పుడు ఎలాగూ బ్రిటన్‌లో అందుబాటులోకి వచ్చింది కదా. అక్కడ జనజీవనం సాధారణ స్థితికి చేరుకుందా?

వ్యాక్సినేషన్‌ ఇచ్చారు కదా అని మనం అజాగ్రత్తగా ఉండకూడదు. వ్యాక్సినేషన్‌ తర్వాత కూడా చేతులు కడుక్కోవడం, భౌతికదూరం పాటించడం కచ్చితంగా అమలుచేయాలి. సమాజంలో నుంచి వైరస్‌ పోయేందుకు వచ్చే ఏడాది వరకు పట్టొచ్చని అనుకుంటున్నారు. వ్యాక్సినేషన్‌ విజయవంతమై ఆస్పత్రుల్లో, సమాజంలో కొవిడ్‌ కేసులు బాగా తగ్గడం మొదలయ్యాక ఆంక్షలు సడలించొచ్చని అంటున్నారు. 

కరోనా ప్రభావం మనుషులపై ఎలాంటి మానసిక ఇబ్బందులకు దారితీసిందని మీరు గ్రహించారు? 

కరోనా వైరస్‌ తీవ్రమైన మానసిక ఇబ్బందులు సృష్టించింది. నేను వృద్ధుల మానసిక ఆరోగ్యాన్ని పరిశీలిస్తుంటాను. ఈ వైరస్‌ కారణంగా కుటుంబ సభ్యులను కలవలేకపోతున్నారు. చాలా మందిలో ఒత్తిడి, ఆందోళన, భయం ఉంది. సైకియాట్రిక్‌ వార్డులో ప్రతి 20 పడకల్లో కనీసం 15 మంది ఒంటరితనం, వైరస్‌ వస్తుందన్న భయం, పక్కింటివాళ్ల నుంచి, ఎవరైనా మాట్లాడేందుకు  వస్తే వాళ్ల నుంచి కూడా వైరస్‌ సోకుతుందన్న భయం ఉంది. 65 ఏళ్లు పైబడిన వారిలో ఒత్తిడి కూడా బాగా పెరుగుతోంది.

Thanks for reading How is the corona vaccine treated?.......Exclusive interview with Dr. Bapujirao, a prominent Telugu doctor in Britain ...

No comments:

Post a Comment