కోపంతో కాదు ప్రేమతోనే ..
●తల్లిదండ్రులూ..జరశాంతి
●చిట్టి మనసులపై అజమాయిషీ వద్దు
●ఆప్యాయతతో భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుదాం..
●దండిస్తే మార్పు రాదు
●మారాం చేసే పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాల్సిందే
●అందరికీ ఐక్యూ ఒకేలా ఉండదు
●ప్రోత్సహిస్తే.. వారిలో నూతనోత్తేజం
●ఆవేశం కాదు.. ఆలోచన ఉండాలంటున్న సైకాలజిస్టులు
●కథల రూపంలో భవిష్యత్ చెప్పాలంటున్న టీచర్లు
'చదువుకోలేదని ఓ తండ్రి నిప్పంటించాడు.. తన నిద్రకు ఆటంకం కలుగుతుందని మరో తండ్రి రాత్రి 8 గంటలకే ఇంట్లో లైట్ ఆపేయ్యాలని హుకూం జారీ చేశాడు. హోం వర్క్ సమయానికి చేయడం లేదని ఇంకో తండ్రి పిడిగుద్దులు.'..ఇలా చిన్నారులపై పాశవికంగా దాడులు చేస్తూ..తండ్రులు తమ సహనం కోల్పోతున్నారు. పిల్లలు మారాం చేస్తే ఆగ్రహంతో కాదు.. ఆప్యాయతతో వారిని గెలవాలనే ఇంగితం వారిలో కరువవుతున్నది. ఫలితంగా పసిమొగ్గలు అర్ధాంతరంగా రాలిపోతున్నాయి.
వాళ్లు నవ్వుల పువ్వులు.. కల్మషం లేని పసివాళ్లు.. చిన్నగా గద్దరింపునకే చిట్టి మనసులు వాడిపోతాయి. కండ్లు పెద్దగా చేసి చూస్తేనే భయపడిపోతారు. అంతటి సున్నితత్వపు హృదయులు పిల్లలవి. వారిని కోపంతో కాదు.. ప్రేమతోనే జయించగలం. తల్లిదండ్రులకు ఉండాల్సింది సహనం. పని ఒత్తిడితో ఆ కోపాన్ని చిన్నారులపై ప్రదర్శిస్తున్నారు కొందరు తల్లిదండ్రులు. పిల్లాడు చదువలేదని.. చెబితే వినడం లేదని.. అతి మారం చేస్తున్నారని వారిపై విభిన్న రకాలుగా దాడులు చేసి.. చిట్టి హృదయాలను చిదిమేస్తున్నారు. చదువుకోలేదని ఓ బాలుడిపై టర్పెంటాయిల్ పోసి నిప్పంటించాడో తండ్రి. చికిత్స పొందుతూ మరణించాడు ఆ బాలుడు. ఈ హృదయ విదారక సంఘటన ప్రతీ పేరెంట్‌ను ఆలోచనలో పడేసింది. పిల్లలతో వ్యవహరించే విధానం ఎలా ఉండాలో మరోసారి హెచ్చరించింది.
కోపమేలా..
సాధారణంగా చిన్నారులు విభిన్న రకాల మనస్తత్వంతో ఉంటారు. ఒక్కో విద్యార్థి ఒక్కో ఆటిట్యూడ్‌తో నడుచుకుంటారు. ఇంట్లో పెరిగిన విధానం.. వారి చుట్టూ పరిస్థితుల ఆధారంగా వారు బిహేవ్ చేస్తుంటారు. అందరి విద్యార్థుల ఐక్యూ లెవల్స్ ఒకేలా ఉండవు. కారణం వారిలోని జన్యు మార్పులు. అందుకే పిల్లాడి మనస్తత్వాన్ని అంచనా వేసి వారికి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత అటు తల్లిదండ్రుల మీద ఇటు టీచర్లపైనా ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.
అర్థమయ్యేలా చెప్పాలి...
పిల్లలు హోం వర్క్ చేయడం లేదంటే పేరెంట్స్ గమనించాల్సింది వారిలోని అనాసక్తికి గల కారణాలను. కానీ కొందరు తల్లిదండ్రులు కోపంతో వారిని చితకబాదడం, పెట్రోల్ పోసి నిప్పంటించడం, పిడిగుద్దులు గుద్దడం వంటివి చేస్తున్నారు. చిన్నారులపై ఆ రకమైన దాడులకు పాల్పడితే పిల్లల్లో మార్పు రాదని వారికి అర్థమయ్యేలా వివరిస్తేనే మంచి ఫలితాలుంటాయని సైకాలజిస్టులు, టీచర్లు చెబుతున్నారు.
మారాం చేస్తే...
- పిల్లలు హోం వర్క్ చేయకపోతే ఎందుకు చేయడం లేదో అడిగి తెలుసుకోవాలి. కారణాలకు అనుగుణంగా వారితో చర్చించి ఒప్పించాలి.
- హోం వర్క్ చేయడం వల్ల చేతులకు ఏదైనా నొప్పి కలుగుతుందా? లేదా ఇంకేదైనా బాధ ఉందా? అని అడిగి తెలుసుకోవాలి.
- చేయాల్సిన హోం వర్క్ కంటే ఎక్కువగా ఉంటే సంబంధిత టీచర్‌ను అడిగి ఎందుకు ఎక్కువ హోం వర్క్ ఇచ్చారో తెలుసుకుని విద్యార్థిని మోటివేట్ చేయాలి.
- భారంగా ఉండే హోం వర్క్ ఎలా సింపుల్‌గా చేయాలో మెలకువలు నేర్పించాలి.
- పదేపదే చదవమని ఒత్తిడి తీసుకురాకుండా వారికి నచ్చిన ఆటలు ఆడుకునేలా ప్రోత్సహించాలి.
- పిల్లలు చెప్పిన మాట వినకుంటే ఆగ్రహాన్ని ప్రదర్శించకుండా.. ప్రేమతో కౌగిలించుకుని బుజ్జగిస్తూ చదువు ప్రాధాన్యతను వివరించాలి.
- పిల్లల ఆరోగ్య పరిస్థితి పరిశీలించాలి. సమయానికి తినడం, నిద్రపోవడం సరిగా జరుగుతున్నాయా అని గమనించాలి.
- స్కూల్లో ఏదైనా విషయంలో భయానికి గురవుతున్నాడా? ఏ టీచర్‌కైనా భయపడుతున్నాడా? వంటి విషయాలు తెలుసుకుని సమస్యలను పరిష్కరించాలి.
- తల్లిదండ్రులు చిన్నారులతో స్నేహితులుగా వ్యవహరించాలి. అప్పుడే వారు తమ సమస్యలను ఓపెన్‌గా చెబుతారు.
పిల్లల్లో ప్రశ్నించేతత్వం పెరిగింది. ఇది సహజం. సమాచార లభ్యత కూడా బాగా పెరిగింది. ఇంటర్‌నెట్, టీవీ, సినిమాలు ఇతరత్రా వాటి వాల్ల ఈ కాలం పిల్లల్లో ఎక్కువ మెచ్యూరిటీ కూడా ఉంది. వారిలో 'అంతా నాకు తెలుసు' అనే భావన కలుగుతుంటుంది. దానిని అర్థం చేసుకుని పేరెంట్స్ వ్యవహరించాలి.
పిల్లలకు రోల్ మోడల్‌గా ఉండాలి
శిక్షించడం వల్ల పిల్లలు ఏదీ నేర్చుకోలేరు. పిల్లలను క్రమశిక్షణలో పెట్టడం చాలా అవసరం. వారి వికాసానికి అది చాలా మంచిది. అయితే అది ఏ మోతాదులో ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్రమశిక్షణ పేరుతో పిల్లలను శిక్షిస్తే తల్లిదండ్రులపై ద్వేష భావన కలుగుతుంది. పిల్లలు చేసిన పనిని మాత్రమే తప్పు పడుతున్నాం. కానీ పిల్లలను కాదు అనే విషయం వారికి అర్థమయ్యేలా వివరించాలి. పేరెంట్స్ మధ్య ఉన్న గొడవలు, ఆఫీసులో ఉండే ఒత్తిడి తాలుకా ఫ్రస్టేషన్స్ అన్నీ చిన్నారులపై చూపించొద్దు. కోపాలపై నియంత్రణ ఉండాలి. వారి కోసం సమయం కేటాయించి పిల్లలతో గడపాలి. మంచి పనిచేసినప్పుడు ప్రోత్సహించడం వల్ల వారిలో నూతనోత్తేజం కలుగుతుంది. - డాక్టర్ స్వాతి, కౌన్సెలింగ్ సైకాలజిస్టు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైకాలజీ, ఓయూ.
పిల్లల లక్ష్యాలను నిర్ణయించొద్దు
పిల్లలను ఏదైనా పని చేయవద్దంటే ఎందుకు చేయొవద్దంటున్నారో కారణం కావాలని మొండికేస్తారు. కొందరు పేరెంట్స్ పిల్లలను బాగా గారాబం చేస్తారు. దాంతో ఏది అడిగినా.. చెల్లుబాటు అవుతుందనే ధోరణి వారిలో కలుగుతుంది. ఫలితంగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభిస్తారు. చిన్నతనంలో ఏదీ మంచిదో ఏదీ చెడో చెప్పి వివరించకపోతే చాలా ప్రమాదం. పదేపదే చదువమని ఒత్తిడి తెస్తే నసగా భావిస్తారు చిన్నారులు. పిల్లల ఇష్టాన్ని బట్టీ లక్ష్యాలు నిర్ణయించాలి. పేరెంట్స్ లక్ష్యాలను వారిపై రుద్దొద్దు. వారిని అర్థం చేసుకుని వ్యవహరించాలి. - వాసిరెడ్డి అమర్‌నాథ్, యజమాని, స్లేట్ స్కూల్.
తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం
పిల్లలకు కోపంతో చెబితే వారి మనసు గాయపడుతుంది. బలవంతంగా హోం వర్క్ చేయించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. మాట వినని చిన్నారుల సమస్యలను తెలుసుకుని అందుకు తగ్గ పరిష్కారాలను వెతకాలి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలతో కఠినంగా ప్రవర్తిస్తున్నారు. అది సరైనది కాదు. దాడులు చేసి మార్పు తీసుకురాలేం. అలాంటి సంఘటనలు మా దృష్టికి వస్తే పేరెంట్స్‌ను పిలిపించి కౌన్సెలింగ్ చేస్తున్నాం. - నిర్మల, టీచర్, ప్రభుత్వ నెహ్రూ మెమోరియల్ హై స్కూల్. (జ్యోతిబాపూలే అవార్డు గ్రహీత)
ఆటంకాలు లేకుండా చూడాలి
పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారా లేదా పరిశీలించుకోవాలి. హోం వర్క్ చేయడం లేదంటే విద్యార్థికి అర్థమైందా?లేదా? అడగాలి. ఎక్కువగా ఉన్నా హోం వర్క్ చేయడానికి ఇష్టపడరు. అలాంటి సందర్భంలో విద్యార్థుల స్థాయికి అనుగుణంగా ఉన్న హోం వర్క్ ఇవ్వాల్సి ఉంటుంది. పేరెంట్స్ టీవీ సీరియల్స్ చూస్తూ పిల్లలను చదువుమని చెబితే వారు హోం వర్క్ చేయరు. పిల్లలు చదువుకునే సమయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలి. -వి. పద్మప్రియ, టీచర్, (జాతీయ అవార్డు గ్రహీత)
Thanks for reading Not with anger but with love ..
No comments:
Post a Comment