News: పది, ఇంటర్ పరీక్షలు రద్దు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
‘‘జులై 31 లోపు ఇంటర్ ఫలితాలు వెల్లడించాలని సుప్రీం కోర్టు చెప్పింది. ఇంటర్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనానికి 45 రోజుల సమయం పడుతుంది. సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం పరీక్షల నిర్వహణ అసాధ్యం. మార్కులు ఏ పద్ధతిలో ఇవ్వాలో త్వరలో చెబుతాం. ఫలితాల కోసం హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయ లోపం లేదు. విద్యార్థులు నష్టపోకూడదనే పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నాం’’ అని మంత్రి వెల్లడించారు.
పదో తరగతి, ఇంటర్‌పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై ఈరోజు ఉదయం సుప్రీం కోర్టు అనేక ప్రశ్నలు సంధించింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి పక్కా సమాచారం ఇవ్వాలని ఆదేశించినా అఫిడవిట్‌లో అది ఎక్కడా కనిపించలేదని పేర్కొంది. పరీక్షల నిర్వహణే ఆలోచనగా ఉండొద్దని, సిబ్బంది, విద్యార్థుల రక్షణ కోణంలోనూ ప్రభుత్వం ఆలోచించాలని తెలిపింది. ఒక్కరు చనిపోయినా.. రూ.1 కోటి పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. మన నిర్ణయాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలని వ్యాఖ్యానించింది. పరీక్షలు నిర్వహించే గదుల వివరాలు కూడా అఫిడవిట్‌లో ఎక్కడా లేవని.. ప్రభుత్వం ఇచ్చే లెక్కల ప్రకారం చూస్తే సుమారు 28 వేల గదులు అవసరమవుతాయని వ్యాఖ్యానించింది. కరోనా వేళ ఒక్కో గదిలో 15 నుంచి 20 మంది కూర్చోవడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. 15 రోజుల ముందుగా టైం టేబుల్ ఇస్తామంటున్నారు..ఆ సమయం సరిపోతుందని ఎలా చెప్తారని ప్రశ్నించింది. రెండో దశలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో కళ్లారా చూశాం కదా.. అని ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. సుప్రీంకోర్టు సూచనలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు పదోతరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
Thanks for reading AP 10th and Inter Exams Cancelled
No comments:
Post a Comment