Corona: ఊరటనిచ్చే ‘పాజిటివ్’ న్యూస్!
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తోంది. కొత్త కేసులు రోజురోజుకీ గణనీయంగా తగ్గుతున్నాయి. రికవరీల పెరుగుదల స్థిరంగా కొనసాగుతుండటంతో యాక్టివ్ కేసుల గ్రాఫ్ తగ్గుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకొంటోంది. కొత్త టీకాలు దేశంలోకి వస్తున్నాయి. రెండు దశల్లోనూ కరోనా వైరస్ చిన్నారులపై స్వల్ప ప్రభావమే చూపించినట్టు కేంద్రం వెల్లడించింది. ఏపీకి సిక్మా 200 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను విరాళంగాఅందజేసింది. కరోనా కష్టకాలంలో ఉపశమనం ఇచ్చే కొన్నివార్తలు మీకోసం..
* భారత్‌లో 75 రోజుల తర్వాత కొత్త కేసులు 60వేలకు తగ్గాయి. కొవిడ్ కేసుల గరిష్ఠ స్థాయి( మే 7 రోజు) నుంచి 85శాతం మేర కరోనా కేసులు తగ్గినట్టు కేంద్రం వెల్లడించింది. 165 జిల్లాల్లోనే వందకు పైగా రోజువారీ కేసులు నమోదైనట్టు తెలిపింది. యాక్టివ్ కేసులు 10లక్షల దిగువకు చేరాయని, సగటున రోజుకు 18లక్షలకు పైగా పరీక్షలు చేస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటివరకు 26కోట్లకు పైగా డోసులు పంపిణీ చేయగా.. నిన్న ఒక్కరోజే 39.27లక్షల డోసులు అందించారు. వరుసగా ఎనిమిదో రోజూ పాజిటివిటీ రేటు 5శాతంకన్నా తక్కువే (3.45శాతం) నమోదైంది. యాక్టివ్ కేసులు 9.13లక్షలకు తగ్గాయి.
* కరోనా వైరస్ ప్రభావం చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావమేమీ చూపించలేదని కేంద్రం తెలిపింది. కరోనా తొలి దశలో పదేళ్ల లోపు పిల్లల్లో 3.28శాతం మందికి కరోనా సోకగా.. రెండో దశలో 3.05శాతంగా ఉన్నట్టు గణాంకాలు వెల్లడించింది. అలాగే, 11 నుంచి 20 ఏళ్ల లోపు వారిలో తొలిదశలో ఈ వైరస్ 8.03శాతం మందికి సోకగా.. రెండో దశలో 8.5శాతం మందికి సోకినట్టు తెలిపింది. థర్డ్ వేవ్ ప్రభావం చిన్నపిల్లలపై ఉంటుందని చెప్పేందుకు ఆధారాల్లేవని కేంద్రం ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేసిన విషయం తెలిసిందే. కొవిడ్ బారినపడకుండా తగు జాగ్రత్తలపై చిన్నారుల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించింది.
* భారత్‌లో త్వరలోనే నోవావాక్స్ టీకా భారీగా తయారవుతుందని భావిస్తున్నట్టు నీతిఆయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు వీకే పాల్ తెలిపారు. అమెరికాకు చెందిన నోవావాక్స్ సంస్థతో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ కలిసి పనిచేస్తోందని, భారత్‌లో టీకా ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. ఈ టీకా క్లినికల్ ట్రయల్స్ తుది దశకు చేరాయన్నారు. ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు ఆశావహంగానే ఉన్నట్టు పాల్ వివరించారు. మరోవైపు, మూడో దశలో తమ టీకా సామర్థ్యం 90శాతంగా ఉన్నట్టు నోవావాక్స్ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే.
* కరోనాపై పోరాటంలో పలు సంస్థలు తమ వంతు సహకారం అందిస్తూ ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు సౌత్ ఇండియన్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సిక్మా) భారీ సాయం అందించింది. రూ.2కోట్ల విలువ చేసే 200 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను ఆ సంఘం ప్రతినిధులు సీఎం జగన్‌కు అందజేశారు.
* దేశవ్యాప్తంగా 84వేల మందికి పైగా ఉద్యోగులు, వాణిజ్య భాగస్వాములు, వారి కుటుంబ సభ్యులకు తొలి డోసు వేయించినట్టు వేదాంత కంపెనీ వెల్లడించింది. ఆగస్టు నాటికి దేశంలోని అన్ని చోట్ల వ్యాక్సినేషన్ పూర్తవుతుందని భావిస్తున్నట్టు ఆ సంస్థ తెలిపింది. ఇప్పటివరకు తొలి డోసు అందుకోని సందర్శకులకు కూడా వ్యాక్సిన్ వేసే ఆలోచనలో ఉన్నట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.
* రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇంకా 1.05 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వచ్చే మూడు రోజుల్లో మరో 47 లక్షలకు పైగా డోసులను రాష్ట్రాలకు పంపనున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రాలకు ఉచితంగా 26కోట్లకు పైగా (26,69,14,930) వ్యాక్సిన్ డోసులను అందించింది. వాటిలో జూన్ 14 వరకు 25,67,21,069 డోసులను (వృథా అయిన వాటితో కలిపి) పంపిణీ చేసినట్టు తెలిపింది.
* డెల్టా వేరియంట్‌పై రెండు డోసుల ఫైజెర్ టీకా సమర్థంగా పనిచేస్తున్నట్టు పబ్లిక్ ఇంగ్లాండ్ ప్రకటించింది. ఫైజెర్/ బయోఎన్‌టెక్ టీకా రెండు డోసులను తీసుకున్నవారిలో 96శాతం మందికి ఆస్పత్రిలో చేరే పరిస్థితి రావడంలేదని పరిశోధకులు తెలిపారు. అదే, ఆక్స్‌ఫర్డ్/ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కూడా 92శాతం మంది పరిస్థితి మెరుగ్గా ఉన్నట్టు తేలిందన్నారు.
* కరోనా కేసులు తగ్గుతుండటంతో దిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో ఓపీడీ సేవలను పునః ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నెల 18 నుంచి దశల వారీగా అవుట్ పేషెంట్ డిపార్టుమెంట్ (ఓపీడీ) సేవలను ప్రారంచాలని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా నిర్ణయించినట్టు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ డీకే శర్మ తెలిపారు. ఆన్‌లైన్/ టెలిఫోన్‌ద్వారా అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చని సూచించారు.
* ముంబయిలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారవిలో రెండో రోజూ కొత్త కేసులు నమోదు కాలేదు. ఫిబ్రవరి 2 తర్వాత కొత్త కేసులు నమోదు కాకపోవడం సోమవారమే తొలిసారి. ధారవిలో 6861 కేసులు నమోదు కాగా.. 6491మంది రికవరీ అయ్యారు. ధారవిలో ప్రస్తుతం 11 యాక్టివ్‌కేసులు మాత్రమే ఉన్నాయి.
* వైరస్‌ను వడకట్టడమే కాకుండా దాన్ని నిర్వీర్యం కూడా చేసే వినూత్న మాస్కును పుణెకు చెందిన ఒక అంకుర పరిశ్రమ అభివృద్ధి చేసింది. త్రీడీ ముద్రణ, ఔషధ పరిజ్ఞానాన్ని అనుసంధానించడం ద్వారా ఈ ఘనత సాధించింది. థింకర్ టెక్నాలజీస్ ఇండియా సంస్థ ఈ మాస్కును రూపొందించింది.
Thanks for reading corona: Soothing ‘Positive’ News!
No comments:
Post a Comment