Corona: ఊరటనిచ్చే ‘పాజిటివ్’ న్యూస్!
ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోన్న కరోనా వైరస్‌పై పోరాటంలో పలు సంస్థలు ప్రభుత్వాలకు సహకారం అందిస్తున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం గూగుల్ భారత్‌కు భారీ సాయం ప్రకటించింది. ఏపీలో వ్యాక్సిన్ల కొరత తీరేలా మరో 9లక్షల డోసులు చేరుకున్నాయి. జులైలో పిల్లలపై నోవావాక్స్ టీకా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిచేందుకు సీరమ్ సంస్థ సిద్ధమవుతోంది. కరోనా కష్టకాలంలో ఊరటనిచ్చే ఇలాంటి కొన్ని వార్తలు మీకోసం..
* కరోనా కష్టకాలంలో టెక్ దిగ్గజం గూగుల్ భారత్‌కు భారీ సాయం ప్రకటించింది. దేశంలో 80 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు, పలు సంస్థల భాగస్వామ్యంతో ఆరోగ్య కార్యకర్తలకు నైపుణ్య శిక్షణ కోసం రూ.113 కోట్లు సాయం అందిచనున్నట్టు ప్రకటించింది. గివ్ ఇండియా సంస్థకు రూ.90 కోట్లు, పాత్ సంస్థకు రూ.18.5కోట్ల మేర సాయం అందించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో 20వేల మందికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్న అపోలో మెడ్‌స్కిల్స్‌కు ఆర్థిక సహకారం అందించనున్నట్టు తెలిపింది. 15 రాష్ట్రాల్లో ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలకు నైపుణ్య శిక్షణకు ఆర్మాన్ సంస్థకు మరో రూ.3.6కోట్లు ఇవ్వనుంది.
* కరోనాను ఎదుర్కోవడంలో మన దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్లు మెరుగైన పనితీరు కనబరుస్తుండగా.. తాజాగా హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఇ తయారుచేస్తున్న కార్బివాక్స్ వ్యాక్సిన్ దాదాపు 90శాతానికి పైగా ప్రభావశీలత చూపిస్తున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.
* కరోనా కష్ట సమయంలో వాహనదారులకు కేంద్రం ఊరట కల్పించే కబురు చెప్పింది. మోటార్ వాహనాలకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), ఇతర పర్మిట్లకు సంబంధించిన పత్రాల గడువును ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. 2020 ఫిబ్రవరి 1తో గడువు ముగిసిన పత్రాలను ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటు అవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. కొవిడ్ వేళ వాహనదారులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
* మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లా మేఘవాన్ పరియత్ గ్రామం వ్యాక్సినేషన్‌లో ఆదర్శంగా నిలుస్తోంది. అక్కడ అర్హులైన వారంతా తొలి డోసు అందుకున్నట్టు అధికారులు ప్రకటించారు. ఆ గ్రామంలో మొత్తంగా 1002 మంది ఓటర్లుఉండగా.. 956మందికి తొలి డోసు వేశారు. మిగిలిన వారు ఇటీవలే వైరస్ నుంచి కోలుకున్నవారు, గర్భిణులు ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. వీరంతా వైద్యుల సూచనల మేరకు టీకా వేయించుకోలేదు. దీంతో మధ్యప్రదేశ్‌లో 100శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న తొలి గ్రామంగా రికార్డు సృష్టించింది. దీంతో ఆ గ్రామానికి ప్రోత్సాహకంగా స్థానిక ఎమ్మెల్యే రూ.5లక్షలు సాయం అందించారు. ఇప్పటికే కశ్మీర్‌లోని వయాన్ గ్రామం దేశంలోనే 100శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేసుకున్న మొదటి గ్రామంగా నిలిచిన విషయం తెలిసిందే.
* ఏపీకి కొత్తగా మరో 9లక్షల వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి కొవిషీల్డ్ వ్యాక్సిన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకొంది. దీన్ని వ్యాక్సిన్ నిల్వ కేంద్రానికి అధికారులు తరలించారు. అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు కేటాయించనున్నారు. తాజాగా అందిన కొవిడ్ టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్ కొరతకు కొంత ఉపశమనం కలిగినట్లైంది.
* నోవావాక్స్ టీకాను పిల్లలపై ప్రయోగించేందుకు పుణెలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిద్ధమవుతోంది. అమెరికాకు చెందిన నోవావాక్స్ సంస్థతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్.. జులైలో చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. తమ టీకా మూడో దశ ఫలితాల్లో కొవిడ్‌ను ఎదుర్కోవడంలో 90శాతం ప్రభావశీలంగా పనిచేస్తుందని ఇటీవల నోవావాక్స్ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ నాటికి ఈ వ్యాక్సిన్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు సీరమ్ ప్రయత్నిస్తోంది.
* దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. కొత్తగా 19లక్షలకు పైగా టెస్ట్‌లు చేయగా.. 67వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రికవరీలు పెరగడం, మరణాలు తగ్గుముఖం పట్టడం ఉపశమనం కలిగిస్తోంది. అలాగే, నిన్న ఒక్కరోజే 34.6లక్షల డోసులకు పైగా టీకా పంపిణీ జరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 8.26లక్షలకు తగ్గింది. రికవరీ రేటు 95.93శాతానికి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.48శాతంగా ఉంది.
* వయోధికులు, దివ్యాంగులకు కొవిడ్ వ్యాక్సినేషన్‌ను మరింత సరళతరం చేస్తూ ఇళ్లకు సమీపంలోనే టీకా కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం అనుమతించింది. వారికి వీలైనంత వేగంగా టీకాలు వేసేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయమంత్రి రతన్‌లాల్ కటారియా నిన్న తెలిపారు. దీంతో ఎక్కువ మంది వయోధికులు, దివ్యాంగులుకొవిడ్ నుంచి రక్షణ పొందతారని తెలిపారు.
Thanks for reading corona: Soothing ‘Positive’ News!
No comments:
Post a Comment