EPFO: మీ కోసం ముఖ్యమైన 5 అప్‌డేట్లు
ఉద్యోగి అవసరాల కోసం ప్రావిడెంట్ ఫండ్‌ను (PF) విత్‌డ్రా చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) ఇటీవల కొన్ని నిర్ణయాలు తీసుకుంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా చందాదారులకు మరోసారి నాన్-రిఫండబుల్ అడ్వాన్సు అందిస్తున్నట్లు పేర్కొంది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఈపీఎఫ్ చందాదారులు నిధులు సమకూర్చుకునేందుకు ఇది సహాయపడుతుందని తెలిపింది.
చందాదారులు తెలుసుకోవాల్సిన ఐదు అప్‌డేట్‌లు...
1.సెకండ్ వేవ్ కొవిడ్ అడ్వాన్స్
కొవిడ్ కారణంగా సామాన్యుల ఆర్థిక కష్టాలను దృష్టిలో ఉంచుకుని గతేడాది ఈపీఎఫ్ఓ చందాదారులకు అడ్వాన్సు రూపంలో పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకునేందుకు వీలు కల్పించింది. సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాది కూడా అలాంటి పరిస్థితులే తలెత్తడంతో ఫస్ట్ వేవ్‌లో కొవిడ్ అడ్వాన్స్ తీసుకున్న ఈపీఎఫ్ చందాదారులు మరోసారి అడ్వాన్స్ తీసుకునేందుకు అవకాశం కల్పించింది. చందాదారుడు తన ఈపీఎఫ్ ఖాతాలో సేకరించిన మొత్తం నుంచి 75 శాతం గానీ, ఉద్యోగి మూడు నెలల బేసిక్ వేతనానికి (డీఏతో కలిపి) సమానమైన మొత్తాన్ని గాని విత్‌డ్రా చేసుకోవచ్చు.
2. నాన్-రిఫండబుల్ అడ్వాన్స్
ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉద్యోగం లేని ఈపీఎఫ్ఓ చందాదారులు, వారి పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ నుంచి 75 శాతం డబ్బును ఉపసంహరించుకోవచ్చు. చందాదారుడు ఈపీఎఫ్ ఖాతాను రద్దు చేయకుండా, పెన్షన్ నిబంధనల ప్రకారం పెన్షన్ ప్రయోజనాన్ని కొనసాగించేందుకూ ఈ సదుపాయం సహాయపడుతుంది.
3. ఉద్యోగం వదిలేసినా కొవిడ్ అడ్వాన్స్
ఉద్యోగం వదిలేసిన తరువాత పూర్తి, చివరి పీఎఫ్ విత్‌డ్రాలను క్లెయిమ్ చేయనివారికి కూడా ఈపీఎఫ్ ఖాతా నుంచి కొవిడ్ అడ్వాన్స్ తీసుకునేందుకు అవకాశం ఇస్తున్నారు.
4. ఈడీఎల్ఐ స్కీమ్ కింద బీమా ప్రయోజనం
ఈడీఎల్ఐ పథకం కింద గరిష్ఠ బీమా ప్రయోజనాన్ని ₹6 లక్షల నుంచి ₹7 లక్షలకు ఈపీఎఫ్ఓ పెంచింది. ఒకవేళ ఈపీఎఫ్ఓ సభ్యుడు సర్వీస్‌లో ఉండగానే మరణిస్తే, నామినీ /చట్టబద్దమైన వారసుడు (ఆ వ్యక్తికి వర్తించేదాన్ని అనుసరించి) గరిష్ఠంగా ₹7 లక్షల వరకు బీమా ప్రయోజనాన్ని పొందేందుకు అర్హులు. అయితే కనీస పరిమితి ₹2.5 లక్షల్లో మాత్రం మార్పుచేయలేదు.
5. ఆధార్ అనుసంధానం
ఈపీఎఫ్, పీఎఫ్ చందాదారులు తమకు సంబంధించిన ఈపీఎఫ్ ఖాతాను ఆధార్‌తో అనుసంధానించే ప్రక్రియను ఈపీఎఫ్ఓ తప్పనిసరి చేసింది. ఆధార్-ఈపీఎఫ్ ఖాతాను లింక్ చేయని ఖాతాలకు సంస్థ కంట్రిబ్యూషన్ అందదు. అటువంటి ఖాతాలకు ఎలక్ట్రానిక్ చలాన్-కమ్ రిటర్ను (ఈసీఆర్) దాఖలు చేసేందుకు సంస్థను ఈపీఎఫ్ఓ అనుమతించదు. ఆధార్-ఈపీఎఫ్ ఖాతాల అనుసంధాన గడువు 31 మే 2021తో ముగియగా, దానిని 1 సెప్టంబరు 2021 వరకు పొడిగించింది.
Thanks for reading EPFO: 5 important updates for you
No comments:
Post a Comment