పాఠశాలల్లో పిల్లలు జాగ్రత్త ..విద్యాశాఖకు TS హైకోర్టు ఆదేశం
●అధ్యయనం చేయకుండా స్కూళ్లు తెరుస్తున్నట్టు ఎందుకు ప్రకటించారని ప్రశ్న.
హైదరాబాద్: క్షేత్ర స్థాయిలో అన్ని అంశాలనూ అధ్యయనం చేయకుండా...మార్గదర్శకాలు రూపొందించకుండా పాఠశాలలను తెరుస్తున్నామని ఎందుకు ప్రకటించారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హాజరును తప్పనిసరి చేస్తున్నారా? కొవిడ్ మార్గదర్శకాలను ఏవిధంగా అమలు చేస్తున్నారని అడిగింది. కరోనా చికిత్సలకు సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పాఠశాలలను ప్రారంభించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన మధ్యంతర పిటిషన్‌నూ విచారించింది. ధర్మాసనం ఆదేశాల మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆన్‌లైన్‌లో హాజరయ్యారు. ‘‘జులై 1 నుంచి విద్యాసంస్థలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటి రెండు రోజుల్లో మార్గదర్శకాలు విడుదలవుతాయి. పిల్లలు పాఠశాలకు హాజరుకావాలంటే తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరి. కొవిడ్ మొదటి విడతప్పుడు ఫిబ్రవరిలోపాఠశాలలు తెరిచాం. అప్పట్లోనూ హాజరు తప్పనిసరి చేయలేదు. తల్లిదండ్రుల అనుమతితోనేపిల్లలు స్కూళ్లకువచ్చార’’ని వివరించారు.
ఆన్‌లైన్ తరగతుల గురించీ స్పష్టత ఇవ్వండి
‘‘మార్గదర్శకాలు రూపొందించే ముందు పిల్లలను దృష్టిలో ఉంచుకోవాలి. పెద్దలే భౌతిక దూరం పాటించడంలేదు. పిల్లలు దీన్ని అమలు చేయడం కష్టం. అంతేగాకుండా పాఠశాలలు చిన్నచిన్న స్థలాల్లో...ఇరుకు గదుల్లో ఉంటాయి. తల్లిదండ్రుల ఆందోళనను కూడా గమనంలోకి తీసుకోవాలి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మార్గదర్శకాలను రూపొందించి నివేదికను సమర్పించండి. ఆన్‌లైన్ తరగతుల గురించి కూడా స్పష్టత ఇవ్వండి’’ అని ధర్మాసనం విద్యాశాఖను ఆదేశించింది.
10 మంది అనాథ పిల్లలకు ఓ అధికారి
‘‘రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌తో 170 మందికి పైగా పిల్లలు అనాథలయ్యారు. ప్రతి 10 మంది పిల్లలకు ఒకరు లేదా ఇద్దరు అధికారులను బాధ్యులుగా గుర్తించాలి. వారి ఫోన్ నంబర్లను పిల్లలకు ఇస్తే ప్రయోజనం ఉంటుంది. ఈమేరకు చర్యలు తీసుకోవాలి’’ అని హైకోర్టు ఆదేశించింది. ‘‘కొవిడ్ సమయంలో గృహ హింస కేసులు ఎక్కువయ్యాయి. ఒకటి రెండు గదులుండే అపార్ట్‌మెంట్‌లలో కుటుంబాలు ఉంటున్నాయి. పిల్లలకు ఆన్‌లైన్ తరగతులు ఇతర సమస్యలతో గృహిణులపై హింస పెరుగుతోంది. వారు బయటికి వస్తే ఆశ్రయం కల్పించడానికి ఏర్పాట్లు ఉండాలి. దీనిపై వచ్చే నివేదికలో స్పష్టతనివ్వాలి. కొవిడ్ నిబంధనల ఉల్లంఘనలపై డీజీపీ సమర్పించిన నివేదికలో కొత్త అంశాలేవీ లేవు. గత నివేదికలోని అంశాలను యథాతథంగా పేర్కొన్నారు’’ అని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. విచారణను జులై 7వ తేదీకి వాయిదా వేసింది.
* ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగుల నుంచి అధికంగా వసూలు చేసిన మొత్తానికి కనీసం 10 రెట్ల అధికంగా జరిమానా విధించే అంశాన్ని పరిశీలించాలి. దీనికి అనుగుణంగా ప్రస్తుత జీవోను సవరించాలి. లేదంటే ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయాలి. ఇలా జరిమానా విధిస్తేనే అవి దారికొస్తాయి.
* కొవిడ్ మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కరోనా పరీక్షల సంఖ్య తగ్గించకుండా చూడాలి. మూడో దశతోపాటు డెల్టా వేరియంట్‌ను ఎదుర్కోవడానికి రూపొందించిన ప్రణాళికను సమర్పించాలి.
* ఇప్పటికే 5 లక్షల మందిని కొవిడ్ పరంగా హైరిస్క్ గ్రూపుగా గుర్తించారు. పాఠశాలలు తెరుస్తున్నందున ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిని కూడా ఈ కేటగిరీలోకి తీసుకోవాలి.
- హైకోర్టు
Thanks for reading TS High Court orders education department to take care of children in schools
No comments:
Post a Comment