Global Warming: 2100 నాటికి కడలి గర్భంలోకి 12 భారత నగరాలు
2100 నాటికి భారత్‌లోని 12 నగరాలు మునిగిపోనున్నాయంటూ నాసా ఓ నివేదికలో తెలిపింది. విశాఖ సహా 12 నగరాలు కడలి గర్భంలో కలిసి పోతాయన్న నివేదిక సారాంశం భయాందోళనలను కలిగిస్తోంది. కాలుష్యం వల్ల కరిగే మంచు వల్ల సముద్ర మట్టాలు పెరిగి మరో ఎనిమిది దశాబ్దాల్లో భారత్‌లోని తీర ప్రాంత నగరాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని నాసా వెల్లడించింది. కర్బన ఉద్గారాలు, కాలుష్యాన్ని నివారించకపోతే పెను విపత్తు తప్పదని భారత్‌ను హెచ్చరించింది.
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సముద్ర మట్టం కొలిచేందుకు ప్రొజెక్షన్ టూల్‌ను అభివృద్ధి చేసింది. దీని తాజా ఫలితాలను వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి నియమించిన అంతర ప్రభుత్వ కమిటీ ఐపీసీసీ విడుదల చేసింది. ఈ నివేదక ప్రకారం మరో 79 ఏళ్ల తర్వాత ప్రపంచంలో తీవ్ర వేడి గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. కర్బన ఉద్గారాలు, కాలుష్యాన్ని నివారించకపోతే ఉష్ణోగ్రతలు సగటున 4.4 డిగ్రీల సెల్సియస్ పెరుగుతాయని తెలిపింది. రాబోయే రెండు దశాబ్దాల్లో ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీ సెల్సియస్‌కు పెరగనున్నట్లు నివేదిక వెల్లడించింది. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల హిమానీనదాలు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతాయని, దాని వల్ల భారత్‌లోని విశాఖ, ముంబయి, భావ్‌నగర్, కొచ్చి, మర్మగావ్, ఓకా, పారాదీప్, కాండ్లా, మంగళూరు, చెన్నై, తూత్తుకుడి నగరాలు మునిగిపోయే ప్రమాదం ఉందని ఐపీసీసీ నివేదిక హెచ్చరించింది.
ఐపీసీసీ తాజా నివేదికలో ప్రపంచంలో సముద్ర మట్టం పెరిగే రేటు ఆసియాలోనే ఎక్కువగా ఉందని వెల్లడైంది. 2006 నుంచి 2018 మధ్య ప్రపంచ వ్యాప్తంగా సముద్ర మట్టం ఏడాదికి 3.7 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతోందని ఐపీసీ నివేదిక తెలిపింది. 21వ శతాబ్దం అంతటా సముద్ర మట్టం పెరుగుదల కొనసాగనుందని స్పష్టం చేసింది.
Thanks for reading Global Warming: 12 cities into the sea by 2100
No comments:
Post a Comment