Third Wave: మూడో ముప్పులో గరిష్ఠంగా ఎన్ని కేసులు రానున్నాయంటే..?
మునుపటి ఉగ్రరూపం ఉండకపోవచ్చని నిపుణుల అంచనా
దిల్లీ: కరోనా రెండో ఉద్ధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ.. మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదు. ముంగిట పొంచి ఉన్న మూడో దఫా విజృంభణపై ఇప్పటికే అంచనాలు వెలువడుతున్నాయి. అందుకు తగ్గట్టే కొద్ది రోజులుగా కొత్త కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఇందులో సగానికి పైగా కేరళ, మహారాష్ట్రల్లోనే వెలుగుచూస్తుండగా.. 40కిపైగా జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా ఎక్కువగా నమోదవుతోంది. ఈ క్రమంలో తాజాగా వెలువడిన ఓ అధ్యయనం మూడో ముప్పు వేళ ఎన్ని కేసులు వెలుగుచూడనున్నాయో ఓ అంచనా వేసింది. మేథమెటికల్ మోడల్ ఆధారంగా ఐఐటీ కాన్పూర్, హైదరాబాద్‌కు చెందిన మణీంద్ర అగర్వాల్, ఎం.విద్యాసాగర్ నేతృత్వంలో ఈ అధ్యయనం సాగింది.
ఆంక్షల సడలింపు, డెల్టా వేరియంట్ విజృంభణ వంటి కారణాలతో ఇటీవల కాలంలో కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఇవి మూడో ముప్పుకు ఆజ్యం పోస్తున్నాయని అధ్యయనకర్తలు అభిప్రాయపడ్డారు. దాంతో కేసులు క్రమంగా పెరిగి, అక్టోబర్ నాటికి గరిష్ఠస్థాయికి చేరుకోవచ్చని అంచనా వేశారు. అయితే ఈసారి రెండో వేవ్ స్థాయి విజృంభణ ఉండకపోవచ్చని చెప్పుకొచ్చారు. మూడో వేవ్‌లో అత్యధికంగా ఒక్కరోజులో లక్ష కంటే తక్కువ కేసులు వెలుగుచూసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పరిస్థితులు మరీ చేయిదాటితే ఆ సంఖ్య గరిష్ఠంగా 1,50,000గా కూడా ఉండొచ్చని అంటున్నారు.
రెండో దఫా విజృంభణ సమయంలో రోజువారీ కేసులు గరిష్ఠంగా 4లక్షలకు పైనే నమోదైన సంగతి తెలిసిందే. జీనోమిక్ కన్సార్టియం(INSACOG) నుంచి వెలువడిన వివరాల ప్రకారం.. మే, జూన్, జులైలో నెలల్లో ప్రతి 10 కేసుల్లో ఎనిమిదింటికి డెల్టా వేరియంటే కారణమని వెల్లడైంది. మే నెలలో రోజువారీ మరణాలు కూడా 4,500 పైనే వెలుగుచూశాయి. అప్పుడు పలు ప్రాంతాల్లో మృత్యఘోష వినిపించింది. కానీ అప్పటితో పోల్చుకుంటే.. మూడోముప్పు ఆ స్థాయిలో ఉండకపోవచ్చని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ.. వైరస్ కేసులు పెరగడం, తగ్గడంలో ప్రజలు పాటించే కొవిడ్ నియమావళే కీలక పాత్ర పోషిస్తుందని, వాటిని తప్పనిసరిగా అనుసరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Thanks for reading Third Wave: What is the maximum number of cases in the third wave ..?
No comments:
Post a Comment