Education loans : విద్యా రుణాలు మరింత చౌక .. అతి తక్కువ వడ్డీకే ఎడ్యుకేషన్ లోన్లు అందిస్తున్న టాప్ 5 బ్యాంకులివే !
నేటి పోటీ ప్రపంచంలో విద్య వ్యయం భారీగా పెరిగింది. ప్రతిభ ఉన్నప్పటికీ, మంచి యూనివర్సిటీలో విద్యనభ్యసించాలంటే పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించాల్సి వస్తోంది.దీంతో ఆర్థిక స్థోమత అంతగా లేని వారు ఉన్నత విద్య కొనసాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంకులు విద్యా రుణాలను అందజేస్తున్నాయి. సామాజిక కోణంలో వీటిని 6.75 శాతం నుంచి 7.15 శాతం మధ్య, తక్కువ రేటుకే అందజేస్తుండటం విశేషం. ప్రస్తుతం అతి తక్కువ వడ్డీకే విద్యా రుణాలు ఇస్తున్న టాప్ 5 బ్యాంకులను పరిశీలిద్దాం.
ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా.. 6.75 శాతం వడ్డీకే రూ. 20 లక్షల వరకు విద్యా రుణాన్ని అందజేస్తుంది. ఏడు సంవత్సరాల కాలపరిమితితో ఈ రుణాలను మంజూరు చేస్తుంది. ఈ కాలానికి రూ.29,942 నెలవారీ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.8 శాతం వద్ద విద్యారుణాలను అందజేస్తుంది. రూ. 20 లక్షల రుణానికి ఏడేళ్ల వ్యవధిని పరిగణనలోకి తీసుకుంటే రూ. 29,990 నెలవారీ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు 6.85 శాతం వడ్డీ రేట్లతో విద్యా రుణాలు అందజేస్తున్నాయి. రూ. 20 లక్షల రుణానికి ఏడేళ్ల వ్యవధిని పరిగణనలోకి తీసుకుంటే రూ. 30,039 చొప్పున నెలవారీ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
మరో ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్‌లు రూ. 20 లక్షల విద్యా రుణాన్ని 6.9 శాతం వడ్డీ రేట్ల వద్ద అందజేస్తున్నాయి.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 7.05 శాతం వడ్డీరేటు వద్ద విద్యా రుణాలను మంజూరు చేస్తుంది. ఏడేళ్ల వ్యవధిని పరిగణనలోకి తీసుకుంటే నెలవారీ ఈఎంఐ రూ. 30,234 చెల్లించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ బ్యాంక్ రూ. 20 లక్షల విద్యార్థి రుణానికి 7.15 శాతం వడ్డీ వసూలు చేస్తుంది. ఏడు సంవత్సరాల కాలపరిమితితో అందిస్తుంది. బ్యాంక్‌బజార్.కామ్ నుంచి సేకరించిన డేటా అధారంగా ఈ వివరాలు అందిస్తున్నాం. మరిన్ని వివరాల కోసం బ్యాంకుల అధికారిక వెబ్‌సైట్లను సందర్శించడం మంచిది.
Thanks for reading Education loans: Top 5 banks offering low interest education loans!
No comments:
Post a Comment