EMI : విలువ కంటే ఎక్కువ ' పే ' చేస్తున్నామా ?
ఈరోజుల్లో యువత ఉద్యోగంలో చేరగానే బైక్ లేదా కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 20 సంవత్సరాలు వెనక్కి వెళితే అప్పట్లో ఇది ఊహకి కూడా అందని విషయమనే చెప్పాలి.
దీనికి కారణం రుణాలు సులభంగా లభించడంతో పాటు ఈఎమ్ఐ (నెలవారి సమాన వాయిదా) సదుపాయం ఉండడం. కాలానికి అనుగుణంగా మనమూ మారుతుండాలి. కొత్త పోకడలను అలవాటు చేసుకోవాలి. కానీ ఎక్కడ ఏ పద్ధతిని అనుసరిస్తే లాభం చేకూరుతుందో అర్థం చేసుకుని తెలివిగా ప్రవర్తించాలి.
ఏదైనా వస్తువును కొనుగోలు చేసేందుకు రెండు ఆప్షన్లు ఉంటాయి. మొదటిది ఆ వస్తువుకు సంబంధించిన పూర్తి ధర ముందుగానే చెల్లించి కొనుగోలు చేయడం. ఇకపోతే రెండోది ఈఎమ్ఐల రూపంలోని మార్చుకుని చెల్లించడం.
మొదటి పద్థతిలో తక్కువ ధర ఉన్న వస్తువులను కొనుగోలు చేయాలంటే సులభమే. కాని ఎక్కువ ధర ఉన్న వస్తువులను కొనుగోలు చేయాలంటే చాలా మందికి కష్టం. ఇందుకోసం ఒక ప్రణాళిక ప్రకారం పొదుపు చేయాల్సి ఉంటుంది. దీన్ని ఒక స్వల్పకాలిక లక్ష్యంగా గుర్తించి.. కావలసిన మొత్తాన్ని పొదుపు చేసి వస్తువును కొనుగోలు చేయవచ్చు. ఇందుకు ఒకటి లేదా రెండు సంవత్సరాల కాలం పట్టచ్చు. ఈ సమయంలో వస్తువు వినియోగాన్ని కల్పోతారు.
ఇక రెండవ పద్ధతిలో ఆఫర్లను చూసుకుని అసరమైన వస్తువుల కొనుగోలు కోసం.. కొంత మొత్తాన్ని చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఈఎమ్ఐ రూపంలోకి మార్చుకోవచ్చు. దీనివల్ల అధిక విలువతో కూడిన వస్తువును కొనుగోలు చేయగల సామర్థ్యం లేనివారు కూడా సులభంగా కొనుగోలు చేయవచ్చు. కానీ ఈ విధానంలో రెండు రకాల నష్టాలున్నాయంటున్నారు నిపుణులు. మొదటిది, కొనుగోలు సామర్ధాన్ని ఎక్కువగా ఊహించడం. రెండవది, ఆఫర్లలో వస్తున్నాయని అవసరం లేని వస్తువులను కొనుగోలు చేయడం.
ఏ పద్ధతిని ఎంచుకుంటే మంచిది?
గృహోకరణాల విషయంలో..
కొనుగోళ్లు పెంచుకోవడం కోసం సంవత్సరం పొడవునా ఆఫర్లు ఇస్తూనే ఉంటాయి వ్యాపార సంస్థలు. క్రెడిట్ కార్డుతో కొంటే ధర తగ్గుతుందని, ఇప్పుడున్న డీల్ తరువాత ఉండదేమోనని.. కొనుగోలు చేస్తుంటారు. మరి ఇలా అప్పు చేసి కొనుగోలు చేయడం మంచిదేనా? అంటే ఒకవేళ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే..వస్తువును వెంటనే కొనుగోలు చేయగలుగుతాం. కానీ బిల్లు సమయానికి చెల్లించలేకపోతే అధిక వడ్డీతో(వార్షికంగా 36 శాతం వరకు) చార్జీలు వర్తిస్తాయి.
ఉదాహరణకి, మీరు రూ.1 లక్ష విలువ గల గృహోపకరణాలను కొనుగోలు చేస్తున్నారనుకుందాం. ఈ మొత్తాన్ని ఈఎమ్ఐల రూపంలో చెల్లించేందుకు ఉన్న కాలపరిమతి ఒక సంవత్సరం. వడ్డీ రేటు 6 శాతం అయితే.. నెలకు చెల్లించాల్సిన ఈఎమ్ఐ రూ. 8,607. ఈ మొత్తం కాలవ్యవధిలో మీరు చెల్లించే అసలు, వడ్డీ మొత్తం రూ. 1.03 లక్షలు.
ఇవే లక్ష రూపాయల విలువ గల వస్తువును ముందుగా మదుపు చేసి కొనుగోలు చేస్తే.. ఒక సంవత్సర కాలంలో కావలసిన మొత్తాన్ని సమకూర్చుకునేందుకు ప్రతీ నెల రూ. 8,100 పెట్టుబడి పెడితే సరిపోతుంది. ఇక్కడ కూడా 6 శాతం వడ్డీ రేటు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం రూ. 97,200 మాత్రమే. అంటే దాదాపు రూ. 6 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. ఈఎమ్ఐలు.. కొనుగోళ్లుకు అనుకూలమే. కానీ అధిక వడ్డీ రేటుతో వస్తాయి. ఇవి ఆర్థిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. ద్రవ్యోల్భణాన్ని దృష్టిలో ఉంచుకుంటే.. వస్తువు ధర పెరిగే అవకాశం ఉంది. అయితే గృహోపకరణాలు అయినందున అదే మోడల్‌ని కొంతకాలం తరువాత కొనుగోలు చేసినప్పటికీ ధరలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.
వినియోగ వస్తువులను కొనుగోలు చేసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
* ఏదైనా వస్తువును కొనుగోలు చేయాలనుకుంటే దాన్ని ఒక లక్ష్యంగా పరిగణించండి. నెలవారిగా కొంత పొదుపు చేయడం ప్రారంభిస్తే, సరిపడినంత డబ్బు పోగుచేశాక వస్తువును కోనుగోలు చేయవచ్చు.
* వీలైతే వస్తువు విలువలో సగం మొత్తాన్ని అయినా పొదుపు చేసిన తరువాత వస్తువును కొనుగోలు చేస్తే మిగిలిన మొత్తాన్ని ఈఎమ్ఐ రూపంలో చెల్లించవచ్చు. ఇలా చేస్తే తక్కువ సమయంలోనే బ్యాలెన్స్ మొత్తాన్ని చెల్లించగలుగుతారు.
* రెండు లేదా మూడు వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తుంటే కనీసం ఒకటి రెండు వస్తువులకు కావలసిన మొత్తాన్ని పొదుపు చేసి మూడవ వస్తువును ఈఎమ్ఐలో తీసుకోండి.
* ఖర్చు తగ్గుంచుకోవాలి అంటే అర్థం.. అవసరానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేయద్దని కాదు. అప్పు చేయకుండా..పెట్టుబడులకు ఇబ్బంది కలగకుండా కావలసిన మొత్తాన్నిసమకూర్చుకుని కొనుగోలు చేయడం.
బైనౌ, పేలేటర్ సర్వీస్‌లు ఎంచుకోవచ్చా?
ప్రస్తుతం చాలా వరకు ఈకామర్స్ సంస్థలు ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి. వీటికోసం ఫిన్‌టెక్ సంస్థలతో ఒప్పందం కుదుర్చకుంటున్నాయి. వినియోగదారులు బైనౌ పేలేటర్ సదుపాయంతో వస్తువులను కొనుగోలు చేసేందుకు తిరిగి చెల్లించేందుకు కొంత వడ్డీ రహిత సమయాన్ని ఇస్తారు. సాధారణంగా ఇది 15 నుంచి 45 రోజులు ఉంటుంది. ఆ లోపుగా బ్యాలెన్స్ మొత్తం చెల్లించకపోతే వర్తించే వడ్డీ రేట్లు(30 శాతం వరకు) చాలా ఎక్కువగా ఉంటాయని గమనించాలి.
నో-కాస్ట్ ఈఎమ్ఐ..
చాలా వరకు ఈ-కామర్స్ సంస్థలు వస్తువుల కొనుగోళ్లపై నో-కాస్ట్ ఈఎమ్ఐ సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఇది వడ్డీ రహిత రుణం లాంటిది. దీనివల్ల అసలు విలువనే(వడ్డీ లేకుండా) చెల్లించడంతో పాటు వస్తువును వెంటనే పొందచ్చు. పైన తెలిపినట్లు వడ్డీ లేదు కదా అని అవసరం లేకపోయినా కొనుగోళ్లు చేయడం మంచిది కాదు.
గృహ రుణం..
ఇంటిని కొనుగోలు చేసేందుకు రుణాలను తీసుకోవడం మంచిదని నిపుణలు చెబుతున్నారు. ఎందుకంటే గృహం కొనుగోలు చేయడం అంటే ఆస్తిని ఏర్పాటు చేసుకోవడం. అద్దె వంటి ఖర్చులు కూడా తగ్గుతాయి. పన్ను ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఇంటి కొనుగోలు బడ్జెట్‌లో ఉండేలా చూసుకోవడం, కనీసం 30 నుంచి 40 శాతం డౌన్‌పేమెంట్ ఉండేలా చూసుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
Thanks for reading EMI: Are we 'paying' more than the value?
No comments:
Post a Comment