తొలి మహిళా టీచర్ Fatima Sheikh కి గూగుల్ నివాళి
ఫాతిమా షేక్.. ఈ పేరు తెలియనివాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. అక్షరాలకు దూరమైన ఎంతో మందికి అక్షరాలు నేర్పిన తొలితరం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్.
భారత తొలి ఉపాధ్యాయురాలు సావిత్రి బాయితో కలిసి బాలికా విద్య కోసం, మహిళల ఉన్నతి కోసం శ్రమించిన వ్యక్తిత్వం ఫాతిమా షేక్. సావిత్రిబాయితో కలిసి బాలికలు పాఠాలు చెప్పే సమయంలో ఫాతిమా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ముందుకు సాగారు. వీరిద్దరి కృషి ఫలితంగా 150 ఏళ్ల క్రితమే బాలికలు/మహిళలు చదువు నేర్చుకున్నారు. దేశంలో మొదటి బాలికా పాఠశాల నిర్వాహకులు వీరే. సావిత్రిబాయికి జ్యోతిరావు ఫూలే నుంచి ఎంత సహకారం, ఎంత తోడ్పాటు అందిందో, అంతటి సహకారం, తోడ్పాటు ఫాతిమా షేక్ నుంచి అందింది.
ఈ దేశంలో తొలితరం మహిళా విద్యావంతులను తీర్చిదిద్దిన ఫాతిమా షేక్ 191వ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ఫాతిమాకు 'డూడుల్'తో గూగుల్ నివాళి అర్పించింది. జనవరి 9, 1831లో మహారాష్ట్రలోని ఫూణెలో జన్మించిన ఫాతిమా షేక్.. సామాజిక పరివర్తనలో విశేష కృషిని అందించారు. బాలికా విద్య ద్వారా సమాజంలో ఉన్నత స్థాయి మార్పు వస్తుందని విశ్వసించి, తన చివరి ఊపిరి వరకు బాలిక విద్యా, మహిళా ఉన్నతి కోసం కృషి చేశారు. దళితులు, మహిళలతో పాటు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చదువును చేర వేయడంలో ఫాతిమా సేవలు చారిత్రకంగా నిలిచిపోయాయి. లింగ, కుల అసమానతలపై ఫాతిమా పోరాడారు. 2014లో భారత ప్రభుత్వం షేక్ ఫాతిమా సేవలకు గాను ఉర్దూ పాఠ్య పుస్తకాల్లో ఆమె గురించి పాఠాలను చేర్చింది.
Thanks for reading Google pays tribute to Fatima Sheikh, the first female teacher
No comments:
Post a Comment