Home Isolation: ఇక హోం ఐసోలేషన్ 7 రోజులే.. మార్గదర్శకాలు సవరించిన కేంద్రం
దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతున్న తరుణంలో లక్షణాలు కన్పించని, స్వల్ప లక్షణాలతో బాధపడే కొవిడ్ బాధితులకు హోం ఐసోలేషన్ మార్గదర్శకాలను కేంద్రం తాజాగా సవరించింది. గతంలో పది రోజులుగా ఉన్న స్వీయ నిర్బంధ కాలాన్ని వారం రోజులకు కుదించింది. లక్షణాలు లేని వారు, లేదా స్వల్ప లక్షణాలు ఉన్న కరోనా బాధితులు.. పాజిటివ్ వచ్చిన తర్వాత వరుసగా మూడు రోజులు జ్వరం లేకపోతే 7 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలని పేర్కొంది. హోం ఐసోలేషన్ ముగిసిన తర్వాత మళ్లీ కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కొత్త మార్గదర్శకాలివే..
* లక్షణాలు లేని/స్వల్ప లక్షణాలు కలిగిన కొవిడ్ బాధితులు కుటుంబసభ్యులకు దూరంగా ఇంట్లో ప్రత్యేక గదిలో ఐసోలేషన్‌లో ఉండాలి. ఆ గదిలో గాలి, వెలుతురు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
* ఎప్పుడూ మూడు లేయర్ల మాస్క్ ఉపయోగించాలి. ప్రతి 8 గంటలకోసారి మాస్క్‌ను మార్చుకోవాలి. కనీసం 72 గంటల తర్వాత ఉపయోగించిన మాస్క్‌లను ముక్కలుగా కత్తిరించి పడేయాలి.
* కుటుంబసభ్యులు ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తి దగ్గరకు రావాల్సి వస్తే.. ఇద్దరూ ఎన్-95 మాస్క్‌ను ఉపయోగించాలి.
* బాధితులు వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. ద్రవపదార్థాలు అధికంగా తీసుకోవాలి.
* రోజుకు మూడు సార్లు వేడి నీటితో గార్గిల్ చేసుకోవడం, ఆవిరి పట్టడం వంటివి చేయాలి.
* జ్వరం తగ్గకపోతే వైద్యులను సంప్రదించి పారాసిటమాల్ ట్యాబ్లెట్లు వేసుకోవాలి.
* శ్వాస స్థాయిలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. జ్వరం, ఆక్సిజన్ లెవల్స్‌ను చెక్ చేసుకోవాలి.
* చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. తరచూ ముక్కు, నోటిని తాకడం వంటివి చేయకూడదు. బాధితులు ఉంటున్న గదిని శుభ్రంగా ఉంచాలి.
* ఐసోలేషన్‌లో ఉన్న సమయంలో కరోనా బాధితులు ఉపయోగించే వస్తువులను ఇతరులతో పంచుకోకూడదు.
* బాధితుల అవసరాలను చూసుకునే సంరక్షకులు(కుటుంబసభ్యులు) కూడా జాగ్రత్తలు పాటించాలి. వారి గదికి వెళ్లి వచ్చిన తర్వాత చేతులు, కాళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి.
* బాధితుల వస్తువులను ముట్టుకునేప్పుడు చేతులకు గ్లౌజులు వేసుకోవాలి.
* అవసరమైతే టెలీ-కన్సల్టేషన్ ద్వారా వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవాలి.
* హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులు వరుసగా 3 రోజుల పాటు జ్వరం రాకపోతే 7 రోజుల తర్వాత ఐసోలేషన్ నుంచి బయటకు రావొచ్చు. అయితే ఆ తర్వాత మాస్క్‌లు తప్పకుండా ధరించాలి. ఇక, హోం ఐసోలేషన్ తర్వాత ఎలాంటి కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు.
హోం ఐసోలేషన్ ఎవరికంటే..
కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ ఎలాంటి లక్షణాలు లేదా స్వల్ప లక్షణాలు కన్పించిన వారు స్వీయ నిర్బంధానికి అర్హులు. బాధితుల ఆక్సిజన్ స్థాయిలు 93శాతం కంటే ఎక్కువ ఉండి, ఎలాంటి జ్వరం వంటి లక్షణాలు లేకపోతే వైద్యుల ధ్రువీకరణతో హోం ఐసోలేషన్‌లో ఉండొచ్చు. అయితే బాధితుల కుటుంబసభ్యులు కూడా హోం ఐసోలేషన్ నిబంధనలు తప్పకుండా పాటించాలి.
Thanks for reading Home Isolation is only 7 days... Guidelines Revised
No comments:
Post a Comment