Changes from April I : ఏప్రిల్ నుంచి వచ్చే మార్పులివే .. 10 పాయింట్లు
పెట్రోల్, డీజిల్ ధరలు పరుగులు పెడుతున్నాయి. వంట నూనెలు, నిత్యావసరాలు.. వాటికి పోటీ పడుతున్నాయి.
వీటితో ఇప్పటికే ధరఘాతంతో అల్లాడుతున్న సామాన్యుడిపై కొత్త భారాలు మేపేందుకు కొత్త ఆర్థిక సంవత్సరం సిద్ధమవుతోంది. విద్యుత్, గ్యాస్, ఔషధాలు, టోల్ ఛార్జీల రూపంలో ఏప్రిల్ 1 నుంచి సామాన్యుడి జేబుకు మరింత చిల్లు పడబోతోంది. దీంతో పాటు పోస్టాఫీసు, పీఎఫ్, ట్యాక్స్ నిబంధనల్లో పలు మార్పులు జరగబోతున్నాయి. ఆ వివరాలు పది పాయింట్లలో..
ఏపీ, తెలంగాణలో విద్యుత్ ఛార్జీల మోత
తెలుగు రాష్ట్రాల్లో రెంటు ఛార్జీలు పెరగబోతున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. ఇళ్లలో ప్రజలు వాడే కరెంటుకు ప్రస్తుత ఛార్జీలపై అదనంగా యూనిట్‌కు విభాగాల వారీగా తెలంగాణలో 40 నుంచి 50 పైసలు.. ఏపీలో 45 పైసల నుంచి రూ.1.57 వరకు పెంచేశారు. దీంతో తెలంగాణలో వినియోగదారులపై అదనంగా రూ.5596 కోట్ల ఆర్థిక భారం పడనుంది. ఇక ఏపీలో కేవలం గృహ వినియోగదారులపైనే రూ.1400 కోట్ల భారం పడనుంది.
ఏపీలో టోల్ ఛార్జీలు
జాతీయ రహదారులపై వాహనదారులకు ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ ఫీజుల రూపంలో బాదుడు మొదలు కానుంది. ఏపీలోని అన్ని జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల్లో ఫీజులు శుక్రవారం నుంచి పెరగనున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త రుసుములను ఖరారు చేస్తూ ఆదేశాలు వచ్చాయి. వీటి ప్రకారం కార్లు, జీపులు వంటి వాహనాలపై రూ.5-10, బస్సులు, లారీలకు రూ.15-25, భారీ వాహనాలకు రూ.40-50 వరకు పెంచనున్నారు. సింగిల్, డబుల్ ట్రిప్‌లతోపాటు నెలవారీగా జారీ చేసే పాసుల్లోనూ ఈ పెంపు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జాతీయ రహదారులపై కలిపి 57 టోల్ ప్లాజాలున్నాయి.
ఔషధాలు మరింత చేదు
జ్వరం, ఇన్ఫెక్షన్లు, బీపీ, రక్త హీనత.. తదితర ఎన్నో రకాల రుగ్మతలకు వినియోగించే మందుల ధరలు ఏప్రిల్ 1 నుంచి పెరగబోతున్నాయి. ఈ పెంపునకు నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) అనుమతిచ్చింది. దీనివల్ల దాదాపు 800 రకాలైన మందుల ధరలు పెరిగే వీలుంది. వాటిలో యాంటీ-బయాటిక్స్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ ఔషధాలు, యాంటీసెప్టిక్స్, నొప్పి నివారణ మందులు, గ్యాస్ట్రోఇంటెస్టినల్, యాంటీ ఫంగల్ మందులు ఉన్నాయి. అంటే పారాసెటమాల్ నుంచి అజిత్రోమైసిన్, సిప్రోఫ్లాగ్జాసిన్, మెట్రానిడజోల్ తదితర మందులకు వచ్చే నెల నుంచి అధిక ధర చెల్లించక తప్పని పరిస్థితి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) పెరుగుదల ఆధారంగా మందుల ధరల పెంపునకు ఎన్‌పీపీఏ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
గ్యాస్ సిలిండర్ భారం కానుందా..?
గ్యాస్ సిలిండర్ ధరలను ప్రతి నెలా సవరిస్తుంటాయి పెట్రోలియం కంపెనీలు. ఈ లెక్కన ఏప్రిల్ 1న గ్యాస్ సిలిండర్ల ధరలు మారనున్నాయి. ఎన్నికల కారణంగా చాలా రోజులుగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నాయి. పెట్రో ధరలు రోజూ పెరుగుతుండగా.. గ్యాస్ సిలిండర్ ధరలు మార్చి 22న రూ.50 మేర పెంచారు. మరోమారు ఈ పెంపు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
చిన్న మొత్తాలపై వడ్డీ తగ్గనుందా..?
పీపీఎఫ్, సుకన్య సమృద్ధి వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేటు కొన్నాళ్లుగా స్థిరంగా ఉంది. త్రైమాసికానికోసారి వీటిపై వడ్డీ రేట్లను ప్రభుత్వం నిర్ణయిస్తుంటుంది. గత ఏడు త్రైమాసికాలుగా ప్రభుత్వం వీటి జోలికెళ్లలేదు. అయితే, బ్యాంకులు ఇస్తున్న వడ్డీ రేట్ల కంటే చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు అధికంగా ఉన్నాయంటూ ఆర్‌బీఐ ఇటీవల ఓ నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో కొత్త వడ్డీ రేట్లను ప్రభుత్వం సమీక్షించనుంది. ఇప్పటికే ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 తగ్గించిన నేపథ్యంలో వీటి వడ్డీ రేట్లలోనూ కోత విధించే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అధిక జమలపై పన్ను (EPF)
పీఎఫ్ ఖాతాలో అధిక మొత్తంలో జమ చేసే ఉద్యోగులకు ఏప్రిల్ 1 నుంచి పన్ను భారం పడనుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగి వాటా రూ.2.5 లక్షలు దాటితే అదనంగా జమ చేసిన మొత్తంపై వచ్చిన వడ్డీపై పన్ను విధించనున్నారు. ఒకవేళ 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఒక ఉద్యోగి 2.5 లక్షల కంటే ఎక్కువ మొత్తం జమ చేస్తే పన్ను వేయదగిన మొత్తాన్ని వేరే ఖాతాలో వేస్తారు. దానిపై వచ్చిన వడ్డీపై పన్ను విధిస్తారు. ఉద్యోగి వాటా ఏడాదిలో రూ.2.5లక్షల కంటే తక్కువ ఉంటే ఎలాంటి పన్నూ ఉండదు.
క్రిప్టోపై పన్ను
ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి క్రిప్టోపై పన్నును విధించనున్నట్లు ఇటీవల బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. బిట్ కాయిన్, డోజీ కాయిన్.. ఇలా ఏ వర్చువల్ ఆస్తుల బదిలీపై అయినా 30 శాతం చొప్పున పన్ను విధించనున్నారు. దేశీయంగా క్రిప్టో లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ పన్ను వేయడం ఈ ఆర్థిక సంవత్సరం నుంచే మొదలు పెడుతోంది.
పన్ను మినహాయింపు కుదరదు
సొంతింటి కొనుగోలులో సెక్షన్ 80EEA కింద రూ.1.5 లక్షలు మినహాయింపు ఇక సాధ్యం కాదు. ఏప్రిల్ 1 నుంచి ఈ మినహాయింపు వర్తించదు. 2022 బడ్జెట్‌లో ఈ మినహాయింపును కేంద్రం కొనసాగించకపోవడమే ఇందుకు కారణం. దీంతో సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే వారికి ఇది భారం కానుంది.
పోస్టల్‌లో ఇక నో క్యాష్
పోస్టాఫీసు పథకాలైన మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, టైమ్ డిపాజిట్లు, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వంటి పథకాల నుంచి వచ్చే వడ్డీ ఆదాయం ఇకపై నగదు రూపంలో ఇవ్వరు. ఏప్రిల్ 1 నుంచి పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా మాత్రమే చెల్లించనున్నారు.
కార్ల ధరలూ జూమ్
ఏప్రిల్ 1 నుంచి కార్ల ధరలు పెరగనున్నాయి. బీఎండబ్ల్యూ, టయోటా, మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి కంపెనీలు తమ కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ముడి సరకు ధరలు పెరగడమే ఇందుకు కారణమని పేర్కొన్నాయి. టయోటా 4 శాతం, బీఎండబ్ల్యూ 3.5 శాతం, బెంజ్, ఆడి 3 శాతం చొప్పున ధరలు పెంచనునున్నట్లు ప్రకటించాయి.
Thanks for reading Changes from April I
No comments:
Post a Comment