మార్చిలోనే మొదలైన భానుడి భగభగలు ఈసారి ఎందుకిలా ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
ఈసారి మార్చిలోనే భానుడి భగభగలు మొదలయ్యాయి. రోజురోజుకీ ఎండలు ముదురుతుండటంతో జనం అదురుతున్నారు. ఇప్పుడే ఎండ ఇలా ఉంటే ఇక ఏప్రిల్-మే వస్తే పరిస్థితేంటి?
బాబోయ్ అంటూ హడలెత్తిపోతున్నారు. మరోవైపు, గతంలో కన్నా ఈసారి ఎండల తీవ్రత అధికంగానే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో దిల్లీ సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే 40 డిగ్రీల కన్నా అధికంగానే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. నల్గొండలో నిన్న అత్యధికంగా 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా..ఆదిలాబాద్‌లో 39.8, కరీంనగర్‌లో 38 డిగ్రీల సెల్సియస్ చొప్పున నమోదయ్యాయి. అలాగే, ఏపీలో రాజమహేంద్రవరంలో అత్యధికంగా 38 డిగ్రీలు, అనంతపురం, కర్నూలు, నిజామాబాద్ గుంటూరు, విజయవాడ, కడపలో 37 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. దిల్లీ సహా ఉత్తర భారత దేశంలో గత కొన్ని రోజులుగా వేడి గాలుల తీవ్రత కొనసాగుతోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వేడి గాలుల సెగకు జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాజస్థాన్‌లోనే అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీల కన్నా అధికంగానే ఉష్ణోగ్రతలు నమోవుతున్నాయి. గడిచిన 24గంటల్లో అత్యధికంగా బాన్సవారాలో 42.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. యూపీలో అనేక జిల్లాల్లో సాధారణం కన్నా మూడు నాలుగు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోనూ వేసవి ప్రారంభంలోనే వేడి ప్రభావం కొనసాగుతోంది. మరోవైపు, వచ్చే కొన్ని రోజుల్లో అసలు వర్షం పడే అవకాశమే లేదని వాతావరణశాఖ పేర్కొంటోంది. అసలు ఈసారి మార్చిలోనే మే నెల తరహాలో ఉష్ణోగ్రతలు నమోదుకావడానికి కారణమేంటి? ఉష్ణోగ్రతల పెరుగుదల పంటలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం!
ముందే ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణాలివే?
* సాధారణంగా రాజస్థాన్‌లో మార్చి ఆఖర్లో ఏర్పడే యాంటీ సైక్లోన్ ఈసారి మార్చి ఆరంభంలోనే ఏర్పడటం ఒక కారణమని నిపుణులు పేర్కొంటున్నారు .అలాగే, పశ్చిమార్థ గోళంలో సంభవించే భౌగోళిక పరిణామాలు(Western Disturbance) చురుగ్గా లేకపోవడంతో థార్ ఎడారి, పాకిస్థాన్ నుంచి వేడిగాలుల రాక ప్రారంభం కావడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టు చెబుతున్నారు. మరికొన్ని రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచిస్తోంది. ఈసారి వాతావరణం సాధారణంగా ఉండే అవకాశం లేదని స్కైమెట్ వెదర్ ఉపాధ్యక్షుడు మహేశ్ పాల్వాట్ తెలిపారు. ముందే వేసవి మొదలైందని తెలిపారు.
పంటలపైనా తీవ్ర ప్రభావం..
మరోవైపు, వేడి తీవ్రత అధికమవుతుండటంతో తమ పంటలు ఎండిపోతాయనే భయం రైతుల్ని వెంటాడుతోంది. అధిక వేడి, పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో గోధుమ పంట ఈసారి త్వరగానే పక్వానికి వచ్చే అవకాశం ఉన్నట్టు రైతులు పేర్కొంటున్నారు. పొలాల్లో తేమశాతం తగ్గితే గోధుమ గింజ పరిమాణం తగ్గడం, పంట ఉత్పత్తి తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు ఉంటే.. గోధుమ గింజలు సరిగ్గా ఉడకవని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. సరిగ్గా ఉడక్కపోయినా, గింజలు గట్టిగా ఉన్నా.. అవి రుచిని కోల్పోవవడంతో పాటు పోషక విలువలు కూడా తగ్గిపోతాయంటున్నారు.
ఈ జాగ్రత్తలు మరవొద్దు !
చల్లని పానీయాలు తాగడం , శరీరానికి తగిన మోదతాదులో నీరు తాగడంతో పాటు సలాడ్లు , పండ్లు వంటివి తీసుకోవాలి . శరీరం డీహైడ్రేట్ కాకుండా జాగ్రత్త పడాలి .
కాటన్ వంటి సహజ ఫైబర్లతో తయారైన లేతరంగు , వదులుగా ఉండే దుస్తులను ధరించడం మంచిది .
ఎండలకు దూరంగా ఉండాలి . బయటకు వెళ్తే క్రీములు పూసుకోవడం , టోపీ పెట్టుకోవడం , వెంట గొడుగు తీసుకెళ్లడం మరిచిపోవద్దు .
ఎండ రాకముందే మీ పనులు పూర్తిచేసుకొనేలా ప్లాన్ చేసుకోండి . ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య బయట తిరిగే కార్యక్రమాలకు దూరంగా ఉండటం ఉత్తమం .
ఎండల తీవ్రత అధికంగా ఉన్నప్పుడు మీ చేతుల్లో మెడపై తడి తువ్వాలు లేదా కూల్ ప్యాక్లు ఉంచుకోండి . మీ పాదాలను చల్లని నీటిలో ఉంచడం ఉత్తమం .
శారీరక శ్రమను తగ్గించండి . ఉదయాన్నే చల్లగా ఉన్నప్పుడు మీ ఇంట్లో పనులు త్వరగా తెమల్చుకోండి .
Thanks for reading Why sun flares this time? What precautions should be taken?
No comments:
Post a Comment