విద్యార్థులకు విప్రో ఉద్యోగాలు సిద్ధం!
బీటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సుల అభ్యర్థులకు అవకాశం
ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ విప్రో బీఈ/బీటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సులు పూర్తి చేసుకున్న, ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతోన్న విద్యార్థులకు ఉద్యోగాలివ్వడానికి ముందుకొచ్చింది. ఇందుకోసం ఎలైట్-2022 పేరుతో పరీక్షలు నిర్వహించనుంది. ఎంపికైనవారికి రూ.3.5 లక్షల వార్షిక వేతనం దక్కుతుంది. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు విప్రో వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.
ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ (ఎన్‌టీహెచ్)-2022 పేరుతో విప్రో దేశవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ ఫ్రెషర్ల కోసం ప్రతిభాన్వేషణ పరీక్షకు సిద్ధమైంది. ఇంజినీరింగ్ విభాగాల్లో అత్యుత్తమ నైపుణ్యాలున్నవారిని ఒడిసిపట్టడానికి వీటిని నిర్వహిస్తోంది. ఎంపికైనవారికి ప్రొజెక్ట్ ఇంజినీర్ హోదా కేటాయిస్తారు. వీరికి రూ.3.5 లక్షల వార్షిక వేతనం అందుతుంది. ఈ విధానంలో చేరినవారు ఏడాది పాటు సంస్థలో కొనసాగడం తప్పనిసరి. ఇందుకోసం రూ.75,000 విలువైన ఒప్పంద పత్రంపై అంగీకారం తెలపాలి. నిర్ణీత గడువు పూర్తిచేసుకున్నవారికి బోనస్‌లు ఉంటాయి. ఏటా ఇక్రిమెంట్లు ఉంటాయి.
అర్హత
పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. అలాగే బీటెక్/బీఈ/ఇంటిగ్రేటెడ్ ఎంటెక్‌లో 60 శాతం తప్పనిసరి. 2021లో కోర్సులు పూర్తిచేసుకున్నవారు, 2022లో బీటెక్ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సులు పూర్తిచేసుకోబోతున్నవాళ్లు అర్హులు. ఫ్యాషన్ టెక్నాలజీ, టెక్స్‌టైల్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ కోర్సులు చదివినవారు మినహాయించి, మిగతా అన్ని ఇంజినీరింగ్ బ్రాంచీలవారికీ అవకాశం ఉంది. పదో తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ మధ్య అకడమిక్ గ్యాప్ మూడేళ్లకు మించరాదు. దూరవిద్య, పార్ట్ టైమ్ విధానంలో పది/ఇంటర్ చదివినవారికి అవకాశం లేదు. అసెస్‌మెంట్ స్టేజ్ సమయానికి ఒక బ్యాక్‌లాగ్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఉద్యోగంలో చేరేటప్పటికీ ఉత్తీర్ణత సాధించాలి. గత ఆరు నెలల్లో విప్రో నియామక ప్రక్రియలో పాల్గొన్నవారికి అవకాశం లేదు.
ఎంపిక ఇలా
ఆన్‌లైన్ అసెస్‌మెంట్‌తో అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఇందుకోసం 128 నిమిషాల వ్యవధితో 3 సెక్షన్లలో పరీక్ష నిర్వహిస్తారు. ఆప్టిట్యూడ్, రిటెన్ కమ్యూనికేషన్, ఆన్‌లైన్ ప్రోగ్రామింగ్ విభాగాల్లో అభ్యర్థిని పరీక్షిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి టెక్నికల్, హెచ్‌ఆర్ ఇంటర్వ్యూలు ఉంటాయి. వీటిలోనూ ప్రతిభ చూపిస్తే శిక్షణకు ఎంపికచేస్తారు. దాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్నవారిని విధుల్లోకి తీసుకుంటారు.
పరీక్షలో...
‣ ఆప్టిట్యూడ్: ఇందులో లాజికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, ఇంగ్లిష్ (వెర్బల్) ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. వ్యవధి 48 నిమిషాలు.
‣ రిటెన్ కమ్యూనికేషన్: వ్యాసం రాయాలి. దీనికి 20 నిమిషాలు కేటాయించారు.
‣ ఆన్‌లైన్ ప్రోగ్రామింగ్: 2 ప్రోగ్రామ్‌లకు కోడ్ రాయాలి. ఇందుకోసం జావా, సీ, సీ++, పైథాన్ వీటిలో దేనినైనా ఎంచుకోవచ్చు. వ్యవధి 60 నిమిషాలు.
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: మే 22 వరకు.
ఆన్‌లైన్ అసెస్‌మెంట్ పరీక్షలు: మే 21 నుంచి జూన్ 5 వరకు
వెబ్‌సైట్: https://careers.wipro.com/elite
Thanks for reading Wipro jobs ready for students!
No comments:
Post a Comment