కొత్త కారు కొనాలా? ఎంతవరకు పెట్టొచ్చు?
కారంటే మునుపటి రోజుల్లో లగ్జరీ.. ఇప్పుడు అవసరం. కారు కొనుగోలు అంత సులభమేమీ కాకపోయినప్పటికీ వివిధ బ్యాంకులు ఇస్తున్న వాహన రుణాలు వాటి కొనుగోలు పట్ల ఆసక్తి చూపేలా చేస్తున్నాయి. తక్కువ వడ్డీలో రుణాలు లభిస్తున్నాయన్న కారణంతో ముందుకెళ్లకుండా బ్రేక్ వేయాలంటున్నారు నిపుణులు. కారు కొనేముందు మన బడ్జెట్ (ఆదాయం, అప్పులు, బాధ్యతలు)ను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు.
సాధారణంగా ఇల్లు కొనుగోలు అనేది పెద్ద నిర్ణయం. ఖర్చు ఎక్కువ. రుణం తీసుకుంటే చాలా సంవత్సరాలు ఈఎమ్ఐ చెల్లించాలి. దీని తరువాత తీసుకునే పెద్ద నిర్ణయాల్లో కారు రుణం ఒకటి. అందులోనూ ఇది డిప్రిసియేషన్ ఎసెట్. కాలంగడుస్తున్న కొద్దీ ఉపయోగిస్తున్న కొద్దీ విలువ తగ్గుతుంది. అందువల్ల భారం కాదు, ఖర్చును భరించగలం అనుకున్నప్పుడు మాత్రమే ఖర్చు చేయడం వివేకం. అందుకే కారు కొనేముందు బడ్జెట్ ఎంత అనేది తెలుసుకోవడంతో పాటు, అనుకున్న బడ్జెట్‌కు మనం ఎంత కట్టుబడి ఉన్నామన్నది ముఖ్యం.
బడ్జెట్ ఎంత...?
మీ వార్షిక ఆదాయంలో సగం వరకు కారు కోసం ఖర్చు చేయొచ్చు. ఉదాహరణకు మీ వార్షిక ఆదాయం రూ.10 లక్షలు అనుకుందాం. అందులో దాదాపు రూ.5 లక్షల వరకు కారు కోనుగోలుకు ఖర్చు చేయొచ్చు. ఇక్కడ నికర ఆదాయం లేదా స్థూల ఆదాయం.. దేన్నైనా పరిగణనలోకి తీసుకోవచ్చు. అయితే, కారు ఆన్-రోడ్ ధరను పరిగణనలోకి తీసుకుని బడ్జెట్ నిర్ణయించాలి. షోరూమ్ ధరపై ఆధారపడకూడదు.
ఏమిటీ 20/4/10 రూల్..?
రుణం తీసుకుని కారు కొనుగోలు చేసేవారు.. బడ్జెట్‌ను నిర్ణయించేందుకు కొన్ని నియమాలు సహాయపడతాయి. అందులో ముఖ్యమైనది 20/4/10 థంబ్ రూల్. ఈ నియమం ప్రకారం.. కారు ఆన్ రోడ్ ధరలో 20 శాతం డౌన్‌పేమెంట్‌గా మీ పొదుపు నుంచి చెల్లించగలగాలి. రుణం మొత్తం కాలవ్యవధి గరిష్ఠంగా 4 సంవత్సరాలు ఉండాలి. తిరిగి చెల్లింపుల కోసం ఎంచుకునే ఈఎమ్ఐ మీ నెలవారీ ఆదాయంలో 10 శాతానికి మించి ఉండకూడదు.
ఉదాహరణకు.. మీ వార్షిక ఆదాయం రూ. 12 లక్షలు అనుకుందాం. కారు కొనుగోలు ఆన్ రోడ్ ధర రూ.6 లక్షల్లోపు ఉండాలి. థంబ్ రూల్ ప్రకారం.. కారు కొనుగోలు విలువలో 20 శాతం అంటే రూ.1.2 లక్షలను డౌన్‌పేమెంట్ కోసం చెల్లించాలి. మిగిలిన రూ.4.8 లక్షలు రుణం తీసుకోవచ్చు. నెలవారీ ఈఎమ్ఐ దాదాపు రూ.10వేలు ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం చాలా మంది రుణదాతలు 7.5 నుంచి 8 శాతం వడ్డీతో కారు లోన్ ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి 4 సంవత్సరాల కాలపరిమితి ఎంచుకుంటే సరిపోతుంది. రూ.4.8 లక్షల రుణాన్ని 8 శాతం వడ్డీ రేటుతో 4 సంవత్సరాల కాలపరిమితికి తీసుకుంటే చెల్లించాల్సిన ఈఎమ్ఐ రూ.11,718 అవుతుంది.
ఎక్కువ ఈఎమ్ఐ ఎంచుకుంటే..?
రుణాలు తీసుకునే వారిలో అధిక శాతం మందిని పరిగణనలోకి తీసుకుని, అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని, అందరికీ ఉపయోగపడే విధంగా థంబ్ రూల్ వంటివి తీర్చిదిద్దుతారు. ఈ నియమాలు ఫాలో కావడం మంచిదే. అయితే ఒకవేళ ఎక్కువ చెల్లించగలం అనుకున్న వారు ఈఎమ్ఐ పెంచుకోవచ్చు. దీనివల్ల వడ్డీ తగ్గుతుంది. అలాగే రుణం కూడా త్వరగా పూర్తిచేయొచ్చు. కానీ దీని కారణంగా ఇతర దీర్ఘకాలిక లక్ష్యాల పెట్టుబడులు దెబ్బతినకుండా చూసుకోవడమూ ముఖ్యమే.
బడ్జెట్‌కు కట్టుబడి ఉండండి.. ఖర్చు తగ్గించుకోవడం..
బడ్జెట్‌కు కట్టుబడి ఉండేందుకు అనేక ఆప్షన్లు ఉన్నాయి. పై ఉదాహరణనే తీసుకుంటే.. చౌకైన మోడల్ కారును ఎంచుకోవచ్చు. రూ.6 లక్షలు ఖర్చు చేసి కొనుగోలు చేయడానికి బదులు.. మరో మోడల్ కారును ఎంచుకుని రూ.5 లక్షల ఖర్చయ్యేలా చూసుకోవడం ఒక పద్ధతి. అప్పుడు 20 శాతం డౌన్‌పేమెంట్‌గా రూ.1 లక్ష (20 శాతం) చెల్లించి రూ.4 లక్షలు రుణం తీసుకోవచ్చు. 4 సంవత్సరాల కాలపరిమితిని ఎంచుకుని రూ.9,765 ఈఎమ్ఐ చెల్లించవచ్చు.
ఈఎమ్ఐ లేదా డౌన్‌పేమెంట్ పెంచడం..
అదే సంవత్సరంలో బోనస్ వస్తే, కొంచెం ఎక్కువ ఈఎమ్ఐ ఎంచుకునే అవకాశం ఉంది. అలాగే డౌన్‌పేమెంట్‌ను పెంచుకునే అవకాశం ఉంది. 20 శాతం డౌన్‌పేమెంట్‌కి బదులు.. మొత్తం రుణంలో మూడో వంతును డౌన్‌పేమెంట్‌గా చెల్లించవచ్చు. అంటే రూ.1.2 లక్షలకు బదులు రూ.2 లక్షలు చెల్లించాలి.
ప్రాధాన్యత ఆధారంగా..
మీ ప్రాధాన్యతను బట్టి కొత్త కారు కొనడానికి బదులు ఉపయోగించిన కారును కొనుగోలు చేయొచ్చు. రుణం అందుబాటులో ఉంది కదా అని బడ్జెట్‌కు మించి ఖర్చు చేసి కొనుగోలు చేసే కంటే.. స్థోమత ఆధారంగా ఆలోచించి ఖర్చు చేయడం అన్ని విధాలా మేలు చేస్తుంది.
Thanks for reading Want to buy a new car? How much will it cost?
No comments:
Post a Comment