MonkeyPox : మంకీపాక్స్ భయం .. కేంద్రం కొత్త మార్గదర్శకాలు
దేశంలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వ్యాధి వ్యాప్తి నివారణ నిమిత్తం కేంద్ర ఆరోగ్య శాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.
ఈ సందర్భంగా అంతర్జాతీయ ప్రయాణికులకు పలు సూచనలు చేసింది. విదేశాలకు వెళ్లే ప్రయాణికులు.. అక్కడ అనారోగ్యంతో ఉన్నవారికి దూరంగా ఉండాలని, జంతు సంబంధిత ఆహార పదార్థాలను పక్కనబెట్టాలని సూచించింది.
అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలివే..
> విదేశాల్లో ఉన్నప్పుడు రోగులు, ముఖ్యంగా చర్మ సంబంధ వ్యాధులు, జననేంద్రియ వ్యాధులతో బాధపడుతోన్న వారికి దూరంగా ఉండాలి.
> అక్కడ చనిపోయిన లేదా బతికున్న ఎలుకలు, ఉడతలు, కోతులు, చింపాజీలను నేరుగా తాకకూడదు.
> ఆఫ్రికాకు చెందిన అడవి జంతువుల మాంసంతో తయారుచేసిన ఆహార పదార్థాలు, ఇతర ఉత్పత్తులను ఉపయోగించకూడదు.
> రోగులు ఉపయోగించిన దుస్తులు, పడక, ఇతర వస్తువులను ఉపయోగించకూడదు.
దీంతో పాటు పలు సూచనలు కూడా చేసింది. మీరున్న ప్రాంతంలో మంకీపాక్స్ కేసులు నమోదైనా, లేదా మంకీపాక్స్ లక్షణాలతో ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా మెలిగినా, ఈ వైరస్ లక్షణాలు కన్పించినా వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. మరోవైపు, మంకీపాక్స్ కేసులను నిర్ధారించేందుకు 15 వైరస్ రీసర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ లాబొరేటరీస్ సిద్ధంగా ఉన్నట్లు ఐసీఎంఆర్ శుక్రవారం వెల్లడించింది.
దేశంలో తొలి మంకీపాక్స్ కేసు గురువారం నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. కేరళలోని కొల్లాంకు చెందిన ఓ వ్యక్తి ఈ వైరస్ బారినపడ్డారు. సదరు వ్యక్తి ఇటీవలే యూఏఈ నుంచి దేశానికి వచ్చినట్లు కేరళ వైద్యారోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. వచ్చిన తర్వాత అనారోగ్యానికి గురయ్యాడు. మంకీపాక్స్ లక్షణాలు కన్పించడంతో అతని శాంపిళ్లను పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించగా మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. యూఏఈలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఓ మంకీపాక్స్ రోగితో సన్నిహితంగా మెలిగినట్లు గుర్తించారు. బాధితుడి తల్లిదండ్రులు సహా మొత్తం 13 మందిని 'ప్రైమరీ కాంటాక్ట్స్'గా గుర్తించారు.
ఓవైపు కరోనా మహమ్మారి ముప్పు కొనసాగుతుండగా.. మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటివరకు 50 దేశాల్లో ఈ వైరస్ కేసులు నమోదవ్వగా.. ఒక మరణం కూడా చోటుచేసుకుంది. దీనిపై అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల హెచ్చరించింది.
Thanks for reading MonkeyPox : Fear of monkeypox .. Center's new guidelines
No comments:
Post a Comment