Atal Pension Yojana: ఇక.. అటల్ పెన్షన్ యోజనకు వారు అనర్హులు..!
దిల్లీ: కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రత పథకమైన అటల్ పెన్షన్ యోజన (ఏపీవై)పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 1వ తేదీ నుంచి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ స్కీమ్‌కు అనర్హులని ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది.
‘‘అక్టోబరు 1, 2022వ తేదీ నుంచి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు అటల్ పెన్షన్ యోజనలో చేరేందుకు అనర్హులు. అయితే ఆ తేదీ కంటే ముందే స్కీంలో చేరిన వారికి ఈ నిబంధన వర్తించదు. ఒకవేళ, ఆదాయపు పన్ను చెల్లింపుదారులెవరైనా అక్టోబరు 1 తర్వాత ఏపీవైలో చేరినట్లు గుర్తిస్తే వెంటనే వారి ఖాతాను మూసివేస్తాం. అప్పటివరకు వారు జమ చేసిన మొత్తాన్ని తిరిగి చందాదారులకు చెల్లిస్తాం’’ అని ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. అక్టోబరు 1వ తేదీ కంటే ముందే ఈ పథకంలో చేరిన ఆదాయపు పన్ను చెల్లింపుదారులు స్కీంలో కొనసాగుతారు. ఆదాయపు పన్ను చట్టాల నిబంధనల ప్రకారం.. ఏడాదికి రూ.2.5లక్షల కంటే ఎక్కువ వేతనం ఉన్నవారు ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
అసంఘటిత రంగంలో కార్మికులకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించే దిశగా 2015 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. 18-40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అర్హత గల (అసంఘటిత రంగంలో పనిచేసే) పౌరులు ఈ పథకంలో చేరొచ్చు. నెలకు రూ.100 నుంచి చందా కట్టొచ్చు. ఈ చందాకు బ్యాంకు సేవింగ్స్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి. చందాదారుల వయసు 60 ఏళ్లు నిండిన తర్వాత వారు కట్టిన మొత్తాన్ని బట్టి రూ.1000 నుంచి రూ.5000 వరకు పింఛను హామీ ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు 99లక్షల మందికి పైగా ఈ స్కీంలో చేరారు. 2022 మార్చి నాటికి అటల్ పెన్షన్ యోజన కింద 4.01కోట్ల మంది చందాదారులుగా ఉన్నారు.
Thanks for reading Atal Pension Yojana: ఇక.. అటల్ పెన్షన్ యోజనకు వారు అనర్హులు..!
No comments:
Post a Comment