PPF : పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ( పీపీఎఫ్ ) ఆకర్షణీయమైన ఫీచర్స్ ఇవే !
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అనేది ప్రభుత్వ మద్దతు గల పొదుపు పథకం. పీపీఎఫ్ ఖాతాను పోస్టాఫీసులో గాని, ప్రభుత్వ రంగ బ్యాంకులో గానీ ప్రారంభించవచ్చు.
ఇది దీర్ఘకాల పథకం అవ్వడంతో పెట్టుబడిదారుడు పదవీ విరమణ నిధిని కూడా కూడపెట్టవచ్చు. పీపీఎఫ్ ఖాతా 100% రిస్క్ లేనిది, అంతేగాక 6% సగటు వార్షిక ద్రవ్యోల్బణం వృద్ధిని అధిగమించగల పరిమిత పొదుపు పథకాలలో ఇది ఒకటి.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) డిపాజిట్లు 2013-2022..ఈ 9 సంవత్సరాల్లో 134% పెరిగాయి. 2013-14లో ఈ పీపీఎఫ్ నికర డిపాజిట్లు 5,487.43 కోట్లు ఉంటే.. 2021-22 సంవత్సరానికి రూ. 12,846 కోట్లుగా నమోదయ్యాయి. గత కొన్ని త్రైమాసికాలుగా, పీపీఎఫ్‌తో సహా మరిన్ని చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు మారలేదు.
పీపీఎఫ్‌లో ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో పాటు మదుపుదార్లను ఆకర్షించే అనేక అంశాలు ఉన్నాయి.
అధిక వడ్డీ రేటు:
పీపీఎఫ్‌లో ఆకర్షణీమైనది దీని వడ్డీ రేటే. ప్రముఖ పేరున్న బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు కూడా పీపీఎఫ్ వడ్డీ రేటు కన్నా ఇప్పుడు తక్కువే ఉన్నాయి. ప్రస్తుతం, పీపీఎఫ్ వడ్డీ రేటు 7.10 శాతంగా ఉంది. పీపీఎఫ్ వడ్డీ నెలవారీ ప్రాతిపదికన లెక్కిస్తారు. పీపీఎఫ్ ఖాతాదారుడు నెలలో 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు డిపాజిట్ చేసినట్లయితే ఆ నెలలో చేసిన డిపాజిట్‌కు.. వడ్డీ పొందొచ్చు. సంవత్సరానికొకసారి డబ్బులు కట్టేవారు కూడా ఏప్రిల్ 1 నుండి 4 లోపు డిపాజిట్ చేయడం మంచిది. పీపీఎఫ్‌లో పెట్టుబడిదారునికి అసలుపైనే కాకుండా వడ్డీపై వడ్డీ కూడా వస్తుంది.
పన్ను ప్రయోజనాలు:
పీపీఎఫ్ పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. పీపీఎఫ్‌లో మెచ్యూరిటీపై పొందే అసలు, వడ్డీ మొత్తం కూడా పన్ను రహితం. ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) ఫైల్ చేసినప్పుడు సెక్షన్ 80సీ కింద ఈ పన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేయొచ్చు.
స్వల్ప మొత్తంలో కూడా డిపాజిట్ చేయవచ్చు:
ఒక ఆర్ధిక సంవత్సరంలో కనీసం రూ. 500 డిపాజిట్ చేయాలి. గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. ఇంతకన్నా ఎక్కువ డిపాజిట్ చేసినా గరిష్ట పరిమితి రూ. 1.50 లక్షలకే వడ్డీ ఇస్తారు. ఒకవేళ ఒక ఆర్ధిక సంవత్సరంలో కనీస డిపాజిట్‌గా రూ. 500 కూడా చేయని పక్షంలో విఫలం అయితే పీపీఎఫ్ ఖాతా స్తంభింపజేస్తారు. పీపీఎఫ్ ఖాతాను మళ్లీ కొనసాగించడానికి సంవత్సరానికి రూ. 50, స్వల్ప జరిమానా చెల్లించవలసి ఉంటుంది.
దీర్ఘకాలం పాటు ఖాతా పొడిగింపు:
15 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి పూర్తయిన తర్వాత, వ్యక్తి పీపీఎఫ్ ఖాతాను 5 సంవత్సరాల కాలానికి పొడిగించవచ్చు. ఇలా అపరిమితంగా 5 ఏళ్లకు ఒకసారి పొడిగించుకోవచ్చు.
రుణ సౌకర్యం:
పీపీఎఫ్ లో రుణ సౌకర్యం కూడా ఉంటుంది. ఖాతా తెరిచిన ఆర్ధిక సంవత్సరం నుంచి 1 ఏడాది వేచి ఉన్నాక రుణం తీసుకోవచ్చు. ఉదా: మీరు 2022-23 సంవత్సరంలో పీపీఎఫ్ ఖాతాను తెరిస్తే, 2024-25లో మీ డిపాజిట్లపై రుణం తీసుకోవచ్చు. ఖాతాలో ఉన్న మొత్తంపై 25% వరకు గరిష్టంగా రుణం తీసుకోవచ్చు.
ప్రభుత్వ హామి:
పీపీఎఫ్ డిపాజిట్లకు ప్రభుత్వ హామి ఉంటుంది. మీరు పీపీఎఫ్ ఖాతా తెరిచిన బ్యాంకు లేదా పోస్టాఫీసుకు ఏదైనా ఇబ్బంది వాటిల్లినా, ప్రభుత్వమే హామి ఇచ్చినందున మీ డబ్బు సురక్షితంగానే ఉంటుంది.
భద్రత:
ఖాతాదారుడు వేరే ఏవైనా ఆర్ధిక లావాదేవీలో విఫలం చెందినా, పీపీఎఫ్ రుణాన్ని చెల్లించడానికి ఖాతాలో సొమ్మును మళ్లించలేరు. ఆఖరికి కోర్టు డిక్రీ ఆర్డర్ ద్వారా కూడా చేయడానికి వీలులేదు. పీపీఎఫ్ సొమ్ముకు ఆ స్థాయిలో భద్రత ఉంది.
Thanks for reading PPF: These are the attractive features of Public Provident Fund (PPF)!
No comments:
Post a Comment