Dada Saheb Phalke: ఆశా పరేఖ్‌కు దాదా సాహెబ్ అవార్డు
మన దేశంలో సినీ రంగానికి సంబంధించి ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డుల్లో ‘దాదా సాహెబ్ ఫాల్కే’ (Dada Saheb Phalke)ప్రధానమైనది . ఆ అవార్డుకు బాలీవుడ్ ప్రముఖ నటి ఆశా పరేఖ్ (Asha Parekh) ఎంపికైనట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం ప్రకటించారు. 2020 సంవత్సరానికిగాను ఆమె ఆ అవార్డును అందుకోనున్నారు. 68వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్‌లో భాగంగా సెప్టెంబరు 30న కేంద్ర ప్రభుత్వం ఆశాకు అవార్డును ప్రదానం చేయనుంది.
ఆశా 1942 అక్టోబరు 2న గుజరాతీ కుటుంబంలో జన్మించారు. తన తల్లి ప్రోత్సాహంతో ఆశా బాల్యంలోనే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నారు. అది కాస్తా నటనపై ఆసక్తి పెంచింది. అలా.. 1952లో తెరకెక్కిన ‘మా’ అనే హిందీ చిత్రంలో ఆమె బాల నటిగా తెరంగేట్రం చేశారు. ‘ఆస్మాన్’, ‘ధోబి డాక్టర్’, ‘శ్రీ చైతన్య మహాప్రభు’, ‘బాప్ బేటీ’ తదితర చిత్రాల్లో బాల నటిగా సందడి చేసి, ‘దిల్ దేకే దేఖో’ (1959) అనే సినిమాతో కథానాయికగా మారారు. నటిగా తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు రావటంతో ఆశా వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఒక్కో ఏడాది గరిష్ఠంగా ఆమె ఆరు చిత్రాల్లో నటించేవారు. ‘ఘరానా’, ‘జిద్దీ’, ‘లవ్ ఇన్ టోక్యో’, ‘తీస్రీ మంజిల్’, ‘ఫిర్ ఓహి దిల్ లయ హూన్’, ‘భరోసా’లాంటి పలు సూపర్‌హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. బాలీవుడ్‌లో చాలా బిజీగా ఉండే, అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా ఆశా 1960 దశకంలో నిలిచారు. 1995లో వచ్చిన ‘ఆందోళన్’.. నటిగా ఆమెకు చివరి సినిమా. 1999లో వచ్చిన ‘సర్ ఆంఖో పర్’ అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన ఆశా ఆ తర్వాత నటనకు దూరమయ్యారు. దర్శకురాలు, నిర్మాతగా బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన ఆశాను 1992లో పద్మశ్రీ అవార్డు వరించింది.
Thanks for reading Dada Saheb Phalke: Dada Saheb Award to Asha Parekh
No comments:
Post a Comment