Smartphone: ఫోన్ కొనాలనుకుంటే దీపావళిలోపే ప్లాన్ చేసుకోండి.. ఎందుకంటే?
టెలికాం కంపెనీలన్నీ పండగ తర్వాత స్మార్ట్‌ఫోన్ ధరలు ముఖ్యంగా బేసిక్ మొబైల్ ధరలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం పండగ సీజన్ నడుస్తోంది. ఆన్‌లైన్ వస్తు విక్రయ వేదికలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా పలు పోర్టళ్లు స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్‌ను ఇస్తున్నాయి. అలాగే ఆఫ్‌లైన్ స్టోర్లు సైతం రాయితీతో పాటు, బహుమతులూ అందిస్తున్నాయి. ఇండియాలో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేవారికి ఇదే మంచి అవకాశమని తాజా నివేదిక చెబుతోంది. పండగ సీజన్ అయిన వెంటనే అన్ని మొబైల్ కంపెనీలు తమ ఫోన్ల ధరలను పెంచే అవకాశం ఉందట. ప్రముఖ ఆంగ్లపత్రిక కథనం ప్రకారం.. టెలికాం కంపెనీలన్నీ పండగ తర్వాత స్మార్ట్‌ఫోన్ ధరలు ముఖ్యంగా బేసిక్ మొబైల్ ధరలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ పెరుగుదల ఏడుశాతం వరకూ ఉంటుందని టెక్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం రూ.17,000లకు విక్రయిస్తున్న ఓ స్మార్ట్ ఈ ఏడాది చివరి నాటికి రూ.20వేలకు చేరుతుందని అంచనా వేస్తున్నాయి.
కారణం అదేనా?
మొబైల్ ఫోన్ల ధరల పెరుగుదలకు బలహీన పడుతున్న రూపాయి విలువే కారణమని తెలుస్తోంది. గత కొంతకాలంగా డాలర్‌తో పోలిస్తే, రూపాయి విలువ క్షీణిస్తూ వస్తోంది. అందుకు అనుగుణంగా మొబైల్ కంపెనీల ముడి వస్తువుల ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. మొబైల్ ఫోన్లను భారత్‌లో తయారు చేస్తున్నప్పటికీ అందులో వినియోగించే అన్ని డివైజ్‌లను వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో మొబైల్ ఫోన్ల ధరలు పెంచటం మినహా కంపెనీలకు మరో మార్గం కనిపించడం లేదు. ప్రస్తుతం కంపెనీలు భరిస్తున్న భారాన్ని వినియోగదారుడికి బదిలీ చేయనున్నారు. మరోవైపు మిడ్ బడ్జెట్, ప్రీమియం స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే, బడ్జెట్ మొబైళ్ల ధరల విషయంలోనే గణనీయమైన మార్పు ఉంటుందని నివేదిక చెబుతోంది. తాజాగా ఆపిల్ ఐఫోన్ ఎస్‌ఈ ధరలను భారత్‌లో రూ.6వేలు పెంచిన సంగతి తెలిసిందే.
Thanks for reading Smartphone: If you want to buy a phone, plan before Diwali.. because?
No comments:
Post a Comment