Aadhar Update: ఆధార్ నిబంధనలు సవరించిన కేంద్రం.. పదేళ్లకోసారి ధ్రువీకరణ తప్పనిసరి!
ఆధార్ నిబంధనలను తాజాగా కేంద్రం సవరించింది. ఆధార్ పొందిన ప్రతి వ్యక్తి పదేళ్లకోసారి తమ వ్యక్తిగత వివరాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అప్‌డేట్ చేసుకోవాలని కోరింది. దీనివల్ల ప్రభుత్వాల వద్ద ఆధార్ సమాచారం కచ్చితత్వంతో నిక్షిప్తం అవుతుందని తెలిపింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి సేవలు పొందాలన్నా ఆధార్ తప్పనిసరి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటిదాకా దేశంలో 134 కోట్ల ఆధార్ నంబర్లు జారీ అయ్యాయి. వీటిలో కొన్ని ఆధార్ కార్డుల వివరాలు సరిగా లేవని ప్రభుత్వం చెబుతోంది. అందుకే దేశంలో ప్రతి వ్యక్తి పదేళ్లకోసారి ఆధార్ కార్డుకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలని కోరింది. గురువారం దీనికి సంబంధించిన నిబంధనలను సవరిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ‘‘ఈ మేరకు ఆధార్ పొంది పదేళ్లు పూర్తి చేసుకున్న ప్రతి వ్యక్తి కనీసం ఒక్కసారైనా వ్యక్తిగత వివరాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి. దీనివల్ల కేంద్ర సమాచార నిల్వ కేంద్రం (సీఐడీఆర్)లో డేటా కచ్చితత్వంతో నిక్షిప్తం అవుతుంది’’ అని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ తెలిపింది. పదేళ్లకోసారి వ్యక్తిగత ధ్రువీకరణ (పీఓఐ), ఇంటి చిరునామా ధ్రువీకరణ (పీఓఏ) పత్రాలను సమర్పించడం ద్వారా సీఐడీఆర్‌లో సమాచారం ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంటుందని తెలిపింది.
గత నెలలోనే భారత విశిష్ట ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఆధార్ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి అప్‌డేట్ డాక్యుమెంట్ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్లు తమ వ్యక్తిగత వివరాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ యూజర్లు ‘మై ఆధార్ పోర్టల్’ లేదా ‘మై ఆధార్ యాప్’ ద్వారా కానీ, దగ్గర్లోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి పేరు, ఫొటో, అడ్రస్ వివరాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించి అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఆధార్ కలిగిన ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ ఆధార్ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని ఉడాయ్ కోరుతోంది. దీనివల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సుమారు వెయ్యి పథకాలు అర్హులైన వారు పొందగలరని భావిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ పథకాలకు బయోమెట్రిక్ తప్పనిసరి. అయితే, వయస్సు లేదా అనారోగ్య కారణాల వల్ల వీటిలో మార్పులు జరిగే అవకాశం ఉంది. అందుచేత, ప్రతి పదేళ్లకోసారి ఆధార్ వివరాలు సమర్పించండం ద్వారా ప్రతి పౌరుడి వివరాలు ప్రభుత్వాల వద్ద ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతాయని ఉడాయ్ భావిస్తోంది.
Thanks for reading Aadhar Update: Aadhaar norms have been revised by the Centre.. Verification every ten years is mandatory!
No comments:
Post a Comment