Residential Jobs: గురుకులాల్లో 1,010 ఖాళీల భర్తీకి చర్యలు
* అధికారులతో సమీక్షలో సీఎం జగన్
* గురుకులాలు, వసతి గృహాల్లో 3 దశల్లో నాడు-నేడు
అమరావతి: గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో మూడుదశల్లో నాడు-నేడు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. తొలి విడత పనులు వచ్చే జనవరి నుంచి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఏడాదిలోగా పూర్తి కావాలని స్పష్టంచేశారు. గురుకుల పాఠశాలలు, వసతి గృహాలన్నీ కలిపి 3,013 చోట్ల పనులు చేపట్టాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. మొదటిదశలో 1,366 చోట్ల చేపడతామన్నారు. దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని వసతి గృహాలను మొదటి విడతలోనే బాగు చేయాలని సీఎం ఆదేశించారు. మొదటి విడతకు రూ.1,500 కోట్లు, మొత్తంగా రూ.3,364 కోట్ల వరకు అవుతుందని అధికారులు వివరించారు. నవంబర్ 18న గురుకులాలు, వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు-నేడు పనులపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు వంటగదులను ఆధునీకరించాలి. వాటికి అవసరమైన 10 రకాల వస్తువులను కొనాలి. నాడు-నేడు ద్వారా గణనీయమైన మార్పు కనిపించాలి’ అని చెప్పారు.
జైల్లోకి వెళ్లినట్లు ఉండకూడదు
చదువులు కొనలేని వారు తమ పిల్లల్ని హాస్టళ్లకు పంపిస్తారు. వారు బాగా చదువుకోడానికి, ఎదగడానికి ఇవి వేదిక కావాలి. అంతేగానీ వాటిలోకి వెళ్లేసరికి జైల్లోకి వెళ్లిన భావం పిల్లలకు ఉండకూడదు. సమాజంలో అట్టడుగున ఉన్నవారికి తాము చదువుకోడానికి తగిన పరిస్థితులు లేవన్న భావన రాకూడదు. బెడ్స్.. తదితర సౌకర్యాలన్నీ నాణ్యంగా ఉండాలి. భవనాలను అనుసరించి వాటి డిజైన్లు రూపొందించాలి. పిల్లలకు సకాలంలో నాణ్యమైన వస్తువులు అందించాలి’ అని పేర్కొన్నారు
ఫిర్యాదుకు ప్రత్యేక నంబరు
‘వసతి గృహాల పర్యవేక్షణ పద్ధతి సమూలంగా మార్చాలి. మండలాలవారీగా పర్యవేక్షణ ఏర్పాటు చేయాలి. వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న 759 మంది సంక్షేమాధికారులు, 80 మంది కేర్‌టేకర్ పోస్టుల్ని భర్తీ చేయాలి. గిరిజన గురుకులాల్లో 171 మంది వసతిగృహ అధికారులను నియమించాలి. పోస్టు మెట్రిక్ వసతి గృహాల్లో నాలుగో తరగతి ఉద్యోగుల నియామకంపైనా దృష్టి పెట్టాలి. సమస్యలపై ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక నంబరును అందుబాటులో ఉంచాలి.
అంగన్‌వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత
‘అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు-నేడు పనులు, అనంతర నిర్వహణపై కార్యాచరణ ఉండాలి. అక్కడ మరుగుదొడ్ల నిర్వహణ, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలి. సమస్యలుంటే ఫిర్యాదుల కోసం కేంద్రాల్లో ప్రత్యేక నంబరు పెట్టాలి’ అని ఆదేశించారు. సూపర్‌వైజర్ల పోస్టులను భర్తీ చేశామని, అక్టోబరులో అన్ని కేంద్రాలకు పాలు సరఫరా చేశామని అధికారులు వివరించారు. డిసెంబరు నుంచి ఫ్లేవర్డ్ మిల్క్ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మొదట కొన్నిచోట్ల అమలు చేసి చూస్తామని తెలిపారు. మూడు నెలల్లోగా అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో సరఫరా చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
Thanks for reading Residential Jobs: గురుకులాల్లో 1,010 ఖాళీల భర్తీకి చర్యలు
No comments:
Post a Comment