Income tax: తక్కువ సేవింగ్స్ చేసే వారికి తక్కువ ట్యాక్స్..!
New Income tax Regime: కొత్త పన్ను విధానంవైపు వేతన జీవులను ఆకర్షించేందుకు మోదీ సర్కారు బడ్జెట్‌లో కొత్త పన్ను విధానంలో మార్పులు చేపడుతూ ప్రకటన చేసింది. అదే సమయంలో పాత విధానం జోలికి ఏమాత్రం పోలేదు.
పన్ను వర్తించే ఆదాయం (Income tax) పరిమితి విస్తరణ, శ్లాబుల సవరింపు, 80సి పెంపు.. ఇవీ గత కొంతకాలంగా మధ్య తరగతి ఆదాయ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్. గత కొన్నేళ్లుగా ఈ డిమాండ్ బలపడుతోంది. అయినా కొన్నేళ్ల నుంచి నిరాశే ఎదురవుతోంది. తాజా బడ్జెట్‌లో (Budget 2023) ఆదాయపు పన్ను విషయంలో కీలక మార్పునకు శ్రీకారం చుట్టింది మోదీ సర్కారు. పాత విధానం జోలికి పోని ప్రభుత్వం.. కొత్త పన్ను విధానంలో భారీ మార్పులు చేపట్టింది. రూ. 7 లక్షల వరకు ఎటువంటి పన్ను పడకుండా రిబేట్ ప్రకటించింది. శ్లాబుల సంఖ్యను సైతం కుదించింది. రిటర్న్‌ల సమయంలో కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్ ఆప్షన్‌గా మార్చింది. దీనిబట్టి ఎలాంటి మినహాయింపులూ లేని కొత్త పన్ను విధానాన్ని ఆకర్షణీయంగా మార్చి ప్రజలకు మరింత చేరువ చేయడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది.
పాత పన్ను విధానం ఇలా..
దేశంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఏళ్లుగా ఒకే పన్ను చెల్లింపు విధానం అమల్లోఉంది. అయితే, 2020 బడ్జెట్‌లో తొలిసారి కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చారు. ఇది పూర్తిగా ఐచ్ఛికం మాత్రమే. పాత పన్ను విధానమే డిఫాల్ట్ ఆప్షన్‌గా కొనసాగించారు. ఈ విధానంలో హెచ్‌ఆర్‌ఏ, 80C, 80D, 80CCD సెక్షన్ల కింద దాదాపు రూ.2.5 లక్షల వరకు వేతన జీవులు ఆదాయపు మినహాయింపులు పొందేవారు. ఈ విధానంలో ప్రస్తుతం మూడే పన్ను శ్లాబులు ఉన్నాయి. రూ.2.5 లక్షల వరకు ఎలాంటి పన్నూ ఉండదు. మినహాయింపులు పోనూ ప్రస్తుతం రూ.5లక్షల వరకు ఎలాంటి పన్నూ వర్తించడం లేదు. ఒకవేళ ఆదాయం రూ.5 లక్షలు దాటిన మొత్తంపై 20 శాతం, రూ.10 లక్షలు దాటిన మొత్తంపై 30 శాతం పన్ను వర్తిస్తోంది.
ఆప్షనల్‌గా వచ్చి డిఫాల్ట్‌గా
ఎలాంటి మినహాయింపులూ చూపించకుండా ఆదాయాన్ని బట్టి పన్ను చెల్లించే కొత్త పన్ను విధానాన్ని 2020లో కేంద్రం తీసుకొచ్చినప్పటికీ.. ఇది పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. దీంతో ఈ విధానాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో తాజాగా భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. రిబేట్‌తో కలిపి రూ.7 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో వెల్లడించారు. ఒకవేళ వార్షికాదాయం రూ.9 లక్షలు ఉన్నా.. 10 శాతం పన్ను శ్లాబులోకే వస్తారు. అదే పాత పన్ను విధానం అయితే రూ.5 లక్షలు దాటిన మొత్తంపై 20 శాతం పన్ను వర్తిస్తుంది. అయితే, రెండు పన్ను విధానాల్లో రూ.15 లక్షలు ఆదాయం దాటితే వర్తించే పన్ను శ్లాబు మాత్రం 30 శాతం అన్నది గుర్తుంచుకోవాలి. గృహరుణం తీసుకోని, పన్ను ఆదా పథకాల్లో మదుపు చేయని వారికి కొత్త పన్ను విధానం ప్రయోజనకరంగా ఉంటుంది.
లక్ష్యం క్లియర్..
తాజా బడ్జెట్ ప్రకటన బట్టి వేతన జీవులను కొత్త పన్ను విధానం వైపు మరల్చాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. వేతన జీవుల్లో ఎక్కువ మంది పన్ను ఆదా కోసం పొదుపునకు ప్రాధాన్యం ఇస్తుంటారు. వీరు రిటర్నులు ఫైల్ చేసే సమయంలో ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. దీనికి ఛార్టెడ్ అకౌంటెంట్ వంటి నిపుణుల సాయం తీసుకోవాల్సి ఉంటుంది. అదే ఎలాంటి మినహాయింపులు లేకుండా సులువుగా రిటర్నులు ఫైల్ చేసేందుకు కొత్త పన్ను విధానం వీలు కల్పిస్తోంది. దీన్నే డిఫాల్ట్ ఆప్షన్‌గా కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం బట్టి సర్కారు లక్ష్యం అర్థమవుతోంది. పైగా కొత్త పన్ను విధానంలో రూ.15.5లక్షల ఆదాయం దాటితే కొత్తగా రూ.52,500 మేర ప్రామాణిక మినహాయింపు (స్టాండర్డ్ డిడక్షన్)ను తీసుకొచ్చారు. అదే పాత పన్ను విధానంలో ఇది రూ.50వేలుగా ఉంది. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ మినహాయింపు పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచడం మినహా పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులూ చేయకపోవడం బట్టి కొత్త పన్ను విధానానికి సర్కారు ఇస్తున్న ప్రాధాన్యం అర్థమవుతోంది.
Thanks for reading Income tax: Less tax for those who save less..!
No comments:
Post a Comment