Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, March 11, 2023

AP EAPCET /EAMCET Preparation Strategy


 ఎంసెట్‌/ఈఏపీసెట్ స‌న్న‌ద్ధ‌త వ్యూహం

తెలుగు రాష్ట్రాల్లో కీలక ప్రవేశపరీక్ష... ఎంసెట్‌/ ఈఏపీసెట్‌. విద్యార్థి తాను చదవదల్చిన కోర్సు   కళాశాల, బ్రాంచీని ఎంచుకోవడానికి ఈ ర్యాంకు కీలకం. ఎక్కువ మార్కులూ, ర్యాంకు తెచ్చుకోగలిగితే మేటి కళాశాలలో కోరుకున్న విభాగంలో చేరవచ్చు. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్‌ మార్కులకు    వెయిటేజీ లేదు. ప్రథమ సంవత్సరం సిలబస్‌లో 70, ద్వితీయ సంవత్సరం వంద శాతం సిలబస్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. విద్యార్థులు ఈ విషయాలు దృష్టిలో ఉంచుకుని సన్నద్ధతను కొనసాగించాలి!

ఇంజినీర్‌ లేదా డాక్టర్‌ లక్ష్యంతో తెలుగు రాష్ట్రాల్లోని ఎక్కువ మంది విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో చేరుతున్నారు. తల్లిదండ్రులూ ఈ కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు. ఇంజినీరింగ్‌కు ఐఐటీ, ఎన్‌ఐటీలు ఎంతో పేరున్న సంస్థలు. అయితే దాదాపు అదే స్థాయిలో రాష్ట్ర స్థాయి సంస్థలూ కొన్ని ఉన్నాయి. జేఎన్‌టీయూ, ఉస్మానియా, ఏయూ, మరికొన్ని స్థానిక ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరడానికి ఎంసెట్‌/ఈఏపీసెట్‌ స్కోరు ప్రామాణికం. ఇందులో సాధించిన మార్కులతోనే అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, డైరీ టెక్నాలజీ, ఫుడ్‌ టెక్నాలజీ, బీఫార్మసీ, ఫార్మ్‌ డీల్లో ప్రవేశం పొందవచ్చు. బైపీసీ విద్యార్థులు ఎంసెట్‌తో బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీవీఎస్సీ (వెటర్నరీ సైన్స్‌), బీఎఫ్‌ఎస్సీ (ఫిషరీస్‌), ఫుడ్‌ టెక్నాలజీ, బీఫార్మసీ, బయో టెక్నాలజీ, ఫార్మ్‌ డి, బీఎస్సీ నర్సింగ్‌ల్లో చేరవచ్చు. 

తెలంగాణలో మే 7 నుంచి 11 వరకు, ఏపీలో మే 15 నుంచి ఎంసెట్‌/ ఈఏపీసెట్‌ నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం అకడమిక్‌ పరీక్షలతోపాటు ఈ పరీక్షకు సమాంతరంగా సన్నద్ధత కొనసాగించాలి. ముఖ్యాంశాలన్నీ నోట్సు రాసుకోవాలి. పబ్లిక్‌ పరీక్షల తర్వాత 30-40 రోజుల సమయం ఉంటుంది. కాబట్టి ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పాఠ్యాంశాల పునశ్చరణ ప్రారంభించాలి. మార్కెట్‌లో దొరికే ఎంసెట్‌/ఈఏపీసెట్‌ పుస్తకాలు లేదా షార్ట్‌ టర్మ్‌ ప్రోగ్రాంతో కానీ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పాఠ్యాంశాలను 12+12 రోజులుగా విభజించుకుని ముఖ్యాంశాలన్నీ చదువుకోవాలి. వీలైనన్ని గ్రాండ్‌ టెస్టులు రాసి తప్పులు సరిచేసుకోవాలి. గత సంవత్సరాల్లో నిర్వహించిన ప్రశ్నపత్రాలనూ సాధన చేస్తే పరీక్షపై అవగాహన పెరుగుతుంది. ప్రశ్నల సరళి తెలుసుకోవచ్చు. ఈ సన్నద్ధతలో అర్థం కానివి, కష్టంగా అనిపించినవి అధ్యాపకులతో నివృత్తి చేసుకోవాలి. 

ఎంసెట్‌/ ఈఏపీసెట్‌లో వేగం, కచ్చితత్వం ముఖ్యం. ఎందుకంటే ఎంసెట్‌లో ఇంజినీరింగ్‌ విభాగంలో మ్యాథ్స్‌ 80, ఫిజిక్స్‌ 40, కెమిస్ట్రీ 40 ప్రశ్నలు వస్తాయి. 160 ప్రశ్నలకు 180 నిమిషాల్లో సమాధానం రాయాలి. ఈ మధ్య ఎక్కువ మంది విద్యార్థులు గణితంలో ప్రశ్నలకు సమయం చాలక ఇబ్బంది పడుతన్నారు. కొవిడ్‌తో రెండేళ్ల పాటు అకడమిక్స్‌కు అంతరాయం ఏర్పడింది. విద్యార్థుల్లో గణన సామర్థ్యం కొంత తగ్గింది. అందువల్ల బాగా సాధన చేయడం తప్పనిసరి. ఆన్‌లైన్‌ పరీక్ష కాబట్టి స్క్రీన్‌పై ప్రశ్నలను జాగ్రత్తగా చదివి, సరైన జవాబు గుర్తించాలి. ఏ విభాగం వారైనా 100+ మార్కులు సాధిస్తేనే పేరున్న కళాశాలలో ప్రవేశం పొందవచ్చు.  

మ్యాథ్స్‌

ఇంజినీరింగ్‌ ర్యాంకు ఈ విభాగంలో సాధించిన స్కోరుపై ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ రెండు సబ్జెక్టులూ కలిపి 80 మార్కులు. ఒక్క గణితానికే 80 మార్కులు కాబట్టి ఎక్కువ దృష్టి వహించాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే, ఉన్న వ్యవధిలోపే సమాధానం గుర్తించి, ఎక్కువ మార్కులు పొందవచ్చు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సన్నద్ధమవుతూనే సూత్రాల పునశ్చరణ, సమస్యల సాధన చేయాలి.

 ప్రథమ సంవత్సరంలో 70 శాతం సిలబస్‌ దృష్టిలో ఉంచుకుని ప్రమేయాల్లో ప్రదేశం, వ్యాప్తి, సంయుక్త ప్రమేయాల వరకు చూసుకోవాలి. సదిశల్లో సదిశా సంకలనంలో సరేఖీయ నియమాలు, సదిశల మధ్య కోణం, సమాంతర సదిశలు, సదిశా త్రికలబ్ధం వరకు మననం చేసుకోవాలి. మాత్రికల్లో నిర్ధారకం, గాస్‌ జోర్డాన్‌ పద్ధతిలో సమీకరణ సాధన తప్ప మిగిలిన ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. త్రికోణమితిలో త్రికోణమితీయ సమీకరణాలు, విలోమ త్రికోణమితీయ ప్రమేయాలు తొలగించారు. ఎత్తులు, దూరాలు మినహాయించారు. మిగిలినవాటిలో త్రిభుజ ధర్మాలు, పరివర్తనాలపై శ్రద్ధ పెట్టాలి. బిందుపథం, అక్ష పరివర్తనం, సరళరేఖల నుంచి ప్రశ్నలు అడగొచ్చు. సరళరేఖా యుగ్మాల్లో కోణం సమద్వి ఖండన రేఖాయుగ్మం తొలగించారు. 3డిలో తలం తొలగించారు. అవధులు అవిచ్ఛిన్నతలో ప్రాథమికాంశాలపై ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటాయి. అవకలనంలో విలోమ ప్రమేయాల అవకలనం, ద్వితీయ, పై అవకలనం తొలగించారు. ద్వితీయ సంవత్సరంలో వృత్తాల నుంచి 5 ప్రశ్నలు, పరావలయం- 2, దీర్ఘవృత్తం- 2, అతిపరావలయం- 1, సమాకలనం- 3, నిశ్చిత సమాకలనం- 2, వైశాల్యాలు- 1, అవకలన సమీకరణాలు- 3-4, వర్గసమీకరణాలు, సమాసాలు- 2, సమీకరణ సంవాదం- 2, ప్రస్తారాలు, సంయోగాలు- 2, ద్విపద సిద్ధాంతం- 3, పాక్షిక భిన్నాలు- 1, సంకీర్ణ సంఖ్యలు డీమాయర్స్‌ థియరం- 3, సంభావ్యత- 4, సాంఖ్యకశాస్త్రం నుంచి 1 ప్రశ్న వస్తాయి.

ప్రతి సబ్జెక్టులోనూ బేసిక్స్, కాన్సెప్ట్స్, ఫార్ములాలు, అప్లికేషన్స్‌ను బాగా చదవాలి. పరీక్ష రాసేటప్పుడు ఒత్తిడికి లోనుకాకుండా, నేర్చుకున్న విషయాలను అనువర్తనం చేసుకుంటూ, అనుకూలమైన సబ్జెక్టుతో సమాధానాలు                ప్రారంభించాలి. కష్టమైన ప్రశ్నలకు అధిక వ్యవధిని కేటాయించకూడదు. వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలగాలి. ఆ తర్వాత అన్ని ప్రశ్నలకూ జవాబులు గుర్తించాలి. ఎందుకంటే ఈ పరీక్షలో రుణాత్మక మార్కులు లేవు.  

ఫిజిక్స్‌

ఫిజిక్స్‌లో మంచి మార్కుల కోసం సూత్రాలు, యూనిట్లు, సిద్ధాంతాలు బాగా చదవాలి. మెకానిక్స్, వేవ్స్, థర్మోడైనమిక్స్, మోడర్న్‌ ఫిజిక్స్, ఎలక్ట్రిసిటీ అండ్‌ మ్యాగ్నటిజం, ఆప్టిక్స్‌ ముఖ్యమైనవి. పాత ప్రశ్నపత్రాలు పరిశీలిస్తే ఈ విభాగంపై అవగాహన పొందవచ్చు. విద్యుత్, అయస్కాంతత్వం అత్యంత ముఖ్యమైనవి. వీటికి 20 శాతం వెయిటేజీ ఉంటుంది. గురుత్వాకర్షణ, స్ట్రయిట్‌ లైన్‌ మోషన్, మెకానికల్‌ ప్రాపర్టీస్‌ ఆఫ్‌ సాలిడ్స్, థర్మల్‌ ప్రాపర్టీస్‌ ఆఫ్‌ మ్యాటర్, థర్మోడైనమిక్స్, రొటేటరీ మోషన్, వేవ్స్, రే ఆప్టిక్స్, న్యూక్లీ, సెమీ కండక్టర్స్‌ బాగా అధ్యయనం చేయాలి. ప్రథమ సంవత్సరంలో 70 శాతం సిలబస్‌ నుంచే ప్రశ్నలు వస్తాయి. 30 శాతం అంశాలు చదవాల్సిన అవసరం లేదు. కెప్లర్‌ లాస్, ప్యార్లల్, పర్పెండిక్యులర్‌ యాక్సిస్‌ థీరమ్స్, హీట్‌ ట్రాన్స్‌ఫర్, ఫిజికల్‌ వరల్డ్‌ వీటిని మినహాయించారు. ద్వితీయ సంవత్సరం అన్ని అంశాలపైనా దృష్టి సారించి, వీలైనన్ని మాక్‌ పరీక్షలు రాస్తే, ఎక్కువ మార్కులు పొందవచ్చు. 

కెమిస్ట్రీ

అకాడెమీ పుస్తకాలే బాగా చదవాలి. ఇంటర్మీడియట్‌ బోర్డు పరీక్షల సన్నద్ధతతో నేర్చుకునే అంశాలు జాగ్రత్తగా చదువుకుంటే ఎంసెట్‌కూ ఎంతో ఉపయోగపడతాయి. ఇంటర్‌ పరీక్షల తర్వాత ఉన్న వ్యవధిలో ముఖ్యాంశాలన్నీ నోట్సు రాసుకోవాలి. ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, నేమ్డ్‌ రియాక్షన్స్, రీఏజెంట్స్, ఇంటర్‌ కన్వర్షన్స్‌కి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో పట్టికలు, గ్రాఫ్‌లు, పటాలు, మూలక ధర్మాలు, పేరుతో కూడిన తయారీ పద్ధతులు (నేమ్డ్‌ ప్రాసెస్‌) సాధన చేయాలి. భౌతిక రసాయనశాస్త్రంలో సాధారణంగా ఫార్ములా ఆధారిత న్యూమరిక్‌ ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి పాఠ్యాంశాల్లోని ఫార్ములాలు, స్థిరవిలువలు, యూనిట్‌పై దృష్టి వహించాలి. ఇవన్నీ ఒక దగ్గర రాసుకుని, అప్పుడప్పుడూ చదువుకోవాలి. ప్రతి అధ్యాయం నుంచీ కనీసం ఒక ప్రశ్న అయినా వస్తుంది కాబట్టి వేటినీ నిర్లక్ష్యం చేయకూడదు. కష్టమైన అధ్యాయాల నుంచి తేలికైన ప్రశ్నలే రావచ్చు కాబట్టి అసలు చదవకుండా ఉండొద్దు. ఏ ప్రశ్ననూ వదలొద్దు.

వీటిని పాటించండి! 

1  ఇంటర్‌ పరీక్షల సన్నద్ధత ఎంసెట్‌/ ఈఏపీసెట్‌కూ ఉపయోగం.

2  ప్రతి సబ్జెక్టుకూ రోజులో కొంత సమయం వెచ్చించి చదవాలి.

3  వెయిటేజీ ఎక్కువ ఉన్నవాటినీ, పట్టున్నవాటినీ ప్రాధాన్యంతో చదువుకోవాలి.

4  చాప్టర్లవారీ పరీక్షలు రాయడం మేలు.

5  వీలైనన్ని మాక్‌ పరీక్షలు రాసి, ఫలితాలు విశ్లేషించుకోవాలి. తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. 

6  పాత ప్రశ్నపత్రాలు సమీక్షించుకుని, ప్రశ్నల సరళి అర్థం చేసుకోవాలి.

7  పరీక్ష రాస్తున్నప్పుడు ప్రశ్న క్షుణ్నంగా చదివిన తర్వాతే జవాబు గుర్తించాలి.

8  తెలియని ప్రశ్నలకు ఎలిమినేషన్‌ పద్ధతి ద్వారా జవాబు గుర్తించడానికి ప్రయత్నించాలి.

9  రుణాత్మక మార్కులు లేవు కాబట్టి అన్ని ప్రశ్నలకూ సమాధానం ఇవ్వటం మరవొద్దు!

Thanks for reading AP EAPCET /EAMCET Preparation Strategy

No comments:

Post a Comment