Small Savings Schemes: చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు పెంపు
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి త్రైమాసికానికి చిన్నమొత్తాల పొదుపు పథకాల (Small Savings Scheme) వడ్డీ రేట్లను కేంద్రం సవరించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుల చేసింది.
దిల్లీ: చిన్న మొత్తాల పథకాల్లో పొదుపు చేసుకునే వారికి ఊరటనిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి త్రైమాసికానికి చిన్నమొత్తాల పొదుపు పథకాల (Small Savings Scheme) వడ్డీ రేట్లను సవరించింది. దీంతో సీనియర్ సిటిజన్ల పొదుపు పథకాలు, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాల వడ్డీ రేట్లు మారనున్నాయి. మరోవైపు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సాధారణ సేవింగ్స్ డిపాజిట్ వడ్డీ రేట్లలో ఎలాంటి సవరణలు ప్రకటించలేదు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను 70 బేసిక్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (PPF), కిసాన్ వికాస్ పత్ర (KVP), సుకన్య సమృద్ధి యోజన (SSY) వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రతి మూడు నెలలకోసారి కేంద్రం వడ్డీ నిర్ణయిస్తుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) ప్రస్తుతం ఏడు శాతం వడ్డీ ఇస్తుండగా.. ఏప్రిల్ 1 నుంచి 7.7 శాతం వడ్డీ ఇవ్వనున్నారు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటును 8 శాతం నుంచి 8.2 శాతానికి పెంచారు.అలాగే మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌పై వడ్డీని 7.1 శాతం నుంచి 7.4 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. కిసాన్ వికాస్ పత్ర వడ్డీ రేటును 7.2 శాతం నుంచి 7.5 శాతానికి పెంచారు. మెచ్యూరిటీ అయ్యే నెలలను 120 నుంచి 115కి తగ్గించారు. ఏడాది కాలపరిమితితో డిపాజిట్ వడ్డీ రేటును 6.6 శాతం నుంచి 6.8 శాతానికి, రెండేళ్ల డిపాజిట్ వడ్డీ రేటును 6.8 శాతం నుంచి 6.9 శాతానికి, మూడేళ్లు డిపాజిట్‌కు 6.9 శాతం నుంచి 7 శాతానికి పెంచారు. ఐదేళ్ల కాలపరిమితి డిపాజి వడ్డీరేటును 7 శాతం నుంచి 7.5 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్‌పై 5.8 శాతం నుంచి 6.2 శాతానికి పెంచారు. సుకన్య సమృద్ధి యోజన పథకానికి ప్రస్తుతం 7.6శాతం వడ్డీ ఇస్తుండగా, ఏప్రిల్ 1వ తేదీ నుంచి 8.0శాతం ఇవ్వనున్నారు.
Thanks for reading Small Savings Schemes: Increase in interest rates of small savings schemes
No comments:
Post a Comment