WhatsApp: ఇకపై వాట్సాప్‌లో గ్రూప్‌లు తాత్కాలికమే!
స్కూల్, కాలేజ్, ఆఫీస్ లేదా అపార్ట్‌మెంట్.. ఇలా ప్రతి చోటా ఒకే విషయాన్ని ఎక్కువ మందికి తెలియజేసేందుకు వాట్సాప్ (WhatsApp) గ్రూప్‌లను క్రియేట్ చేస్తుంటారు.
కొన్ని సందర్భాల్లో బర్త్‌డే పార్టీ, కాలేజ్ టూర్ లేదా పండుగ సంబరాలు వంటి వాటి గురించి స్నేహితులు, సహోద్యోగులు తాత్కాలిక గ్రూప్‌లను క్రియేట్ చేసి చర్చిస్తారు. తర్వాత వాటిని డిలీట్ చేయడం మర్చిపోతుంటారు. అలాంటి వారి కోసమే వాట్సాప్ కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది.
డిస్‌అప్పియరింగ్ మెసేజెస్ (Disappearing Messages), వ్యూ వన్స్ (View Once) ఫీచర్ల తరహాలో ఎక్స్‌పైరింగ్ గ్రూప్స్ (Expiring Groups)పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌తో యూజర్లు తాత్కాలిక గ్రూప్‌లను క్రియేట్ చేయొచ్చు. యూజర్ ఎంపిక చేసిన నిర్ణీత కాల వ్యవధి తర్వాత వాటంతటవే ఆటోమేటిగ్గా డిలీట్ అయిపోతాయి. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే సాధారణ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఎలా పనిచేస్తుంది?
వాట్సాప్ గ్రూప్ (WhatsApp Groups) క్రియేట్ చేసిన తర్వాత గ్రూప్ ఇన్ఫోలోకి వెళ్లాలి. అందులో గ్రూప్ సెట్టింగ్స్ (Group Settings) ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఎక్స్‌పైరింగ్ గ్రూప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై టాప్ చేయగానే రోజు (Day), వారం (Week), కస్టమ్ డేట్ (Custom Date), రిమూవ్ ఎక్స్‌పైరేషన్ డేట్ (Remove Expiration Date) అని నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి. కస్టమ్ తేదీ ఆప్షన్‌తో ఏ రోజు వరకు గ్రూప్ లైవ్‌లో ఉండాలనుకుంటున్నారో ఆ తేదీని ఎంపిక చేయాలి. ఒకవేళ గ్రూప్ డిలీట్ అవ్వాల్సిన తేదీ ఎంపిక చేసి.. తర్వాత కూడా కొనసాగించాలనుకుంటే.. రిమూవ్ ఎక్స్‌పైరేషన్ డేట్‌పై క్లిక్ చేయాలి. దాంతో గ్రూప్ అడ్మిన్ డిలీట్ చేసే వరకు సదరు గ్రూప్ లైవ్‌లో ఉంటుంది.
ఇవేకాకుండా వాట్సాప్ మరికొన్ని కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేయనుంది. వీటిలో సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్ (Silence Unknown Callers), షెడ్యూల్ కాల్స్ (Schedule Calls), ట్రాన్స్‌క్రైబ్ వాయిస్ మెసేజెస్ (Transcribe Voice Messages) వంటి పీచర్లు ఉన్నాయి. సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్ ఫీచర్‌తో ఎవరైనా కొత్త నంబర్ నుంచి కాల్ చేస్తే సదరు యూజర్‌కు రింగ్ రాకుండా ఈ ఫీచర్ నిరోధిస్తుంది. దీంతో స్కామ్/స్పామ్ కాల్స్‌ను నిరోధించవచ్చని వాట్సాప్ చెబుతోంది. వాట్సాప్ గ్రూప్‌లో వీడియో/ఆడియో కాల్స్‌ను షెడ్యూల్ చేసేందుకు షెడ్యూల్ కాల్స్ ఫీచర్‌ను తీసుకొస్తుంది. దీంతో సమావేశం పేరు, తేదీ, టైం వంటి వివరాలను ఎంటర్ చేసి క్రియేట్‌పై క్లిక్ చేస్తే కాల్ షెడ్యూల్ అవుతుంది. కాల్ ప్రారంభమైన వెంటనే గ్రూప్ సభ్యులందరికీ అలర్ట్ నోటిఫికేషన్ వెళుతుంది. ఇక ట్రాన్స్‌క్రైబ్ వాయిస్ మెసేజెస్ ఫీచర్‌తో వాయిస్ మెసేజ్‌లను టెక్స్ట్ రూపంలో చదవచ్చు.
Thanks for reading WhatsApp: Groups are now temporary on WhatsApp
No comments:
Post a Comment