CBSE: సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల్లో మార్పులు
* 12వ తరగతిలో మళ్లీ రెండు విడతల విధానం!
* 10, 12 విద్యార్థులకు గత పరీక్షల వెయిటేజీ
* కమిటీ ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ
దిల్లీ: జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా సీబీఎస్‌ఈ పరీక్షల క్రమంలో మార్పులు చేయాలని నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌సీఎఫ్) ముసాయిదా కమిటీ ప్రతిపాదించింది. ఇస్రో మాజీ అధినేత కె.కస్తూరిరంగన్ నేతృత్వంలోని ఈ కమిటీ ప్రతిపాదించిన మేరకు.. సీబీఎస్‌ఈ 12వ తరగతిలో రెండు టర్ముల్లో పరీక్షలు నిర్వహించే విధానం మళ్లీ రావచ్చు. అలాగే 10, 12 తరగతుల వార్షిక పరీక్షల ఫలితాల్లో గత తరగతుల మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రస్తుతం 11, 12 తరగతుల కోసం పాఠ్యాంశాలను సైన్స్, ఆర్ట్స్/హ్యుమానిటీస్, కామర్స్‌లుగా విభజిస్తున్న విధానాన్ని కూడా తొలగించాలని కమిటీ ప్రతిపాదించింది. బోర్డు పరీక్షల్లో తొలి సంస్కరణను 2005లో చేపట్టారు. మళ్లీ 2009లో పదో తరగతికి సీసీఈ (కంటిన్యువస్, కాంప్రెహెన్సివ్ ఎవల్యూషన్) విధానాన్ని ప్రవేశపెట్టారు. 2017లో దీన్ని ఎత్తేసి, మళ్లీ పాత విధానాన్నే అమలు చేశారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో 10, 12 తరగతుల వార్షిక పరీక్షలను ఏడాదికి రెండు విడతలుగా నిర్వహించారు. మళ్లీ గతేడాది నుంచి ఒకే పరీక్ష నిర్వహించేలా పాత పద్ధతిని అమలు చేశారు. సాధారణంగా గణితమంటే విద్యార్థుల్లో ఉన్న భయం పోగొట్టేందుకు మ్యాథ్స్‌ను కళలు, క్రీడలు, భాషతో అనుసంధానించాలని కమిటీ ప్రతిపాదించింది. బాలికలకు గణితంలో సామర్థ్యం ఉండదనే సామాజిక అపోహను తొలగించాలని కూడా సూచించింది. కమిటీ ప్రతిపాదించిన ఈ కొత్త విధానం 2024 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు. ముందుగా ముసాయిదాపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటామని కేంద్ర విద్యాశాఖ అధికారులు తెలిపారు.
మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకే ఎక్కువ మార్కులు
కొత్త విద్యా సంవత్సరం నుంచి నిర్వహించే పరీక్షల్లో అత్యధిక మార్కులు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకే కేటాయించనున్నట్లు సీబీఎస్‌ఈ బోర్డు తెలిపింది. షార్ట్, లాంగ్ సమాధానాల తరహా ప్రశ్నలకు ఇంతకుముందున్న మార్కుల వెయిటేజీని తగ్గిస్తున్నట్లు గురువారం వెల్లడించింది. 2024లో జరగబోయే సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని బోర్డు స్పష్టం చేసింది.
Thanks for reading CBSE: Changes in CBSE Board Exams
No comments:
Post a Comment