Tomato: సెంచరీ కొట్టిన టమాటా.. మరింత ప్రియం కానుందా..?
పలు రాష్ట్రాల్లో కిలో టమాటా ధర రూ.100కు చేరుకోగా.. రానున్న రోజుల్లో ఇది మరింత ఎక్కువయ్యే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
నిత్యావసర సరకుల్లో ఒకటైన టమాటా ధరలకు (Tomato Price) రెక్కలొచ్చాయి. మొన్నటివరకు కిలో రూ.20, రూ.30గా ఉన్న ధర ఒక్కసారిగా ఎగబాకింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కిలో టమాటా ధర సెంచరీ (రూ.100) కొట్టింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇదే తీరు కనిపిస్తోంది. అయితే, టమాటాను అధికంగా సాగు చేసే ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం కొనసాగుతుండటం, సరఫరాలో అంతరాయమే ఇందుకు కారణాలుగా వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి.
దేశ రాజధానిలో కిలో టమాటా ధర రూ.80కి చేరింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో హోల్‌సేల్ ధర కిలో రూ.80 నుంచి రూ.90 వరకు పలుకుతోంది. రిటైల్‌లో మాత్రం రూ.100 దాటింది. కాన్పుర్‌కు టమాటాలు ఎక్కువగా బెంగళూరు నుంచి వస్తాయని.. రానున్న రోజుల్లో ఇవి కిలో రూ.150కి చేరుకోవచ్చని స్థానిక కూరగాయల వ్యాపారులు అంచనా వేశారు. అటు ముంబయిలోనూ రిటైల్ ధర రూ.100కు చేరుకుంది. హోల్‌సేల్‌లోనే కిలో ధర రూ.50 పలుకుతోంది. బెంగళూరులోనూ మొన్నటివరకు రూ.30గా ఉన్న వీటి ధర ఇప్పుడు రూ.100కి చేరింది. తెలంగాణలోనూ వర్షాలు మొదలు కావడంతో ఇక్కడ కూడా టమాటా ధరపై ప్రభావం పడింది. హైదరాబాద్‌లో నాణ్యమైన టమాటా ధర రూ.100 దాటింది.
దేశంలో టమాటా సాగు మధ్యప్రదేశ్, ఏపీ, కర్ణాటకతోపాటు తమిళనాడు, ఒడిశా, గుజరాత్‌లలో అధికంగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ఇటీవల ప్రతికూల వాతావరణం కనిపించింది. మొన్నటివరకు తీవ్ర వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరయ్యాయి. వర్షాభావ పరిస్థితులు కనిపించాయి. రుతుపవనాల రాకతో పరిస్థితులు మారినప్పటికీ.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల పంట దెబ్బ తింటోంది. ముఖ్యంగా టమాటా సాగు అధికంగా ఉండే కర్ణాటకలోని బెంగళూరు రూరల్, చిత్రదుర్గ, చిక్కబళ్లాపుర్, కోలార్, రామనగర జిల్లాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంది. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి.
వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖలోని ధరల నియంత్రణ విభాగం ప్రకారం.. కిలో టమాటా ధర సరాసరి రూ.25 నుంచి రూ.41 పెరుగుదల కనిపించింది. దీంతో రిటైల్ మార్కెట్లో దీని ధర రూ.80 నుంచి రూ.113 పలుకుతోంది. పంట నష్టంతోపాటు సరఫరాలో అంతరాయం వల్ల ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చాలాచోట్ల నాణ్యమైన టమాటా ధర ఇప్పటికే రూ.100కు చేరుకోగా.. రానున్న రోజుల్లో మరింత ప్రియం కానుందని అంచనా వేస్తున్నారు.
Thanks for reading Tomato: Will the price of tomato increase further?
No comments:
Post a Comment