వానాకాలం నొప్పులెందుకో..
కొందరికి వానాకాలంలో కీళ్ల నొప్పులు తలెత్తుతుంటాయి. దీనికి కారణమేంటన్నది కచ్చితంగా తెలియదు. పరిశోధనల్లోనూ స్పష్టంగా బయటపడలేదు. కొన్ని పరిశోధనలు అవునంటే, కొన్ని కాదంటున్నాయి. అయితే వాతావరణంలో మార్పులు కీళ్ల నొప్పులకు కారణం కావొచ్చని నిపుణులు భావిస్తుంటారు.
కొందరికి వానాకాలంలో కీళ్ల నొప్పులు తలెత్తుతుంటాయి. దీనికి కారణమేంటన్నది కచ్చితంగా తెలియదు. పరిశోధనల్లోనూ స్పష్టంగా బయటపడలేదు. కొన్ని పరిశోధనలు అవునంటే, కొన్ని కాదంటున్నాయి. అయితే వాతావరణంలో మార్పులు కీళ్ల నొప్పులకు కారణం కావొచ్చని నిపుణులు భావిస్తుంటారు. వానలు కురవటానికి ముందు వాతావరణంలో గాలి పీడనం తగ్గుతుంది. అప్పుడు శరీరం మీద గాలి పీడనం తక్కువగా పడుతుంది. ఫలితంగా కండరాలు, కండర బంధనాలు, కీళ్ల చుట్టూ ఉండే ఇతర కణజాలాలు వ్యాకోచిస్తాయి. దీంతో కీళ్ల మీద ఒత్తిడి పెరిగి నొప్పికి దారితీయొచ్చు. కీళ్లనొప్పులు, ఇతరత్రా దీర్ఘకాల నొప్పులతో బాధపడేవారు ఇలాంటి అసౌకర్యానికి గురవుతుంటారు. వాతావరణం సద్దుమణిగాక గాలి పీడనమూ సర్దుకుంటుంది. నొప్పులూ తగ్గుతాయి. ఇదొక్కటే కాదు, ఇతరత్రా అంశాలూ నొప్పులకు కారణం కావొచ్చు.
వానలు పడుతున్నప్పుడు బయటకు వెళ్లటం కుదరకపోవచ్చు. ఎక్కువసేపు ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటే కండరాలు, కీళ్లు బిగుసుకుపోయి నొప్పి పుట్టొచ్చు.
ఆకాశం మబ్బు పట్టినప్పుడు మూడ్ కూడా మారిపోవచ్చు. నొప్పుల వంటి ప్రతికూల అంశాల మీదికి దృష్టి మళ్లొచ్చు. నొప్పుల గురించి ఆలోచిస్తుంటే అవి మరింత ఎక్కువవుతాయి కూడా.
‘వానలు పడుతున్నాయి, ఇక నొప్పులు మొదలవుతాయి’ అనే భావన కూడా నొప్పులు తీవ్రం కావటానికి కారణం కావొచ్చు.
తగ్గించుకునేదెలా?
పరిశోధనల్లో రుజువైనా, కాకపోయినా వాతావరణం మారినప్పుడు కీళ్ల నొప్పులు వేధిస్తుంటే ఉపశమనం కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దీంతో కండరాలు, ఎముకలు బలోపేతమై కీళ్ల మీద ఒత్తిడి తగ్గుతుంది.
ఒకేదగ్గర కూర్చోవటం కన్నా అటూఇటూ నడవటం మేలు. ఆరుబయటకు వెళ్లటం కుదరకపోతే ఇంట్లోనైనా నడవాలి. ట్రెడ్‌మిల్ మీద నడిచినా మంచిదే.
బరువు పెరిగితే కీళ్లు, మోకీళ్లు, తుంటి మీద ఎక్కువ భారం పడుతుంది. నొప్పులూ పెరుగుతాయి. కాబట్టి అధిక బరువుంటే తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. మామూలు బరువుతో ఉంటే పెరగకుండా చూసుకోవాలి.
నొప్పులు తగ్గటానికి వేడి కాపడం తోడ్పడుతుంది. గోరు వెచ్చటి నీటిని సీసాలో పోసి, నొప్పి ఉన్నచోట అద్దుకోవచ్చు. తువ్వాలును వేడి నీటిలో ముంచి, పిండి అయినా అద్దొచ్చు. వీలుంటే హీటింగ్ ప్యాడ్స్ వాడుకోవచ్చు. గోరు వెచ్చటి నీటితో స్నానం చేసినా ఉపశమనం లభిస్తుంది.
ఒంట్లో నీటి శాతం తగ్గితే కీళ్ల కదలికలు సరిగా సాగవు. కాబట్టి వానాకాలమైనా తగినంత నీరు తాగాలి. రోజంగా అప్పుడప్పుడూ నీరు తాగటం మరీ మంచిది.
Thanks for reading Joint pains occur during rainy season. What is the reason for this?
No comments:
Post a Comment