Google: మీ వ్యక్తిగత సమాచారం ఎక్కడున్నా.. గూగుల్ వెతికి చూపిస్తుందట!
యూజర్ల సమ్మతి లేకుండానే కొన్ని వెబ్‌సైట్‌లు (Websites) వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుంటాయి. అలా పోగైన వివరాల గురించి అప్రమత్తం చేసేందుకు గూగుల్ (Google) ఓ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
నెట్టింట్లో (Internet) వినియోగదారుల గోప్యత, రక్షణ గురించి అప్రమత్తం చేసేందుకు గూగుల్ (Google) ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దాంతో యూజర్ తన సమ్మతి లేకుండానే ఆన్‌లైన్‌లో పోగుపడిన వ్యక్తిగత వివరాలను సులభంగా తొలగించవచ్చు. ప్రస్తుతం అమెరికాలోని నెటిజన్లకు మాత్రమే ఈ సౌలభ్యం అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో ఈ ఫీచర్‌ను అన్ని దేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. గతేడాది సెప్టెంబరులో గూగుల్ ‘రిజల్ట్ అబౌట్ యూ’ అనే డ్యాష్‌బోర్డును ఆవిష్కరించింది. మొబైల్, వెబ్‌సైట్లలో ఆ ఫీచర్ ప్రత్యక్షమైంది. ప్రస్తుతం అదే డ్యాష్‌బోర్డును మరింత అధునాతనంగా తీర్చిదిద్దింది. ‘రిజల్ట్ అబౌట్ యూ’లో యూజర్ల వ్యక్తిగత సమాచారం ఎక్కడైనా ఉందా అని తెలుసుకోవడానికి సంబంధిత వివరాలను సమర్పిస్తే అవి ఏయే వెబ్‌సైట్లలో ఉన్నాయో ఇట్టే తెలిసిపోతుంది. ఆ వెబ్‌పేజీలను సమీక్షించి.. అందులోని రహస్య సమాచారాన్ని తొలగించాలని రిక్వెస్ట్ చేసేందుకు వీలుంటుంది.
గత ఫీచర్‌లో యూజర్లు ఎంతో శ్రమించి వారి సమాచారం గురించి వెతుక్కోవాల్సి ఉండేది. రహస్య సమాచారం తొలగింపు అభ్యర్థనను మ్యానువల్‌గా పూర్తి చేయాల్సి ఉండేది. కానీ, ఇప్పుడు ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్‌తో ఆన్‌లైన్‌లో ఎక్కడైనా యూజర్ల చిరునామా, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ తదితర వివరాలు కనిపించగానే గూగుల్ అప్రమత్తం చేస్తుంది. కొన్ని ట్యాప్‌లతోనే అక్కడ ప్రత్యక్షమైన సమాచారం తొలగింపుపై నిర్ణయం తీసుకోవచ్చు. ఈ ఫీచర్ పుష్ నోటిఫికేషన్ కూడా పంపిస్తుంది. అయితే ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు అవసరమైన చోట ఉన్న సమాచారం కూడా తొలగిపోతుందేమోనని యూజర్లు ఆందోళన చెందడం సహజం. అందుకోసమే గూగుల్ ప్రతి అభ్యర్థన గురించి క్లుప్తంగా వెల్లడిస్తోంది. పెండింగ్, అప్రూవ్‌డ్, డినైడ్, అన్ డన్ వంటి ఐచ్ఛికాల ద్వారా ఆ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
ఈ కొత్త ఫీచర్‌ను వినియోగించి సమాచారం తొలగిస్తే మొత్తం వెబ్‌లో ఉన్న సమాచారం తొలగించినట్లు కాదని గూగుల్ స్పష్టం చేసింది. శోధనలో యూజర్ చేసిన పొరపాటు వల్ల కొన్ని వెబ్‌సైట్‌లలో వ్యక్తిగత సమాచారం అలాగే ఉండిపోయే ప్రమాదముందని పేర్కొంది. గూగుల్‌కు ఉన్న పరిమితుల కారణంగా అలా జరుగుతుందని వెల్లడించింది. ప్రభుత్వ, విద్యా సంస్థలకు సంబంధించిన కంటెంట్ విషయంలోనూ కొన్ని అడ్డంకులు ఉన్నాయని తెలిపింది.
కొందరు నెటిజన్ల ప్రమేయం, సమ్మతి లేకుండానే వారి అసలు పేరు, ఇంటి అడ్రస్, ఫోన్ నంబర్, ఆర్థిక స్థితి, వ్యక్తిగత సమాచారం ఆన్‌లైన్‌లోకి వెళ్తుంటుంది. ఈ చర్యను ‘డాక్సింగ్’ అని పిలుస్తారు. అలాంటి ముప్పును ఎదుర్కొనే వారికి ఈ కొత్త ఫీచర్ ఎంతో ఉపయుక్తం కానుంది. ప్రస్తుతం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలో ఇతర దేశాల్లోనూ ప్రవేశపెడతామని గూగుల్ వెల్లడించింది. యూజర్ ఫ్రెండ్లీగా ఉండేదుకు ఇంగ్లిష్ మాత్రమే కాకుండా స్థానిక భాషలనూ జోడించనుంది.
Thanks for reading Google: Wherever your personal information is.. Google will find it!
No comments:
Post a Comment