Ayodhya Ram Mandir: అయోధ్యలో బాలరాముడి దర్శనం, హారతి వేళలు ఇలా..
Ayodhya Ram Mandir: అయోధ్య ఆలయాన్ని మంగళవారం నుంచి దర్శించుకోవచ్చు. బాలరాముడి దర్శనం, హారతి వేళలు, పాస్‌లు ఎలా తీసుకోవాలి వంటి వివరాలను తెలుసుకోండి..!
అయోధ్య: కోట్లాది మంది భక్తుల కల సాకారమై అయోధ్య (Ayodhya Ram Mandir) భవ్యమందిరంలో బాలరాముడు కొలువుదీరాడు. దివ్యమైన ముహూర్తంలో అభిజిత్ లగ్నంలో ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రాణప్రతిష్ఠ ఉత్సవం వైభవంగా జరిగింది. రాజకీయ, సినీ, క్రీడా రంగ ప్రముఖులు, సాధువులు హాజరై ఈ మహోన్నత ఘట్టాన్ని కనులారా వీక్షించారు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా ఈ రోజు సామాన్య పౌరులు అయోధ్య దర్శనానికి రావొద్దని కోరారు. మంగళవారం (జనవరి 23) నుంచి బాలరాముడి దర్శన భాగ్యం అందరికీ కలగనుంది.
అయోధ్యలో బాలరాముడి దర్శనం, హారతి వేళల (Aarti, Darshan timings) వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తమ వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఆ వివరాలు ఇలా..
దర్శన వేళలు : ఉదయం 7 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు
జాగరణ హారతి : ఉదయం 6.30 గంటలకు (ఒక రోజు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది)
సంధ్యా హారతి: రాత్రి 7.30 గంటలకు (అందుబాటును బట్టి అదే రోజు బుక్ చేసుకునే సదుపాయం ఉంది)
రాముడి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డు లాంటి ఏదో ఒక గుర్తింపు పత్రం తీసుకెళ్లాలి. హారతి కార్యక్రమానికి ఉచితంగానే పాస్ ఇస్తారు కానీ అవి పరిమితంగా ఉంటాయి. ఆన్‌లైన్‌లో కానీ, ప్రత్యక్షంగా ఆలయం వద్దకానీ పాస్ తీసుకున్న వాళ్లకే హారతి సమయంలో అనుమతిస్తారు. పదేళ్లలోపు పిల్లలకు మాత్రమే మినహాయింపు ఉంది.
బాలరాముడి దర్శనం/హారతి పాస్‌లకు ఆన్‌లైన్ బుకింగ్ ఇలా..
- శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
- మీ మొబైల్ నంబరుతో సైన్ ఇన్ అయి ఓటీపీ ఎంటర్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ నమోదు పూర్తవుతుంది.
- ఒకసారి లాగిన్ అయిన తర్వాత.. ‘మై ప్రొఫైల్’ సెక్షన్‌లోకి వెళ్లి మీ గుర్తింపు వివరాలు, చిరునామా వంటివి ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత హారతి/దర్శనం టైమ్ స్లాట్లను ఎంచుకుని.. పాస్ కోసం బుక్ చేసుకోవాలి.
- ఆలయ ప్రాంగణంలోకి వెళ్లిన తర్వాత కౌంటర్‌లో మీ పాస్‌లు తీసుకుని దర్శనానికి వెళ్లొచ్చు.
Thanks for reading Ayodhya Ram Mandir:Aarti & Darshan timings...
No comments:
Post a Comment