Anna Canteen: పేదోడికి మళ్లీ పట్టెడన్నం.. ‘అన్న క్యాంటీన్’ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఏపీలో ‘అన్న క్యాంటీన్’ (Anna Canteen) మళ్లీ ప్రారంభమైంది. రాష్ట్రంలో మొదటిగా కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు (Chandrababu) దీన్ని ప్రారంభించారు.
గుడివాడ: ఏపీలో ‘అన్న క్యాంటీన్’ (Anna Canteen) మళ్లీ ప్రారంభమైంది. రాష్ట్రంలో మొదటిగా కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు (Chandrababu) దీన్ని ప్రారంభించారు. అనంతరం పలువురికి సీఎం స్వయంగా భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సీఎం దంపతులు, పలువురు ప్రజాప్రతినిధులు అక్కడే భోజనం చేశారు. పేదలతో చంద్రబాబు మాట్లాడి వారిస సమస్యలను తెలుసుకున్నారు. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా క్యాంటీన్లు ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి రానున్నాయి. మిగతా ప్రాంతాల్లో శుక్రవారం మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు.
అధికారంలోకి వచ్చాక తిరిగి అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎన్డీయే ప్రభుత్వం తాజాగా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. పేదోడికి మళ్లీ పట్టెడన్నం అందిస్తోంది. 203 క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించాలని మొదట భావించినా భవన నిర్మాణ పనులు పూర్తి కానందున తొలి విడతలో 100 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. రెండు, మూడు విడతల్లో మిగిలిన క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ క్యాంటీన్లలో మూడు పూటలా కలిపి రోజూ 1.05 లక్షల మంది పేదలకు ఆహారం సరఫరా చేయనున్నారు. ఉదయం 35 వేల మందికి అల్పాహారం, మధ్యాహ్నం 35 వేలు, రాత్రి మరో 35 వేల మందికి ఆహారం అందించనున్నారు. ఒక్కొక్కరి నుంచి పూటకు రూ.5 చొప్పున నామమాత్రపు ధర వసూలు చేయనున్నారు.
క్యాంటీన్లలో అందించే ఆహారం ఇలా..
సోమవారం నుంచి శనివారం వరకు రోజూ ఉదయం అల్పాహారం కింద ఇడ్లీ-చట్నీ/పొడి, సాంబార్ అందిస్తారు.
ఇడ్లీతోపాటు సోమవారం, గురువారం పూరీ, కుర్మా, మంగళవారం, శుక్రవారం ఉప్మా, చట్నీ, బుధవారం, శనివారం పొంగల్-చట్నీ, మిక్చర్ అందుబాటులో ఉంటాయి. ఇడ్లీ వద్దనుకునే వారు ప్రత్యామ్నాయంగా పూరీ, ఉప్మా, పొంగల్ తీసుకోవచ్చు.
సోమవారం నుంచి శనివారం వరకు రోజూ మధ్యాహ్నం, రాత్రి అన్నంతోపాటు కూర, పప్పు/సాంబారు, పెరుగు, పచ్చడి అందిస్తారు.
తాగునీటి సౌకర్యం, ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఆదివారం క్యాంటీన్లకు సెలవు. వారానికోసారి ప్రత్యేక ఆహారం అందిస్తారు.
ఆహార పరిమాణం: ఇడ్లీ/పూరి 3, ఉప్మా, పొంగల్ 250 గ్రాములు, అన్నం 400 గ్రాములు, చట్నీ/పొడి 15 గ్రాములు, పప్పు 120 గ్రాములు, సాంబార్ 150 గ్రాములు, మిక్చర్ 25 గ్రాములు, కూర 100 గ్రాములు, పచ్చడి 15 గ్రాములు, పెరుగు 75 గ్రాములు ఇస్తారు.
క్యాంటీన్లు తెరిచి ఉంచే సమయం: అల్పాహారం: ఉదయం 7.30 నుంచి 10, మధ్యాహ్న భోజనం: 12.30 నుంచి 3, రాత్రి 7.30 నుంచి 9 గంటలు.
Thanks for reading Anna Canteen: CM Chandrababu started 'Anna Canteen'
No comments:
Post a Comment