వచ్చే ఏడాది నుంచి 6 బడుల విధానం రద్దు
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అనేక సంస్కరణలు తీసుకురాబోతోంది.
3, 4, 5 తరగతుల విలీనం నిలిపివేత
ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఉండేలా చర్యలు
బదిలీలు, పదోన్నతులకు వేర్వేరుగా చట్టాలు
హేతుబద్ధీకరణ ఉత్తర్వులు-117 ఎత్తివేత!
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అనేక సంస్కరణలు తీసుకురాబోతోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఆరు రకాల బడుల విధానాన్ని రద్దు చేసి, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విధానాన్ని తీసుకురావాలని భావిస్తోంది. దీనిపై పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఉన్నత పాఠశాల ఐదు కిలోమీటర్ల కంటే దూరం ఉంటే అక్కడ మాత్రమే ప్రాథమికోన్నత బడిని ఏర్పాటుచేయనుంది. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు-117ను రద్దు చేసి, బడులను పటిష్ఠం చేయడంపై దృష్టిపెట్టింది. ఉపాధ్యాయుల సర్దుబాటు, తరగతుల విలీనం వంటి అసంబద్ధ విధానాలతో వైకాపా ప్రభుత్వం ప్రాథమిక విద్యలో విధ్వంసం సృష్టించింది. దీన్ని చక్కదిద్దడానికి ఉన్నత, ప్రాథమికోన్నత బడుల్లో విలీనం చేసిన 3, 4, 5 తరగతులను వెనక్కి తీసుకురానున్నారు. వీటిని ఆయా ప్రాథమిక పాఠశాలల్లోనే నిర్వహిస్తారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా పంచాయతీకి ఒక మోడల్ ప్రాథమిక పాఠశాలను తయారు చేయనున్నారు. ఇక్కడ తరగతికి ఒక టీచర్ చొప్పున నియమించాలని భావిస్తున్నారు.
ఆ ఉత్తర్వుల రద్దుకు చర్యలు
ఎన్నికల ముందు ఎన్డీయే ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ఉత్తర్వులను రద్దు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ రద్దు అమల్లోకి వచ్చేలా కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వంలో 4,943 ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను ఉన్నత, ప్రాథమికోన్నత బడులకు తరలించారు. ఇది దాదాపు 2.43 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం చూపింది. వీరిలో ఐదో తరగతి వారు వచ్చే ఏడాదికి ఆరో తరగతిలోకి వెళ్లిపోతే, మిగతా 4, 5 తరగతుల వారిని గ్రామంలోని ప్రాథమిక బడిలో చేరుస్తారు. ఒకవేళ పిల్లలు అక్కడే చదువుకుంటామంటే అక్కడే ఉంచుతారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టులను సృష్టించి, బదిలీలు నిర్వహిస్తారు. వచ్చే విద్యా సంవత్సరంలోపు బదిలీలు, పదోన్నతులు కల్పించి, ఆ తర్వాత డీఎస్సీలో ఎంపికైన వారికి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. అంగన్‌వాడీల్లో పూర్వ ప్రాథమిక విద్యను నిర్వహిస్తారు.
పదోన్నతులకు చట్టం..
ఉపాధ్యాయుల బదిలీలతోపాటు పదోన్నతులకు ప్రత్యేకంగా చట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం గుజరాత్ సహా మరికొన్ని రాష్ట్రాల్లోని చట్టాలను అధ్యయనం చేయనున్నారు. ఏటా నిర్దేశిత సమయంలో పదోన్నతులు ఇచ్చేలా ఈ చట్టం తీసుకురాబోతున్నారు. పదోన్నతులకు షెడ్యూల్ ప్రకటించి, అర్హతల ఆధారంగా ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. రెగ్యులర్ పదోన్నతులతో పాటు కొన్ని పోస్టులకు పరీక్ష పెట్టి పదోన్నతులు కల్పిస్తే ఎలా ఉంటుందనే దానిపైనా కసరత్తు చేస్తున్నారు. ఇది అమల్లోకి వస్తే పదోన్నతుల్లో పారదర్శకతకు అవకాశం ఉంటుంది.
బదిలీలకు మరో చట్టం..
ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన చట్టం తుది దశకు చేరింది. ముసాయిదా దాదాపు సిద్ధమైంది. ఏటా వేసవి సెలవుల్లో బదిలీలు నిర్వహించనున్నారు. హేతుబద్ధీకరణ, పదోన్నతుల కల్పన తర్వాత బదిలీలు నిర్వహించనున్నారు. కొద్ది మార్పులతో కర్ణాటక విధానాన్ని అమలు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. దీని ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు సర్వీసు ఆధారంగా ఒక్కో జోన్ మారుతూ ఉంటారు. తన సర్వీసు కాలంలో అన్ని జోన్‌లలోనూ పనిచేస్తారు. ఈ చట్టం అమల్లోకి వస్తే రాజకీయ సిఫార్సు బదిలీలు, డబ్బులు తీసుకొని చేసే అక్రమ బదిలీలు ఉండవు.
Thanks for reading AP news:6 school system will be canceled from next year
No comments:
Post a Comment