Joint Entrance Examination JEE (Main ) - 2025
JEE Main 2025: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-2025
దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో బీటెక్/ బీఆర్క్ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్-2025 తొలి విడత పరీక్షలు జనవరి 22 నుంచి, రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు మెయిన్ ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను జాతీయ పరీక్షల సంస్థ (NTA) అక్టోబరు 28న ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి 40 రోజులు ఆలస్యంగా వెల్లడించింది. గతంలో జనవరి 24వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవగా... ఈసారి రెండు రోజులు ముందుకు జరిపారు. గతానికి భిన్నంగా ఈసారి పరీక్షల ఫలితాల తేదీలను కూడా ప్రకటించడం విశేషం. జేఈఈ మెయిన్ పేపర్-1, 2లకు కలిపి గత సంవత్సరం 12.30 లక్షల మంది దరఖాస్తు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది దరఖాస్తు చేస్తున్నారు. ఈసారి సిలబస్‌లో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది.
ప్రకటన వివరాలు:
* జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-2025
అర్హత: అభ్యర్థులకు వయోపరిమితి లేదు. 2023, 2024లో 12వ తరగతి/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు లేదా 2025లో వయస్సుతో సంబంధం లేకుండా 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు జేఈఈ (మెయిన్)-2025 పరీక్షకు హాజరు కావచ్చు.
జేఈఈ మెయిన్ ఎందుకంటే?
* దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో బీటెక్ సీట్లను జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ఐఐటీల్లో బీటెక్‌లో చేరాలంటే మెయిన్‌లో ఉత్తీర్ణులైన వారు జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయాలి. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించి అర్హత పొందిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అర్హత ఉంటుంది. జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగా కొన్ని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు యాజమాన్య కోటా సీట్లను కేటాయిస్తాయి. దేశవ్యాప్తంగా 31 ఎన్‌ఐటీల్లో 24 వేలకుపైగా, ట్రిపుల్‌ఐటీల్లో 8,500లకుపైగా బీటెక్ సీట్లున్నాయి. ఎన్‌ఐటీల్లో 50 శాతం సీట్లు సొంత రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు.
* బీఆర్క్, బీ ప్లానింగ్‌లో ప్రవేశించేందుకు పేపర్-2, బీటెక్ సీట్ల భర్తీకి పేపర్-1 పరీక్ష జరుపుతారు. బీఆర్క్‌కు 50 వేల లోపే దరఖాస్తులు వస్తాయి. దాన్ని సాధారణంగా తొలి రోజు నిర్వహిస్తారు. ఆ తర్వాత నుంచి పేపర్-1 జరుపుతారు.
* గత రెండేళ్ల మాదిరిగానే ప్రశ్నపత్రాల్లో రెండు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్-బిలో ఈసారి 5 ప్రశ్నలు మాత్రమే ఇస్తారు. గత మూడేళ్ల మాదిరిగా ఈసారి ఛాయిస్ ఉండదు. రెండు సెక్షన్లలో మైనస్ మార్కులుంటాయి. సరైన సమాధానానికి 4 మార్కులు, తప్పు అయితే మైనస్ 1 ఇస్తారు.
* ఎన్‌టీఏ స్కోర్ కోసం తొలుత గణితం, ఆ తర్వాత భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ ఇద్దరు లేదా అంతకు మించి విద్యార్థులకు సమాన స్కోర్ వస్తే తక్కువ మైనస్ మార్కులను చూస్తారు.
* ఈ పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తారు.
* పరీక్షలను తెలుగు, ఆంగ్లం సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆంగ్లంతో పాటు అభ్యర్థులు కోరుకున్న ప్రాంతీయ భాషలో కూడా ఇస్తారు. పేపర్-1 300, పేపర్-2 400 మార్కులకు ఉంటుంది.
* దరఖాస్తులో మొబైల్ నంబరు, ఈ-మెయిల్ చిరునామాను విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులకు సంబంధించినది ఇవ్వాలి. ఏదైనా సమాచారం ఉంటే వాటికి పంపుతామని ఎన్‌టీఏ తెలిపింది.
ఛాయిస్ ఎత్తివేత
జేఈఈ మెయిన్ పరీక్షల్లో గత మూడేళ్ల నుంచి సెక్షన్ బీలో కొనసాగుతున్న ఛాయిస్‌ను ఎత్తివేశారు. జేఈఈ మెయిన్ ర్యాంకుల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 32 ఎన్‌ఐటీల్లో బీటెక్ సీట్లు భర్తీ చేస్తారు. జేఈఈ మెయిన్‌లో 75 ప్రశ్నలు...ఒక్కో దానికి 4 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు ప్రశ్నపత్రం ఇచ్చేవారు. గణితం, భౌతిక, రసాయనశాస్త్రాల నుంచి 25 చొప్పున ప్రశ్నలు ఉండేవి. కొవిడ్ నేపథ్యంలో విద్యార్థులకు వెసులుబాటు ఇచ్చేందుకు ప్రతి సబ్జెక్టులో ఛాయిస్ ప్రశ్నలు ఇచ్చారు. జేఈఈ మెయిన్ 2021 నుంచి ఒక్కో సబ్జెక్టులో 30 చొప్పున మొత్తం 90 ప్రశ్నలు ఇస్తూ వచ్చారు. ప్రతి సబ్జెక్టులో ఏ, బీ సెక్షన్లు ఉండేవి. సెక్షన్ ఏలో 20 ప్రశ్నలకు మొత్తం జవాబులు రాయాలి. సెక్షన్ బీలో 10 ఇచ్చి అయిదు ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేలా ఛాయిస్ ఇస్తున్నారు. ఈసారి నుంచి ఆ ఛాయిస్‌ను విరమించుకుంటున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు…
తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, జగిత్యాల.
ఏపీ: అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, సూరంపాలెం, మచిలీపట్నం, నంద్యాల, తాడేపల్లిగూడెం.
ఇదీ పరీక్షల షెడ్యూల్...
తొలి విడత
ఆన్‌లైన్ దరఖాస్తులు: అక్టోబర్ 28 నుంచి నవంబరు 22 వరకు.
హాల్‌టికెట్లు: పరీక్షకు 3రోజుల ముందు.
పరీక్షలు: జనవరి 22- జనవరి 31 మధ్య.
ఫలితాలు: ఫిబ్రవరి 12 నాటికి.
రెండో విడత
ఆన్‌లైన్ దరఖాస్తులు: జనవరి 31- ఫిబ్రవరి 24 వరకు.
హాల్‌టికెట్లు: పరీక్ష తేదీకి 3 రోజుల ముందు.
పరీక్షలు: ఏప్రిల్ 1- 8 మధ్య.
ఫలితాలు: ఏప్రిల్ 17 నాటికి.
* ఏమైనా సమస్యలు ఉంటే 011 40759000 నంబరుకు ఫోన్‌చేయవచ్చు.
Apply Online | Click Here |
Download Session 1 Notice | Click Here |
Official Website | Click Here |
Notification | Click Here |
Thanks for reading Joint Entrance Examination JEE (Main ) - 2025
No comments:
Post a Comment