AP Cabinet meeting Highlights @ 19.12.24

ముగిసిన కేబినెట్ భేటీ - కీలక నిర్ణయాలకు ఆమోదం - AP CABINET MEETING HIGHLIGHTS
సీఅర్డీఏ 42, 43 సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం - అమరావతిలో రూ.24,276 కోట్ల విలువైన పనులకు పాలనపరమైన అనుమతులు
అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ముగిసింది. మొత్తం 21 అంశాలతో కూడిన అజెండాపై కేబినెట్‌లో చర్చించారు. ఇందులో భాగంగా మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా సీఅర్డీఏ 42, 43 సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అమరావతిలో 24 వేల 276 కోట్ల రూపాయల విలువైన పనులకు పాలనపరమైన అనుమతులిచ్చింది. మంగళగిరి ఎయిమ్స్‌కు అదనంగా 10 ఎకరాల భూమి కేటాయించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఇచ్చే అంశం సహా, మధ్యాహ్న భోజనానికి సంబంధించి నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ధాన్యం కొనుగోలు కోసం మార్క్‌ఫెడ్ ద్వారా వెయ్యి కోట్ల రుణం మంజూరుకు ఆమోదం దక్కింది. వెయ్యి కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధాని నిర్మాణానికి హడ్కో ద్వారా 11 వేల కోట్ల రుణం, కేఎఫ్‌డబ్ల్యూ ఆర్థిక సంస్థ ద్వారా 5 వేల కోట్ల రుణం పొందడానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
హంద్రీనీవా సుజల స్రవంతి రెండో దశ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 10 జిల్లాల్లోని వరద ప్రభావిత బాధితులకు రుణాల రీ షెడ్యూల్ కోసం స్టాంప్ డ్యూటీ మినహాయింపు ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాల్వ పనులకు మళ్లీ టెండర్లు పిలిచేందుకు ఆమోదముద్ర వేసింది. అయితే మున్సిపాలిటీ చట్టం 1965లో సవరణలకు సంబంధించిన ప్రతిపాదనలను మంత్రివర్గం తిరస్కరించినట్లు తెలిసింది.
Thanks for reading AP Cabinet meeting Highlights @ 19.12.24
No comments:
Post a Comment