Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, January 16, 2025

IAF Agniveer Vayu: Agniveer Vayu Jobs in Indian Air Force


 IAF Agniveer Vayu: Agniveer Vayu Jobs in Indian Air Force

Agniveer Vayu: స్వాగతిస్తోంది వాయుసేన!

అగ్నివీర్‌ వాయు పోస్టులు 

    భారతీయ వాయుసేన అగ్నిపథ్‌ పథకంలో భాగంగా అగ్నివీర్‌వాయు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇంటర్మీడియట్, ఒకేషనల్, డిప్లొమా కోర్సుల వారు అర్హులు. మహిళలకూ అవకాశముంది. పరీక్ష, ఫిజికల్, మెడికల్‌ టెస్టులతో నియామకాలుంటాయి. ఎంపికైనవారు నాలుగేళ్లు సేవలందిస్తారు. అనంతరం వీరిలో 25 శాతం మందిని శాశ్వత ఉద్యోగానికి అవకాశమిస్తారు. మిగిలినవారు ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగాలు పొందడం కష్టమేమీ కాదు. అందరికీ సర్టిఫికెట్, ఆర్థిక ప్రోత్సాహకాలు అందుతాయి.

    జాతీయ స్థాయి నియామకాల్లో ఎక్కువ కొలువులు రక్షణ రంగంలోనే భర్తీ అవుతున్నాయి. యువత సైతం ఈ ఉద్యోగాలకు ప్రాధాన్యమిస్తోంది. అందులోనూ త్రివిధ దళాల్లో ఎయిర్‌ ఫోర్స్‌కు ఎక్కువ మంది పోటీపడుతున్నారు. వాయుసేనలో ప్రాథమిక స్థాయి ఉద్యోగాలు ఆశించేవారు అగ్నివీర్‌వాయు ఖాళీలకు పోటీ పడాలి. దాదాపు ఏటా రెండు సార్లు ఈ ప్రకటన వెలువడుతుంది. ప్రస్తుత నోటిఫికేషన్‌ 2026(1) ఇన్‌టేక్‌కు చెందింది. ఇందులో సైన్స్, నాన్‌ సైన్స్‌ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. సైన్స్‌ విభాగంలో దరఖాస్తు చేసుకున్నవారు కావాలనుకుంటే నాన్‌ సైన్స్‌ ఖాళీలకూ పోటీ పడవచ్చు. ఇందుకోసం ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తారు.  

ఎంపిక 

    మూడు దశల్లో నిర్వహించే వివిధ పరీక్షలతో నియామకాలు చేపడతారు. 

ఫేజ్‌-1: ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో వస్తాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. సైన్స్‌ సబ్జెక్టులకు పరీక్ష వ్యవధి ఒక గంట. ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. నాన్‌ సైన్స్‌ వారికి పరీక్ష వ్యవధి 45 నిమిషాలు. ఇంగ్లిష్, రీజనింగ్, జనరల్‌ అవేర్‌నెస్‌ అంశాల్లో ప్రశ్నలుంటాయి. సైన్స్, నాన్‌ సైన్స్‌ రెండిటికీ దరఖాస్తు చేసుకున్నవారికి పరీక్ష 85 నిమిషాలు. ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్, రీజనింగ్, జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. అన్ని పరీక్షల్లోనూ ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. తప్పు సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారు. అన్ని ప్రశ్నపత్రాల్లోనూ ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్‌ ప్రశ్నలు సీబీఎస్‌ఈ 10+2 సిలబస్‌ నుంచే వస్తాయి. ఎంచుకున్న పరీక్షను బట్టి ఇంగ్లిష్‌ 20, ఫిజిక్స్‌ 25, మ్యాథ్స్‌ 25, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ 30 ప్రశ్నలు ఉంటాయి. 

ఫేజ్‌-2లో...: ఫేజ్‌-1 ప్రతిభావంతులకే ఫేజ్‌-2లో అవకాశం ఉంటుంది. ఎంపికైనవారు నిర్దేశిత సెలక్షన్‌ కేంద్రాలకు ప్రవేశపత్రాలతోపాటు అవసరమైన సర్టిఫికెట్లు, వాటి నకళ్లు, ఫొటోలు, సామగ్రిని తీసుకెళ్లాలి. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షల్లో భాగంగా 1.6 కి.మీ. దూరాన్ని పురుషులు 7, మహిళలు 8 నిమిషాల్లో చేరుకోవాలి. అలాగే పురుషులు ఒక్కోటీ నిమిషం వ్యవధిలో.. 10 బస్కీలు, 10 గుంజీలు, 20 స్క్వాట్స్‌ పూర్తిచేయాలి. మహిళలు 90 సెకన్లలో 10 గుంజీలు, నిమిషంలో 15 స్క్వాట్స్‌ చేయగలగాలి. వీటన్నింటిలోనూ అర్హత సాధించినవారికి అడాప్టబిలిటీ టెస్టు ఆబ్జెక్టివ్‌ తరహాలో నిర్వహిస్తారు. దీనిద్వారా అభ్యర్థి వాయుసేన ఉద్యోగం, వాతావరణానికి అలవాటు పడగలడా లేదా పరిశీలిస్తారు. 

ఫేజ్‌ 3: అడాప్టబిలిటీ టెస్టులో ఉత్తీర్ణత సాధించినవారికి వైద్య పరీక్షలు నిర్వహించి, శిక్షణకు ఎంపిక చేస్తారు.

ప్రోత్సాహకాలు 

    అగ్నివీర్‌వాయులో అవకాశం వచ్చినవారికి తొలి ఏడాది ప్రతి నెలా రూ.30,000 చెల్లిస్తారు. రెండో సంవత్సరం నెలకు రూ.33,000 వేతనం ఉంటుంది. మూడో ఏడాది రూ.36,500 అందుతుంది. నాలుగో సంవత్సరం రూ.40,000 ప్రతి నెలా పొందుతారు. ప్రతి నెలా అందుకునే మొత్తంలో 30 శాతం కార్పస్‌ ఫండ్‌కి జమ చేస్తారు. మొత్తం నాలుగేళ్ల వ్యవధికి సేవానిధిలో రూ.5.02 లక్షలు అగ్నివీరుని నుంచి జమవుతుంది. అంతే మొత్తాన్ని ప్రభుత్వమూ జత చేస్తుంది. రెండూ కలిపి రూ.10.04 లక్షలవుతాయి. దీనికి వడ్డీని కలిపి, అగ్నివీర్‌వాయుకి అందిస్తారు. నాలుగేళ్ల సేవలకు గానూ పనిచేసిన విభాగాన్ని అనుసరించి అగ్నివీర్‌వాయు స్కిల్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు. 

శాశ్వత ఉద్యోగంలోకి...

    నాలుగేళ్ల వ్యవధి పూర్తిచేసుకున్న అగ్నివీర్‌వాయు ఒక్కో బ్యాచ్‌ నుంచి గరిష్ఠంగా 25 శాతం మందిని ఎయిర్‌ఫోర్స్‌లో శాశ్వత ఉద్యోగానికి ఎంపికచేస్తారు. ఇందుకోసం నాలుగేళ్ల వ్యవధిలో చూపిన ప్రతిభ, సంస్థ అవసరాలు ప్రామాణికంగా తీసుకుంటారు. ఇలా సైన్స్‌ విభాగంలో అవకాశం వచ్చినవారు గ్రూప్‌-ఎక్స్‌ (ఫిట్టర్‌) విధులు నిర్వర్తిస్తారు. వీరికి మొదటి నెల నుంచే రూ.33,100 మూలవేతనం అందుతుంది. నాన్‌ సైన్స్‌ అభ్యర్థులు గ్రూప్‌ వై(టెక్నీషియన్‌) సేవలు అందిస్తారు. వీరికి రూ.26,900 మూలవేతనం చెల్లిస్తారు. ఈ రెండు ట్రేడులవారికీ డీఏ, హెచ్‌ఆర్‌ఎ, ఇతర అలవెన్సులు ఉంటాయి. 

    ఎక్స్‌ ట్రేడ్‌ల్లోనివారు మొదటి నెల నుంచే రూ.యాభై వేలకు పైగా, వై ట్రేడుల్లో చేరినవాళ్లు సుమారు రూ.45,000 వేతనం అందుకోవచ్చు. విధుల్లో కొనసాగినవారు భవిష్యత్తులో ప్రమోషన్ల ద్వారా మాస్టర్‌ వారెంట్‌ ఆఫీసర్‌ (ఎండబ్ల్యువో) స్థాయికి చేరుకోవచ్చు. అలాగే సర్వీసులో కొనసాగుతూ కొన్ని పరీక్షల్లో అర్హతలు సాధించినవారు కమిషన్డ్‌ ఆఫీసర్లూ కావచ్చు. ఉద్యోగం చేస్తూనే నిర్ణీత వ్యవధితో ఉన్నత విద్య కొనసాగించడానికీ అనుమతిస్తారు. పదవీ విరమణ వయసు వరకు సేవలు అందించవచ్చు. అనంతరం పింఛను, ఇతర సౌకర్యాలు దక్కుతాయి.

బయటకొస్తే..

    నాలుగేళ్ల విధులు అనంతరం శాశ్వత ఉద్యోగంలో అవకాశం రానివారికి సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌/ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ నిమిత్తం బ్యాంకుల నుంచి రుణాలు మంజూరయ్యేలా ఏర్పాట్లు చేస్తారు. కార్పొరేట్‌ సంస్థల్లోనూ అవకాశాలు ఉంటాయి. పలు సంస్థలు నియామకాల్లో వీరికి ప్రాధాన్యమిస్తామని ఇప్పటికే ప్రకటించాయి. నాలుగేళ్ల సర్వీస్‌ మధ్యలో కావాలంటే వైదొలగొచ్చు. అలాంటి సందర్భంలో వేతనం నుంచి జమ అయిన మొత్తాన్నే అగ్నివీర్‌వాయుకి అందిస్తారు. ప్రభుత్వ ఆర్థిక ప్రోత్సాహం దక్కదు. 

విజయం కోసం 

    అగ్నివీర్‌వాయు వెబ్‌సైట్‌లో సబ్జెక్టుల వారీ సిలబస్‌ వివరాలు శ్రద్ధగా గమనించాలి. అందులోనే మాదిరి ప్రశ్నలూ, మాక్‌ టెస్టూ అందుబాటులో ఉంచారు. వీటన్నిటినీ సమగ్రంగా పరిశీలిస్తే.. పరీక్ష స్వరూపం, ప్రశ్నల తీరు, చదవాల్సిన అంశాలు, వాటి స్థాయి తెలుస్తుంది.  

* ఇంగ్లిష్, ఫిజిక్స్, మ్యాథ్స్‌ల్లో ప్రశ్నలు ఇంటర్మీడియట్‌ స్థాయిలోనే ఉంటాయి. అందువల్ల ఈ సబ్జెక్టుల పాఠ్య పుస్తకాలు బాగా చదువుకోవాలి. 

* రీజనింగ్‌ ప్రశ్నలకు హైస్కూల్‌ మాథ్స్‌ పుస్తకాల్లోని జనరల్‌ అంశాలు బాగా చదివితే సరిపోతుంది. 

* జనరల్‌ అవేర్‌నెస్‌ కోసం హైస్కూల్‌ సైన్స్, సోషల్‌ పుస్తకాల్లోని ముఖ్యాంశాలతోపాటు, వర్తమాన సంఘటనలను అనుసరించాలి. 

* పాఠ్యపుస్తకాలు బాగా చదివి, వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేసినవారు పరీక్షను సులువుగా ఎదుర్కోగలరు. 

* మ్యాథ్స్, ఫిజిక్స్‌ విభాగాల్లో ప్రశ్నలకు ఈఏపీసెట్‌ స్థాయిలో సన్నద్ధమైతే సరిపోతుంది. 

* ఇంటర్మీడియట్‌ ఇంగ్లిష్‌ పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలపై దృష్టిపెట్టి, వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే ఆ విభాగంలోనూ మెరుగైన స్కోరు పొందవచ్చు. 

* రీజనింగ్‌ విభాగంలో ప్రశ్నలు మరీ లోతుగా ఉండవు. గణితంలోని ప్రాథమికాంశాలపై పట్టు, సాధారణ తర్కం ఉపయోగించగలిగితే సులువుగానే ఎక్కువ సమాధానాలు గుర్తించగలరు. 

* జనరల్‌ అవేర్‌నెస్‌ ప్రశ్నలకు.. ఇటీవలి కాలంలో రక్షణ విభాగంలో చోటుచేసుకున్న కీలక పరిణామాలకు ప్రాధాన్యమివ్వాలి. క్రీడలు, అవార్డులు, విజేతలు, పుస్తకాలు, రచయితలు, నియామకాలు, ఎన్నికలు... తాజా పరిణామాలపై దృష్టి సారిస్తే దాదాపు అన్ని ప్రశ్నలకూ సరైన జవాబులు గుర్తించవచ్చు.   

అర్హతలు, గడువు తేదీ 

సైన్స్‌ విభాగానికి: మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్‌ సబ్జెక్టులు ఇంటర్మీడియట్‌లో చదవాలి. 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. లేదా నిర్దేశిత బ్రాంచీల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సు 50 శాతం మార్కులతో పూర్తిచేయాలి. లేదా ఫిజిక్స్, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో రెండేళ్ల వొకేషనల్‌ కోర్సులో 50 శాతం మార్కులు పొందాలి.  

నాన్‌ సైన్స్‌ పోస్టులకు: ఏదైనా గ్రూపుతో ఇంటర్‌లో 50 శాతం మార్కులు పొందినవారు అర్హులు. లేదా రెండేళ్ల ఒకేషనల్‌ కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. 

    సైన్స్, నాన్‌ సైన్స్‌ రెండు రకాల పోస్టులకూ.. పది/ఇంటర్‌/ఒకేషనల్‌/డిప్లొమా ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులు తప్పనిసరి. 

ఎత్తు: 152 సెం.మీ. ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు అవసరం. ఊపిరి పీల్చినప్పుడు, వదిలినప్పుడు 5 సెం.మీ. వ్యత్యాసం తప్పనిసరి. 

వయసు: జనవరి 1, 2005 - జులై 1, 2008 మధ్య జన్మించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు: జనవరి 7 నుంచి 27 వరకు.

పరీక్ష ఫీజు: రూ.550.

ముఖ్య తేదీలు… 

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 07-01-2025.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువు: 27-01-2025.

ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం: 22-03-2025.

ఎంపిక జాబితా వెల్లడి: 14-11-2025.

👉 Indian Airforce Agniveer Vayu

         Recruitment Notification Click Here

👉Official Website Click Here

👉Online Application Click Here

Thanks for reading IAF Agniveer Vayu: Agniveer Vayu Jobs in Indian Air Force

No comments:

Post a Comment