Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, October 1, 2019

Ten years before the first Indian War of Independence in 1857, Uyyalawada Narasimhareddy was a Telugu hero who revolted against the British.


1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే,  బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి....జీవిత విశేషాలు


ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని (ఫిబ్రవరి 22) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో అధికారకంగా జరపనున్న సందర్భంగా ఆయన జీవిత విశేషాలు...
Ten years before the first Indian War of Independence in 1857, Udayalawada Narasimhareddi was a Telugu hero who revolted against the British.

అతడు ఓ కొదమసింహం ..
ఆతడి పేరులోనే ఆ రాజసం ఉంది..
తీరులోనూ అంతే... అందుకే ఆ సీమలో జనపదంలో, జనపథంలో ఆతడు కొలువైనాడు.అతడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. తెలుగువారి స్వాతంత్య్రకాంక్ష ‘ కాక ’ బ్రిటిష్‌వారికి తెలిసొచ్చేలా తెగబడ్డ రాయలసీమ సింహం అతడు. ఆత్మాభిమానాన్ని అవమానిస్తే గుండెలు తీశాడు. జనంపై విరుచుకుపడితే ప్రాణాలీ తీసేశాడు. బెదరిస్తే తరిమికొట్టాడు. తుదముట్టిస్తామంటే ఆ పని తనే చేశాడు. చివరకు జనం కోసమే ప్రాణాలొదిలాడు. అందుకే అతడు జనం మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. సీమసింహంగా చరిత్రలో నిలిచిపోయాడు.
 రేనాటిగడ్డ ముద్దుబిడ్డ.. సీమ పౌరుషానికి ప్రతిరూపం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ‘సైసైరా నరసింహారెడ్డి, నీపేరే బంగారు కడ్డీ’ అన్న జానపద గేయం వినగానే సీమవాసుల ఒళ్లు ఒక్కసారిగా పులకరిస్తుంది. నరసింహారెడ్డి పేరు వినగానే సీమలోని ప్రతి మగవాడి కుడిచేయి పౌరుషంతో మీసంపైకి చేరి మెలితిప్పుతుంది.. ఆనక తొడపై గట్టిగా చరిచి సవాలు విసురుతుంది.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు విననివారు, ఆయన వీరోచితగాథ తెలియనివారు సీమలో ఉండరంటే అతిశయోక్తికాదు. భరతమాత ముద్దు బిడ్డగా, బ్రిటిష్ పాలకుల గుండెల్లో సింహస్నప్నమై నిలిచిన ప్రప్రథమ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. సేద్యం పనుల్లోని కష్టాన్ని మరచిపోవడానికి, ఇష్టాన్ని చాటుకోవడానికి.. సేదతీరిన వేళల్లో మనసుకు ఉత్సాహాన్ని ఇవ్వడానికి ‘సైసైరా... నరసింహారెడ్డి’ అంటూ పాడుకుని తమకు ఇష్టమైన నాయకుడిని తలుచుకొని ఆ గడ్డపై ప్రతి గుండె ఉప్పొంగుతుంది.
Ten years before the first Indian War of Independence in 1857, Uyyalawada Narasimhareddy was a Telugu hero who revolted against the British.

బ్రిటిష్ వారి దాష్టీకాన్ని ప్రశ్నించి, వారిపై తిరుగుబాటుచేసిన మడమ తిప్పని పోరాట పటిమను, రూపాన్ని మనకళ్ల ముందు సాక్షాత్కరింపజేస్తుంది ఉయ్యాలవాడ జీవితం. కుంఫిణీ (ఈస్టిండియా కంపెనీ) వారి కుటిల రాజకీయాలు, కుతంత్రాలపై కనె్నర్రజేసి కత్తిదూసి కదన రంగంలోకి దూకిన తొలితరం యోధుని రూపాన్ని ఆవిష్కరిస్తుంది. వెయ్యి ఏనుగులనైనా నిలువరించే బ్రిటిష్ సైన్యానికి ఆ ఒక్క పేరు సింహస్వప్నం. 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందే తిరుగుబాటు చేసిన ఈ యోధుని పేరు చరిత్రలో అంతగా కనిపించదు. అయితేనేం రేనాటి సీమలో ఏ ఇంట అడిగినా ఆయన వీరత్వాన్ని వివరిస్తారు. రాయలసీమ పౌరుష పతాకంపై చెరగని గుర్తు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఉరి కొయ్య ఎక్కే ముందు కూడా తొడగొట్టి మీసం మెలేసి, పరాక్రమాన్ని వీలునామాగా రాసివెళ్లిన ధీరుడు. బ్రిటిష్ వారు దక్షిణ భారతదేశంలో కాలుమోపిన 1750 ప్రాంతంలో ఇక్కడ బలమైన పాలకుల్లో ఒకరు నిజాం నవాబు, మరొకరు మైసూర్ పాలకుడు హైదర్ అలీ. హైదర్ అలీని ఓడిస్తే దక్షిణాన పాగా వేయవచ్చని బ్రిటిష్ వారు యుద్ధం ప్రకటించారు. హైదర్ అలీ కుమారుడు టిప్పు సుల్తాన్ ఆంగ్లేయులను పలుమార్లు ఓడించి తరిమేస్తాడు. చివరికి మరాఠా పీష్వా, నిజాం నవాబు సహకారంతో నాల్గవ మైసూర్ యుద్ధం (1799)లో టిప్పు సుల్తాన్ సైన్యాన్ని బ్రిటిష్ వారు ఓడిస్తారు. టిప్పును చంపి రాజ్యాన్ని ముగ్గురూ పంచుకున్నారు. కర్ణాటకలోని కొంత ప్రాంతం మరాఠా పీష్వాలకు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు నిజాం నవాబుకు దక్కాయి. మద్రాసు కేంద్రంగా దక్షిణాదిన బ్రిటిష్ పాలన ఆరంభమైంది. నిజాం నవాబుల ఏలుబడిలోకి వచ్చిన కర్నూలు, కడప, అనంతపురం, బళ్లారి ప్రాంతాల్లో పాలెగాండ్లు స్థానిక పాలకులు. ఒక్కో పాలెగాని కింద వంద నుండి రెండు వందల గ్రామాలు ఉండేవి. ఈ వ్యవస్థను బలోపేతం చేసిన వారు విజయనగరం రాజులు. పాలెగాండ్లు వారి సామంతులు. కడప జిల్లాలోని జమ్మలమడుగు, కర్నూలు జిల్లాలోని కోవెలకుంట్ల వరకు ఉన్న భూభాగాన్ని చెంచురెడ్ల వంశానికి చెందిన నొస్సం పాలెగాండ్లు పాలించేవారు. వీరి వంశీయుల్లో ఒకరు జయరామిరెడ్డి. విజయనగర రాజుల కాలం నుండి పాలన సాగిస్తున్న ఈయన మన్రో హయాంలో బ్రిటిష్ వారిని ఎదిరించి బందీ అయ్యాడు. అప్పుడు నొస్సం బ్రిటిష్ వారి వశమైంది. తదనంతరం ఆయనకు భరణం ఏర్పాటు చేశారు. నొస్సం జాగీర్దారుగా ఉన్న జయరామిరెడ్డికి పుత్ర సంతానం లేదు. దీంతో కూతురు సీతమ్మ అంటే ఆయనకు పంచప్రాణాలు. ఉయ్యాలవాడ జాగీర్దార్‌గా వ్యవహరిస్తున్న పెద్ద మల్లారెడ్డికి సీతమ్మను ఇచ్చి వివాహం చేస్తాడు. పెద్ద మల్లారెడ్డి, సీతమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. మల్లారెడ్డి, బొజ్జారెడ్డి, నరసింహారెడ్డి. పెద్ద మల్లారెడ్డికి సంవత్సరానికి రూ. 30 వేల పైచిలుకు ఆదాయం బ్రిటిష్ వారికి చెల్లించేవారు. ఇందుకుగాను ఆయనకు నెలకు బ్రిటిష్ ప్రభుత్వం రూ. 70 భరణంగా(తబర్జీ) ఇచ్చేది. అందులో పెద్ద మల్లారెడ్డి తన సోదరుడైన చిన్న మల్లారెడ్డికి సగం ఇచ్చేవాడు. నరసింహారెడ్డి జన్మించింది కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం రూపనగుడి గ్రామంలో. పెరిగింది ఉయ్యాలవాడలో. విద్యాభ్యాసం గుళ్లదుర్తిలో కొనసాగింది.
అవహేళనతో రగిలిన కసి
నరసింహారెడ్డి భరణం అందుకుంటూ ఉంటున్నది నొస్సం కోటలో. పాలించే అధికారం లేకపోయినా జయరామిరెడ్డి వంశీయుల ప్రభావం ఆ ప్రాంతంలో ఏ మాత్రం తగ్గలేదు.
 ప్రజలు వారి కుటుంబాన్ని గౌరవాభిమానంతో, ఆదరాభిమానాలతో చూసేవారు. అప్పటికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వయసు సుమారు 40 ఏళ్లు. ఆయనకు బ్రిటిష్ వారి నుండి నెలకు 11 అణాల భరణం అందేది. వంశానుక్రమంగా అందాల్సిన భరణం విషయంలో జరిగిన ఓ చిన్న సంఘటన నరసింహారెడ్డిలోని ఆత్మాభిమానాన్ని దెబ్బతీసింది. తన ప్రాంతంపై పెత్తనం చెలాయిస్తూ, దేశాన్ని కొల్లగొడుతున్న బ్రిటిష్ వారి పట్ల అప్పటికే ఉన్న కోపం, కసి, పగ, ద్వేషం తారాస్థాయికి చేర్చింది. నాటి కోవెలకుంట్ల తహశీల్దార్ రాఘవాచారి నరసింహారెడ్డికి చెల్లించాల్సిన భరణం విషయంలో అవహేళనగా మాట్లాడి ఆయనలో ఆగ్రహావేశాలు పెరిగేలా చేశాడు. నరసింహారెడ్డి పంపిన అనుచరుడితో ‘ముష్టి తీసుకునే వాడికే మరొక ముష్టివాడా, బ్రిటిష్ వారి నుండి భరణం తీసుకుంటూ వారికి శిస్తు కట్టొద్దని చెబుతున్నాడట, ఆ ముష్టివాడినే రమ్మను ఇస్తా భరణం’’ అని చెప్పి పంపడంతో నరసింహారెడ్డిలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. వెంటనే ఏకంగా ‘ట్రెజరీనే కొల్లగొడతాను, నీ ప్రాణాలు తీస్తాను, చేతనైతే రక్షించుకో’ అంటూ లేఖ రాసి పంపించాడు నరసింహారెడ్డి. దీంతో తహశీల్దార్ రాఘవాచారి అప్రమత్తమై ట్రెజరీలోనే ఉండిపోయాడు. రక్షణగా కొంత బ్రిటిష్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నరసింహారెడ్డి చెప్పిన మాట ప్రకారం 1846 జూలై 10న మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ కోవెలకుంట్లలోని ట్రెజరీపై తన అనుచరులతో దాడి చేశాడు. రెడ్డి అనుచరుల కత్తులు స్వైరవిహారం చేశాయి. ఎదురొచ్చిన సైన్యాన్ని మట్టుబెట్టి, తన గురించి అవహేళనగా మాట్లాడిన తహశీల్దార్ రాఘవాచారి శిరస్సు ఖండించాడు నరసింహారెడ్డి. ట్రెజరీ అధికారి థామస్ ఎడ్వర్టుకి గుండు గీయించి, నీ బ్రిటిష్ అధికారులకు దమ్ముంటే మరుసటి రోజు సాయంత్రం నయనాలప్ప వద్ద కలుసుకోమను అని చెప్పి ఎనిమిది వందల ఐదు రూపాయల పది అణాల నాలుగు పైసలు కొల్లగొట్టుకెళ్లి బ్రిటిష్ సైన్యానికి సవాలు విసిరాడు.

 తహశీల్దార్ రాఘవాచారిని నరసింహారెడ్డి చంపిన విషయాన్ని తెలుసుకున్న నాటి కడప కలెక్టర్ కాక్రేన్ ఆగ్ర హోదగ్రుడయ్యాడు. వెంటనే సైన్యాన్ని తీసుకుని నొస్సం కోటపై దాడి చేయాలని బళ్లారిలోని బ్రిటిష్ బ్రిగేడియర్ జనరల్ వాట్సన్‌ను ఆదేశించాడు. అప్పటికే స్థానికులకు తోడుగా అవుకు రాజు నారాయణరాజు పరివారం, ఆయుధ సామాగ్రిని సిద్ధం చేసుకున్నాడు నరసింహారెడ్డి. కోట చుట్టూ కందకాలు తవ్వించాడు. శత్రుసైన్యం వేగంగా నడవకుండా కోట చుట్టూ పొలాలను తవ్వించాడు. కోటను ఎక్కడానికి ప్రయత్నించే వారిపై సలసల కాగే నూనెను కుమ్మరించే ఏర్పాట్లు చేశాడు. మేలురకం శతఘ్నలు సిద్ధం చేసుకున్నాడు. 1846 జూలై 3న బ్రిటిష్ సైన్యం నొస్సం కోటపై దాడికి వచ్చింది. గుండెలు జలదరింపజేసే పోరాటం అది. బ్రిటిష్ సైన్యం చావుకేకలతో భీతావహవాతావరణం ఏర్పడింది. నరసింహారెడ్డి తెలివితేటల ముందు బ్రిటిష్ సైన్యం మట్టి కరించింది. ప్రాణభయంతో పారిపోతున్న వాట్సన్ తలను ఒక్క వేటుతో నరికేశాడు నరసింహారెడ్డి.

వన దుర్గం లో మకాం
నరసింహారెడ్డికి అనుక్షణం అండగా నిలిచిన గురువు గోసాయి వెంకన్న. ఆయన మాటే రెడ్డికి వేదవాక్యం. బ్రిటిష్ వారిపై సాధించిన విజయాన్ని చూసి పొంగిపోకూడదని, బ్రిటిష్ సైన్యం అత్యంత పెద్దదైనందున రక్షణ కోసం మకాం మార్చాలని గురువు సూచించాడు. దీంతో వనవిహారం నిమిత్తం నల్లమల అడవుల్లో కట్టించిన వనదుర్గంలోకి నరసింహారెడ్డి మకాం మార్చాడు. అక్కడికి సమీపంలోని రుద్రవరం గ్రామంలో ప్రజలు వంట చెరుకు, పశువులకు గడ్డి కోసం అడవిపైనే ఆధారపడేవారు. పీటర్ అనే అటవీ అధికారి ప్రజల నుండి బలవంతంగా రుసుం వసూలు చేసేవాడు. ఆడవాళ్లు అడవిలోకి వెళ్తే బలాత్కారం చేసి చంపేసేవాడు. ఆ ఊరిలోని రైతు నాయకుడు జంగం మల్లయ్య ద్వారా విషయం తెలుసుకున్న నరసింహారెడ్డి పీటర్‌ను వెంటాడి వేటాడి చంపాడు. దీంతో రుద్రవరంతోపాటు కంభం చుట్టుపక్కల గ్రామాలన్నీ పండుగ చేసుకున్నాయి. నరసింహారెడ్డిపై పల్లెపదాలు, కోలాటం గేయాలు పుట్టుకొచ్చాయి. దీంతో బ్రిటిష్ అధికారులకు గుబులు పట్టుకుంది.
***
కర్నూలులో తుంగభద్ర తీరం వద్ద ఉన్న బ్రిటిష్ ప్రభుత్వ కార్యాలయంలో కడప కలెక్టర్ కాక్రేన్ అధ్యక్షతన వాట్సన్ స్థానంలో నియమితులైన కెప్టెన్ నార్టన్, కర్నూలు కెప్టెన్ రసెల్, మిలటరీ కమాండింగ్ ఆఫీసర్ జోస్‌ఫ్, గవర్నర్ ఏజెంట్ డానియెల్ సమావేశమయ్యారు. నరసింహారెడ్డిని ఒంటరిని చేసి పట్టుకోవాలని, అతని తలపై రూ.10 వేలు బహుమానం కలెక్టర్ కాక్రెన్ దొరవారు ఇస్తారు. వీరులైన వారు నరసింహారెడ్డిని పట్టిచ్చి అందుకోండహో...’ అంటూ తప్పెట్లతో చాటింపు వేయించారు. ప్రజల్లో భయాన్ని కలింగించి నరసింహారెడ్డిని మట్టు మెట్టవచ్చుననే ఉద్దేశ్యంతో కెప్టెన్ నార్టన్ నొస్సం కోటను ఫిరంగులతో కూల్చేశాడు. ఈ విషయాన్ని వేగుల ద్వారా తెలుసుకున్న నరసింహారెడ్డి కంట తడిపెట్టాడు. రాయికి రాయి చేర్చి నిర్మించిన నొస్సం కోటను కోల్పోవడంతో సొంత బిడ్డను కోల్పోయినట్లు విలపించాడు. ఇదే సందర్భంలో ఎట్టి విషమ పరిస్థితుల్లోనూ తమ స్థావరం ఆచూకీ తెయజేయకూడదని గోసాయి వెంకన్నతో ప్రతిజ్ఞ చేయించాడు. నరసింహారెడ్డిని బ్రిటిష్ అధికారులకు పట్టించాలని రుద్రవరం తహశీల్దార్ శ్రీనివాసరెడ్డి పన్నాగం పన్నుతాడు. సమీపంలోని దువ్వూరు గ్రామపెద్ద రోశిరెడ్డితో ఎల్లమ్మ జాతరకు సన్నాహాలు చేయిస్తాడు. రోశిరెడ్డి నరసింహారెడ్డికి స్నేహితుడు కావడంతో ఆయనను కోడి పందేలకు ఆహ్వానించాలని కోరతాడు. ఆహ్వానాన్ని మన్నించి జాతరకు విచ్చేసిన నరసింహారెడ్డిని మట్టుబెట్టాలని యత్నించగా నరసింహారెడ్డి తెలివిగా తప్పించుకుంటాడు. అవుకు నారాయణరాజుతో పాటు మార్కాపురం జాగీర్దారు వెంకటకృష్ణయ్య, అనంతపురం జమీందారు పడకంటి వీరస్వామి, చిత్తూరు జాగీర్దార్ శివస్వామి చౌదరి, కర్నూలు నవాబు పాపాఖాన్ తదితరుల మద్దతు సమకూర్చుకుంటాడు. నరసింహారెడ్డి. బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు మరింత ఉద్ధృతం చేసేందుకు సహకారం కావాలని కోరతాడు.
ఎత్తులు చిత్తు
ప్రజల్లో తన తమ్ముడికి ఉన్న ఆదరాభిమానాలు చూసి ఈర్ష్య పెంచుకుంటాడు మల్లారెడ్డి. తమ్ముడిపై కక్ష సాధించేందుకు వేచిఉండగా కడప కలెక్టర్ కాక్రేన్ నుండి వర్తమానం అందుతుంది. కాక్రేన్ పథకం ఫలించింది. కోటలో పాగా పడింది. అతను అందించిన ఉప్పు మేరకే నరసింహారెడ్డిని పట్టుకోవడానికి మార్గం సులువైంది. నరసింహారెడ్డి భార్యాపిల్లల్ని బంధించి కడప పట్టణంలోని లాల్‌బంగ్లాలో పెట్టిస్తాడు. తన అనుమతి లేనిదే ఎవ్వరినీ వెళ్లనీయవద్దని బంగ్లా అధికారులను ఆదేశిస్తాడు. నరసింహారెడ్డికి సాయం చేయకుండా కడప నవాబు మహమ్మద్ ఇబ్రహీం, కర్నూలు నవాబును బందీ చేయిస్తాడు. నరసింహారెడ్డి తన భార్య దొరసాని సుబ్బమ్మ, కొడుకు దొరసుబ్బయ్యను విడిపించుకునేందుకు వస్తాడని కాక్రేన్ ఎత్తుగడ వేస్తాడు. అయితే ఓ అర్ధరాత్రి బంగ్లా అధికారి గుండెలపై కత్తిపెట్టి నరసింహారెడ్డి తన భార్య, బిడ్డలను ధైర్యంగా తీసుకెళ్తున్న దృశ్యాన్ని నివ్వెరపోయి చూడడం కాక్రేన్ వంతైంది. నరసింహారెడ్డిని ధైర్యంగా ఎదుర్కోవడం, యుద్ధ విద్యలతో పట్టుకోవడం సాధ్యం కాదని బ్రిటిష్ అధికారులకు అర్థమైంది.
సోదరుడి ద్రోహం
ఏ ప్రజల కోసమైతే జీవిస్తున్నాడో వారిని హింసించడం ద్వారా నరసింహారెడ్డిని లొంగదీసుకోవచ్చునని పన్నాగం పన్నుతారు. రెడ్డిని ఆరాధించే 60 గ్రామాలపై సైనికులతో దాడి జరిపించారు. పిల్లాజెల్లా, గొడ్డూగోదా ఎవ్వరినీ వదల్లేదు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ పట్టుకుని నరసింహారెడ్డి ఎక్కడ ఉన్నాడో చెప్పుమంటూ హింసించారు. కండపుష్టి ఉన్న యువకులను బందీలుగా పట్టుకెళ్లారు. స్ర్తిలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. ఈ రాక్షస చర్య అంతా నరసింహారెడ్డి సోదరుడు మల్లారెడ్డి సలహా మేరకే జరుగుతుంది. ఇవన్నీ తెలుసుకున్న నరసింహారెడ్డి ప్రజల కోసం స్వచ్ఛందంగా లొంగిపోవడానికి సిద్ధపడతాడు.
***
1846 అక్టోబర్ 6వ తేదీ చరిత్రలో మరపురాని ఘట్టం లిఖితమైంది. నరసింహారెడ్డి ఆచూకీ కనుగొన్న బ్రిటిష్ సైన్యం అతన్ని బంధించేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. నరసింహారెడ్డి, ఆయన అనుచరులు ఉంటున్న గుట్టను చుట్టుముట్టింది. నరసింహారెడ్డి లొంగిపోవాలని కలెక్టర్ కాక్రేన్ గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తాడు. నార్టన్ సైన్యం కొండపైకి ఎక్కడానికి ప్రయత్నించగా నరసింహారెడ్డి సైన్యం ఎదుర్కొంది. ఈ తరుణంలో నార్టన్ నరసింహారెడ్డి తూటాకు బలవుతాడు. నరసింహారెడ్డి సైన్యం తక్కువగా ఉండటం, కుంఫిణీ సేన ఎక్కువగా వుండడంతో పట్టుతప్పింది. వెంట తెచ్చుకున్న తూటాలన్నీ అయిపోగా చివరికి కత్తిపట్టి సైనికుల మధ్యకు చేరుకుని ఉయ్యాలవాడ సింహనాదం చేశాడు. బ్రిటిష్ సైనికులు నరసింహారెడ్డిని చుట్టుముట్టి తీవ్రంగా గాయపరిచారు. దెబ్బతిన్న పులిని చివరకు సైన్యం పట్టుకుంది. నరసింహారెడ్డిని విచారించిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు ఉరిశిక్ష విధించింది. జుర్రేటి వాగు ఒడ్డున ఉరి తీస్తున్నట్లు చాటింపు వేయిస్తుంది. సీమ వాసులంతా తమ దొరను చివరి సారి చూసుకునేందుకు కోవెలకుంట్లకు ప్రయాణం కట్టారు. 1847 ఫిబ్రవరి 22వ తేదీ తెల్లవారుజామున కచేరి జైలు ద్వారం తెరుచుకుంది. కుంఫిణీ సైనికుల వెంట ఒక్కో అడుగూ వేస్తూ బయటకు వచ్చిన తమ పాలెగాడు నరసింహారెడ్డిని చూడగానే వేలాదిగా తరలివచ్చిన జనం దిక్కులు పిక్కటిల్లేలా ‘దొర నరసింహారెడ్డికి జై’ అంటూ నినాదాలు చేశారు. తను మొదలెట్టిన ఉద్యమం ఇంతటితో మరణించదు, ఎప్పటికీ జీవించే ఉంటుంది అని జనానికి అభివాదం చేస్తూ జుర్రేటి ఒడ్డుకు సాగిపోయాడు. ఒడ్డుకు పదడుగుల దూరాన పాతిన నిలువెత్తు ఉరికొయ్యలను ఎక్కి చిరునవ్వుతో మృత్యువును ఆహ్వానించాడు. తిరుగుబాటుదార్లకు హెచ్చరికగా నరసింహారెడ్డి తలను కోవెలకుంట్ల గ్రామ ముఖద్వారం గుమ్మానికి ఇనుప సంకెళ్లతో వేలాడతీశారు. 1877 వరకు అంటే మూడు దశాబ్దాల పాటు నరసింహారెడ్డి శిరస్సు అలా కోట గుమ్మానికి వేలాడుతూనే ఉండిపోయింది. అలా చేసి ప్రజలను భయపెట్టాలను కున్నారు. కానీ జనం మనస్సుల్లో అతడు ఓ వీరుడు. శూరుడు. ఆరాధ్యుడుగా కొలువు దీరాడు.
నరసింహారెడ్డి వంశీయులు నేటికీ ఉయ్యాలవాడలో ఉన్నారు. గ్రామానికి చెందిన దొరవారి మల్లారెడ్డి, సుబ్బారెడ్డి, గోపాల్‌రెడ్డి, జయరామిరెడ్డి, సాంబశివారెడ్డి, శివశంకర్‌రెడ్డి తదితరులు నరసింహారెడ్డి వంశీయులుగా చెలామణి అవుతున్నారు.
జ్ఞాపకాలు మిగిలాయి..
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది. నాడు ఆయన నివసించిన గృహం చరిత్రకు సాక్షీభూతంగా నిలిచింది.

నరసింహారెడ్డి వాడిన ఖడ్గం రూపనగుడి గ్రామానికి చెందిన కర్నాటి అయ్యపురెడ్డి ఇంట్లో ఉంది. ఆయన వాడిన ఫిరంగి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముళ్లపాడు అడవీ ప్రాంతంలో ఉంది. నరసింహారెడ్డి కొల్లగొట్టిన ట్రెజరీ, ఆయనను ఉరితీసిన జుర్రేరు ఒడ్డు ఆనవాళ్లుగా మాత్రమే మిగిలాయి.

Thanks for reading Ten years before the first Indian War of Independence in 1857, Uyyalawada Narasimhareddy was a Telugu hero who revolted against the British.

No comments:

Post a Comment