FLASH...FLASH

Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, March 21, 2020

Today is World Water Day నేడు ప్రపంచ జల దినోత్సవం


Today is World Water Day
నేడు ప్రపంచ జల దినోత్సవం
Today is World Water Day

ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛమైన నీటి లభ్యత తగ్గిపోతోంది. నదులు, బావులు, చెరువుల్లోని ఉపరితల, భూగర్భ జలాలు రసాయన, పారిశ్రామిక వ్యర్థాలతో విషతుల్యమవుతున్నాయి. విధి లేని పరిస్థితుల్లో స్వచ్ఛత, నాణ్యత కొరవడిన నీటినే తాగాల్సిన దుస్థితి మానవాళికి ఏర్పడింది. సమాజంలోని అత్యధికులు కలుషిత జలాలు తాగుతూ జీవనం సాగిస్తున్నారన్నది చేదు నిజం. కంటికి శుభ్రంగా, తేటగా కనిపిస్తున్నందువల్ల తాము తాగుతున్నది పరిశుభ్ర జలమనే అపోహలో ప్రజలు ఉంటున్నారు. వాస్తవం వేరు! జీవనదులకు భారతదేశం పెన్నిధి. అయినా ఏటికేడు జల సంక్షోభం తీవ్రతరమవుతోంది. ప్రపంచంలో నీటి వాడకంలో మనదే అగ్రస్థానం. ప్రపంచ జనాభాలో భారత్‌ వాటా 18 శాతం. దేశంలో జల వనరుల లభ్యత కేవలం నాలుగు శాతమే. దీనివల్ల నీటి ఒత్తిడి భారీగా పెరిగిపోతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అంచనా ప్రకారం 2030నాటికి నీటి గిరాకీ 50వేల కోట్ల ఘన మీటర్లకు చేరుకుంటుంది. ఇప్పటికే సురక్షిత జలం అందక కోట్లమంది అల్లాడుతున్నారు. వేసవి వస్తే తాగునీటి కష్టాలు మరింత ఉద్ధృతమవుతున్నాయి. తాగునీటి కొరత, కాలుష్యాల సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా దృష్టి సారించకపోవడం సమస్యను మరింత జటిలం చేస్తోంది.

తీవ్రమవుతున్న నీటి కొరత
ప్రపంచవ్యాప్తంగా 78.5 కోట్ల మందికి తాగునీరు అందుబాటులో లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా గణాంకాలు చాటుతున్నాయి. వీరిలో ఎక్కువ మంది భారతీయులే ఉండటం బాధాకరం. దేశ ప్రజల్లో 7.58 కోట్ల మందికి కనీస పరిమాణంలో నీరు, 16.30 కోట్లమందికి రక్షిత మంచినీరు అందడం లేదు. చైనా, నైజీరియాలు తరవాతి స్థానంలో ఉన్నాయి. జలవనరుల నిర్వహణ సక్రమంగా లేకపోవడమే దీనికి కారణమని నివేదిక చెబుతోంది. భారత్‌లో 85 శాతం ప్రజలు బావులు, కుంటలు, చెరువులు వంటి సంప్రదాయ నీటి వనరులపైనే ఆధారపడుతున్నారని నిగ్గుతేల్చింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలు తమ సంపాదనలో 0.1 శాతం తాగునీటిపై ఖర్చు చేస్తుంటే, భారత్‌లో 17 శాతం వ్యయీకరించాల్సి వస్తోందని తెలిపింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కీలకపాత్ర పోషించే సేద్యం, పరిశ్రమల రంగాలూ నీటి కటకటను ఎదుర్కొంటున్నాయి. 1951లో ప్రతి భారతీయుడికీ సగటున 5,200 ఘన మీటర్ల నీరు అందుబాటులో ఉండేది. 2001నాటికి అది 1,816 ఘ.మీ.కు, 2011నాటికి 1,545 ఘ.మీ.కు కుంగిపోయింది. అంతర్జాతీయ లెక్కల ప్రకారం తలసరి వార్షిక నీటి లభ్యత 1,700 ఘ.మీ.కంటే తక్కువగా నమోదైతే- అది నీటి ఒత్తిడిని సూచిస్తుంది. వెయ్యి ఘ.మీ. కంటే తగ్గితే నీటిఎద్దడి ఉన్నట్లుగా లెక్కిస్తారు. ఆరోగ్య జీవనం కోసం ఏడాదికి 1,700 ఘ.మీ. నీరు అవసరం. దీని ప్రకారం దేశంలోని 256 జిల్లాల్లో నీటి కొరత వేధిస్తోంది. నిజానికి ప్రపంచ సగటు వర్షపాతం 1,110 మి.మీ.కంటే భారత్‌ సగటు వర్షపాతం కాస్త ఎక్కువగా 1,170 మి.మీ.గా ఉంది. అయినా నీటి కష్టాలు మాత్రం మనవద్దే అధికం. దేశంలోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులు తరిగిపోతున్నాయి. 2025నాటికి తలసరి నీటిలభ్యత 1,341 ఘ.మీ.కు, 2050నాటికి 1,140 ఘ.మీ.కు పడిపోతుందని అంచనా. వాస్తవానికి భూగర్భ జలాల విచ్చలవిడి వినియోగం భారత్‌లో ఉన్నంతగా మరే దేశంలోనూ లేదు.
ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, ఏటా 230 క్యూబిక్‌ కిలోమీటర్ల మేర భూగర్భ జలాలను భారత్‌ వాడుకుంటోంది. ఇది ప్రపంచ మొత్తం వాడకంలో నాలుగోవంతు కంటే ఎక్కువ. దేశ తాగునీటి అవసరాలను 85 శాతం భూగర్భ జలవనరులే తీరుస్తున్నాయి. వర్షాభావం, కరవులాంటి వైపరీత్యాల సమయంలో భూగర్భ జలాలపై ఒత్తిడి అధికమవుతోంది. వ్యవసాయ అవసరాలకోసం బోర్ల ద్వారా భూగర్భ జలాలను అధికంగా తోడేస్తున్నారు. దేశంలోని 70 శాతానికి పైగా సాగుభూమికి భూగర్భ జలాలే ఆధారం. 1950 దశకంలో ఉపరితల జలాలనే వినియోగించేవారు. కేంద్ర భూగర్భ బోర్డు అంచనాల ప్రకారం ఏడాదికి ఎనిమిది సెంటీమీటర్ల చొప్పున భూగర్భ జలమట్టాలు తగ్గుతున్నాయి. గత రెండు దశాబ్దాల్లో 300 జిల్లాల్లో భూగర్భజల నిల్వలు నాలుగు మీటర్లమేర తగ్గాయి.

శుద్ధిపై శ్రద్ధ ఏదీ?
రాజ్యాంగంలోని పదకొండో షెడ్యూల్‌ ప్రకారం స్థానిక సంస్థల మౌలిక విధుల్లో మంచినీటి సరఫరా ఒకటి. నేటికీ గ్రామీణ ప్రాంతాలకు స్వచ్ఛ జలం అందని ద్రాక్షే. కేంద్ర ప్రభుత్వ సర్వే ప్రకారం దేశంలో 18.33 శాతం గ్రామీణ గృహాలకే కుళాయిల నీటి సౌకర్యం ఉంది. 85 శాతానికిపైగా పట్టణ ప్రాంతాలకు పైపుల ద్వారా నీరు సరఫరా అవుతున్నా, నాణ్యత మాత్రం డొల్లే. ఇటీవల కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ నిర్వహించిన అధ్యయనంలో ముంబయి మినహా 20 రాష్ట్రాల్లోని రాజధానులు, ప్రధాన నగరాల్లో నల్లాల ద్వారా ఇస్తున్న నీరు తాగడానికి సురక్షితం కాదని స్పష్టమైంది. గృహ, వాణిజ్య సముదాయాల వ్యర్థాలు, వివిధ పరిశ్రమల నుంచి వచ్చే భార లోహాలతో నదులు, ఇతర జల వనరులు విషంగా మారుతున్నాయి. రసాయన ఎరువులు, పురుగు మందులవాడకంవల్ల హానికర వ్యర్థాలు భూగర్భంలోకి చేరిపోతున్నాయి. ఈ కాలకూట వ్యర్థాలను ప్రక్షాళించే శుద్ధి ప్రక్రియ మనదేశంలో ఆశించినంతగా జరగడం లేదు. 2004 వరకు వ్యర్థ జలాల శుద్ధి, పునర్వినియోగంపై కనీస చర్యలు లేవు. 2014 నుంచి మోదీ సర్కారు స్వచ్ఛ భారత్‌ అభియాన్‌లో భాగంగా వ్యర్థ జలశుద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అయితే అది సాగరంలో నీటి బొట్టంతే. మరోవైపు వ్యర్థాల ఉత్పత్తి, శుద్ధికి మధ్య అంతరం భారీగా ఉంది. పట్టణాల్లో పారిశుద్ధ్య అవసరాలకోసం ఉపయోగిస్తున్న నీరు ఏమాత్రం శుద్ధి చేయడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే దేశంలో 78 శాతం మురుగునీరు శుద్ధి చేయకుండా నేరుగా నదులు, చెరువులు, సముద్రాల్లో కలుస్తోంది. పర్యవసానంగా నదులు, భూగర్భంలోని నీటి నాణ్యత చెడి అనారోగ్యాలకు హేతువవుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజల ఆరోగ్యం, ఆదాయం, జీడీపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
దేశవ్యాప్తంగా కోట్ల లీటర్ల వ్యర్థ జలం శుద్ధి చేయకుండా నేరుగా నదులు, నీటి వనరుల్లో కలుస్తోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) లెక్కల ప్రకారం దేశమంతటా కలిపి 193 సాధారణ వ్యర్థాల శుద్ధి, 920 మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఉన్నాయి. జనాభా 10 లక్షలకంటే ఎక్కువ కలిగిన 35 మెట్రో నగరాల్లో రోజుకు 1,564.40 కోట్ల లీటర్ల మురుగు విడుదలవుతోంది. అయితే 8,040 ఎంఎల్‌డీ శుద్ధి సామర్థ్యం కలిగిన కేంద్రాలే అందుబాటులో ఉన్నాయి. అంటే 51 శాతమే శుద్ధి చేస్తున్నారు. ఇందులోనూ 55 శాతం శుద్ధి కేంద్రాలు ఒక్క దిల్లీ, ముంబయిలోనే నెలకొన్నాయి. దేశంలోని వివిధ కర్మాగారాల నుంచి ఉత్పన్నమవుతున్న వ్యర్థ జలాల్లోనూ సగమైనా శుద్ధికి నోచుకోవడం లేదు. సగటున రెండు మునిసిపాలిటీలకు ఒక ఎస్‌టీపీ కూడా లేకపోవడం గమనార్హం. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సర్వే ప్రకారం 39 శాతం వ్యర్థ జలాల శుద్ధి కేంద్రాలు (ఎస్‌టీపీలు) ప్రమాణాలకు అనుగుణంగా లేవు. పైగా వీటి ఏర్పాటు ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు.

సంరక్షణ అందరి బాధ్యత!
ప్రతి మనిషీ ఆరోగ్యంగా జీవించడానికి రోజుకు కనీసం 50 లీటర్ల నీరు అవసరం. ప్రతి నది, చెరువు, భూగర్భ జలాలు కలుషితం కావడం వల్ల ప్రజలకు అవే దిక్కవుతున్నాయి. ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికాల్లో నీటి సంబంధ రోగాలైన అతిసారం, కలరా, టైఫాయిడ్‌, విరేచనాలు 35లక్షల మంది ఉసురు తీస్తున్నాయి. భారత్‌లో ఏటా 37.3 కోట్ల మంది నీటి వ్యాధులతో బాధపడుతున్నారని అంచనా. దేశంలో కలుషిత నీటివల్ల ఏటా రెండు లక్షల మంది మృత్యువాత పడుతున్నారని నీతి ఆయోగ్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పరిస్థితుల్లో మార్పులు రావాలంటే ఇప్పటి నుంచే నీటి పొదుపు, సంరక్షణ చర్యలు చేపట్టాలి. వర్షం నీటిని ఒడిసిపట్టడంలో వైఖరి మారాలి. ఇజ్రాయెల్‌ మాదిరిగా వ్యవసాయంలో సగం శుద్ధిచేసిన నీటిని వినియోగించాలి. శౌచాలయాల్లో వాడే నీరు మినహా మిగతా ప్రతి నీటి బొట్టును శుద్ధి చేసి వాడుకునేలా అవగాహన కల్పించి ప్రోత్సహించాలి. ఐరోపా, ఆస్ట్రేలియా, కెనడా, నమీబియా దేశాల తరహాలో నదులతో సహా ఏ నీటి వనరులోనైనా శుద్ధి చేయకుండా వ్యర్థ జలం విడుదల కాకుండా పర్యవేక్షణ పెరగాలి. ఘన, జలవ్యర్థాల శుద్ధి, నిర్వహణకు సమగ్ర చట్టం తీసుకురావాలి. సమర్థ నీటి నిర్వహణకోసం జల్‌శక్తి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ, ప్రజల భాగస్వామ్యంతో సత్ఫలితాలు సాధించాలి. 1993 నుంచి ప్రపంచవ్యాప్తంగా మార్చి 22న ఐరాస నిర్వహిస్తున్న ప్రపంచ జల దినోత్సవం మొక్కుబడి కార్యక్రమాలు, ప్రకటనలకే పరిమితం కాకుండా- ప్రతి ఒక్కరూ జలసంరక్షణ బాధ్యతను స్వీకరించేలా కృషి జరగాలి!

పునర్వినియోగమే పరిష్కారం
నీటి కొరత సగానికి సగం తగ్గి జల వనరులు, పంట పొలాలు కాలుష్య ఊబి నుంచి బయటపడాలంటే వ్యర్థ జలాల పునశ్శుద్ధి, పునర్వినియోగాలే పరిష్కారమని ఐరాస స్పష్టీకరించింది. మురుగు నీటిని నూరుశాతం శుద్ధి చేసి వినియోగించుకుంటేనే మంచినీటిపై ఒత్తిడి తగ్గి లభ్యత పెరుగుతుందని తెలిపింది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) సైతం మురుగునీటి శుద్ధిపై విధానాలు రూపొందించుకోవడంతోపాటు నదులు, జల వనరులు కలుషితం కాకుండా వ్యర్థ జలాల శుద్ధి కేంద్రా (ఎస్‌టీపీ)లను ఏర్పాటు చేయాలని నిరుడు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. నీటి కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం 1974, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 నిబంధనల్ని అనుసరించి ప్రతి రాష్ట్రంలో మురుగునీరు నదుల్లో కలవకుండా చర్యలు చేపట్టాలంటూ అన్ని రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లకు 2015లో సీపీసీబీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్‌జీటీ, సీపీసీబీ ఆదేశాలు అమలై ప్రతిచోటా ఎస్‌టీపీల ఏర్పాటు ఊపందుకుంటే, వ్యర్థ జలశుద్ధి రంగం ఉపాధి గనిగా అవతరిస్తుంది.

Thanks for reading Today is World Water Day నేడు ప్రపంచ జల దినోత్సవం

No comments:

Post a Comment