ఫార్మెటివ్ మార్కులతో ‘పది’లో గ్రేడ్లు
●అత్యధిక మార్కులొచ్చిన 3 సబ్జెక్టుల ఎంపిక
●తుదిదశకు మార్కుల మదింపు కమిటీ కసరత్తు
అమరావతి:అంతర్గత మార్కుల ఆధారంగా పదో తరగతిలో గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు ప్రకటించనున్నారు. కరోనా కారణంగా పరీక్షలను రద్దు చేసి, మార్కుల మదింపునకు ఏర్పాటు చేసిన ఛాయరతన్ కమిటీ కసరత్తు తుదిదశకు చేరింది. పదో తరగతి విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరంలో రెండు ఫార్మెటివ్ పరీక్షలను నిర్వహించారు. ఒక్కో పరీక్షను 50మార్కులకు నిర్వహించారు. ఇప్పటికే ఈ మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. వీటి ఆధారంగా గ్రేడ్లు ఇవ్వనున్నారు.
♦మార్కుల మదింపు ఇలా..:ఫార్మెటివ్-1లో ఎక్కువ మార్కులు వచ్చిన 3 సబ్జెక్టులను తీసుకొని, వాటిని సరాసరి చేస్తారు. ఒక సబ్జెక్టు సరాసరి మార్కులు వస్తాయి. ఇలాగే ఫార్మెటివ్-2ను చేస్తారు. ఈ రెండింటిని కలిపి పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు 50మార్కులకు నిర్వహించిన ఫార్మెటివ్-1 సరాసరిన 45మార్కులు రాగా.. ఫార్మెటివ్-2లో 47 మార్కులు వస్తే ఈ రెండు కలిపి 92మార్కులుగా తీసుకుంటారు. దీని ఆధారంగా మొత్తం గ్రేడ్, సబ్జెక్టు గ్రేడ్ ఇస్తారు. అంతర్గత మార్కుల విధానం అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది.
♦గతేడాదికీ మార్కులు..:గతేడాది(2019-20) పదో తరగతి పరీక్షలను రద్దు చేసి, ఎలాంటి మార్కులూ ఇవ్వలేదు. అందరూ ఉత్తీర్ణులైనట్లు ప్రకటించారు. ఆర్మీ ఉద్యోగాలకు మార్కులు అవసరం అవుతున్నందున విద్యార్థుల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. మార్కులు కావాలని అడిగిన వారికి ఇప్పటి వరకు ప్రభుత్వ పరీక్షల విభాగం అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇస్తోంది. విద్యార్థులందరికీ మార్కులు ఇచ్చేందుకు ఛాయరతన్ కమిటీ సిఫార్సు చేసింది. పిల్లల సమస్య దృష్ట్యా అందరికీ గ్రేడ్లు, గ్రేడ్‌పాయింట్లు ఇవ్వాలని సూచించింది.
Thanks for reading Grades in 10th class with formative marks
No comments:
Post a Comment