Corona Vaccine: వ్యాక్సిన్ తీసుకోని వారిపై బ్లాక్‌ఫంగస్ పంజా!
పలువురిపై డెల్టా వేరియంట్ ప్రభావం
విజయవాడ జీజీహెచ్ అధ్యయనంలో వెల్లడి.
ఈనాడు, అమరావతి: కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోని వారిలో బ్లాక్‌ఫంగస్ ముప్పు పెరిగినట్లు తేలింది. అలాగే పలువురు బాధితుల్లో డెల్టా వేరియంట్ లక్షణాలు కనిపించాయి. ఒక డోసు కూడా వ్యాక్సిన్ పొందనివారు, రోగనిరోధక శక్తి తగ్గి చక్కెర వ్యాధి కలిగి రక్తంలో ఇనుము శాతం ఎక్కువగా ఉన్నవారు ఎక్కువ మంది బ్లాక్‌ఫంగస్ బారినపడ్డారు. ఈనెల 10నాటికి రాష్ట్రవ్యాప్తంగా 4,609 బ్లాక్‌ఫంగస్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 432 మంది చనిపోయారు. మరణాల రేటు 9.37%గా నమోదైంది. 2,519 మందికి శస్త్రచికిత్సలు అయ్యాయి. 3,514 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. విజయవాడ జీజీహెచ్‌లో చేరిన బ్లాక్‌ఫంగస్ బాధితులపై వైద్య నిపుణుల బృందం అధ్యయనం నిర్వహించింది. రాష్ట్రంలో ప్రధాన కొవిడ్ ఆసుపత్రి అయిన విజయవాడ జీజీహెచ్‌లో ఈ ఏడాది మే నుంచి ఇప్పటివరకు 538 మంది బ్లాక్‌ఫంగస్‌కు చికిత్స పొందారు. 376 మందికి ఈఎన్‌టీ, 18 మందికి మెదడు శస్త్రచికిత్సలు, 76 మందికి దంత శస్త్రచికిత్సలు చేశారు. 320 యాంఫోటెరిసిన్ ఇంజెక్షన్లను బాధితుల కళ్లకు ఇచ్చారు. రోగుల్లో వంద మంది మరణించారు. 300 మంది నుంచి సేకరించిన వ్యక్తిగత వివరాలు, ఆరోగ్య పరీక్షల ఫలితాలు, బాధితుల సైనస్ గదుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను వైద్య బృందం పరీక్షించింది. పలువురు బాధితుల్లో డెల్టా వేరియంట్ లక్షణాలు కనిపించినట్లు ఈఎన్‌టీ విభాగాధిపతి ప్రొఫెసర్ రవి పేర్కొన్నారు. ‘బాధితుల శరీరంలో ఉండే క్లోమగ్రంథిలోని బీటా సెల్స్ ఇన్‌ఫెక్షన్‌కు గురైనందున ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గింది. ఫలితంగా రక్తంలో చక్కెర శాతం పెరిగింది. ఈ కారణంగా కణజాలంలో ఎసిడోసిస్ వచ్చింది. ఇది ఫంగస్ ఉత్పత్తి పెరిగేందుకు కారణమైంది. అంతేకాకుండా.. కణజాలం వాపునకు గురైనందున రక్తంలో సాధారణ స్థాయికంటే పదింతలు ఇనుము శాతం పెరిగి ఇది ఫంగస్ వృద్ధికి తన వంతు దోహదం చేసింది. ఇది రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. రోగ నిరోధక శక్తి తగ్గినందున ఫంగస్ శరీరంలోకి చొచ్చుకుపోయింది. సాధారణంగా కుళ్లిన పదార్థాలు, జంతు కళేబరాలపై పెరిగే ఫంగస్ సూక్ష్మరేణువుల మాదిరి మనుషుల ముక్కుల్లోకి ప్రవేశించింది. అక్కడినుంచి సైనస్ కణజాలాలకు వ్యాపించి రక్తనాళాల చుట్టూ ఉన్న గోడలను వాచేలా చేసింది. దీంతో రక్తప్రసరణ నిలిచి ఆ ప్రదేశం చచ్చుబడిపోయింది’ అని పేర్కొన్నారు.
మరణాలకు దారితీసిన కారణాలు
దీర్ఘకాలంగా ఉన్న మధుమేహం, రక్తపోటు బాధితులు.. డయాలసిస్ చేయించుకుంటున్న వారిపై బ్లాక్‌ఫంగస్ తీవ్ర ప్రభావం చూపింది. హెచ్‌ఐవీతో బాధపడుతూ కొవిడ్ బారిన పడిన కొందరు బ్లాక్‌ఫంగస్ సోకి ఆసుపత్రిలో చేరారు. మరికొందరు ఆలస్యంగా ఆసుపత్రులకు రావడంతో సరైన సమయంలో చికిత్స అందలేదు. ఈ కారణాలు మరణాల సంఖ్య పెరిగేందుకు దోహదం చేసినట్లు వైద్యులు తెలిపారు. కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ (వైద్యం) శివశంకర్ మాట్లాడుతూ... మలివిడత కొవిడ్‌కు, బ్లాక్‌ఫంగస్ కేసులకు సంబంధం ఉందని అన్నారు. కొవిడ్ నుంచి కోలుకున్నవారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలని, నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు.
అధ్యయనం ఇలా..
ఈ ఏడాది మే నుంచి జులై వరకు అధ్యయనం సాగింది. ప్రత్యేక నమూనాలో రోగుల వివరాలు సేకరించి ఆరోగ్య పరీక్షల ఫలితాలను క్రోడీకరించి ప్రాథమిక నివేదికను వైద్య బృందం తయారుచేసింది. బృందంలో ఈఎన్‌టీ, న్యూరోసర్జరీ, న్యూరాలజీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, డెంటల్, జనరల్ మెడిసిన్, ఆప్తమాలజీ, ఇతర వైద్యులు ఉన్నారు. సిద్దార్థ వైద్య కళాశాల తరఫున భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నుంచి పొందిన ప్రాజెక్టు ఆధారంగా ఈ అధ్యయనం చేపట్టారు. ఈ నివేదికను ఐసీఎంఆర్‌కు పంపనున్నారు. అది పరిశీలన అనంతరం వైద్య జర్నల్‌లో ప్రచురితమవుతుంది.
గుర్తించిన అంశాలివీ...
> 300 మంది బాధితుల్లో 298 మంది ఒక డోసు కూడా వ్యాక్సిన్ వేయించుకోలేదు. ఇద్దరు మాత్రం ఒక డోసు పొందారు.
> మలివిడతలో వైరస్ బారిన పడి చికిత్స పొందిన 2వారాల అనంతరం వీరు జీజీహెచ్‌లో చేరారు. రోగుల్లో 190 మంది పురుషులు, 110 మంది మహిళలు ఉన్నారు. ఎక్కువ మంది వయసు 45 ఏళ్లుపైనే.
> 200 మందిలో కంటి సమస్యలు కనిపించాయి. ముఖ్యంగా కంటి గుడ్డుపక్కనే ఫంగస్ చేరింది.
> 30 మంది బాధితులకు మెదడు దాకా ఫంగస్ వ్యాపించింది.
> 70 మందికి దవడలు, పళ్ల దగ్గర ఫంగస్‌ను గుర్తించారు.
> 300 మందీ మధుమేహ వ్యాధి బాధితులే. వీరిలో 70 మందికే కొవిడ్ చికిత్స పొందే సమయంలో అధికంగా స్టెరాయిడ్స్ వాడారు.
> బాధితుల రక్తంలో ఇనుము శాతం ఎక్కువగా కనిపించింది. రోగ నిరోధక శక్తి గణనీయంగా తగ్గింది.
> బాధితుల్లో 90% పైగా పేద కుటుంబాలవారే.
Thanks for reading corona Vaccine: Black fungus effect on those who have not been vaccinated!
No comments:
Post a Comment