Covid-19: సరికొత్త ఫిల్టర్.. వైరస్‌ను గాలించేస్తుంది!
సరికొత్త ఫిల్టర్ అభివృద్ధికి చేతులు కలిపిన భారత్, బ్రిటన్
దిల్లీ: గాల్లో కరోనా వైరస్, టీబీ కారక బ్యాక్టీరియా వ్యాప్తిని నిరోధించే ఉద్దేశంతో సరికొత్త శుద్ధి వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు భారత్, బ్రిటన్ శాస్త్రవేత్తలు చేతులు కలిపారు. ఈ విప్లవాత్మక ప్రాజెక్టులో మద్రాస్ ఐఐటీ, వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, లండన్‌లోని క్వీన్ మేరీ విశ్వవిద్యాలయం పాలుపంచుకుంటున్నాయి. సమర్థ, చౌకైన, బయో ఏరోసాల్ రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడం ఈ ఉమ్మడి పరిశోధన ఉద్దేశమని శాస్త్రవేత్తలు తెలిపారు. తద్వారా భారత ఉపఖండంలోని ఇళ్లల్లో గాలి ద్వారా వ్యాపించే వ్యాధులకు అడ్డుకట్ట వేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో అధిక జనాభాతోపాటు పట్టణ ప్రాంతాల్లో కాలుష్యం తీవ్రంగా ఉన్నందువల్ల ఇలాంటి వ్యవస్థలు అవసరమని పేర్కొన్నారు. ‘అతినీలలోహిత-సి’ రేడియోధార్మికతను ఉపయోగించి ఈ గాలి శుద్ధి వ్యవస్థను ప్రయోగాత్మకంగా రూపొందిస్తామని వివరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫిల్టర్లతో పోలిస్తే దీని నిర్వహణ వ్యయం తక్కువగా ఉండేలా చూస్తామన్నారు. భారత్ వంటి వర్ధమాన దేశాలకు ఇది చాలా ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. ప్రస్తుతమున్న శుద్ధి వ్యవస్థలు.. వ్యాధుల వ్యాప్తిని అడ్డుకోవడంలో అంత సమర్థతను చాటడం లేదన్నారు. ఈ ప్రాజెక్టు బృందంలో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ సిస్టమ్ డిజైనర్లు, మైక్రోబయాలజిస్టులు, ఫ్లూయిడ్ సిస్టమ్ డిజైనర్లు ఉన్నారు.
Thanks for reading Covid-19: The newest filter
No comments:
Post a Comment