Variant MU: మరో కొత్త వేరియంట్.. వ్యాక్సిన్‌కు తలొగ్గని ‘మూ’
జెనీవా: కరోనా వైరస్ మరింత బలపడుతూ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. C.1.2గా పిలిచే ఓ వేరియంట్ బయటపడినట్లు రెండు రోజుల క్రితమే తేలగా.. మరో ఉత్పరివర్తనం వెలుగులోకి వచ్చింది. తాజాగా ‘మూ’ (Mu) వేరియంట్‌ను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. ఈ ఏడాది జనవరిలో కొలంబియాలో ఇది బయటపడినట్లు పేర్కొంది. ప్రస్తుతం ‘మూ’ను వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్‌గా గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. అయితే ఈ వేరియంట్‌కు టీకాలను ఏమార్చే గుణాలున్నాయని దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరమని వెల్లడించింది.
యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ తన రూపాలను మార్చుకుంటూనే ఉంది. ఇప్పటికే డెల్టా వంటి కొత్త వేరియంట్లతో ఆయా దేశాల్లో విజృంభణ కొనసాగిస్తూనే ఉంది. ఇదే సమయంలో వైరస్ సంక్రమణ ఎక్కువగా ఉన్నట్లు భావిస్తోన్న C.1.2గా పిలిచే మరో వేరియంట్ బయటపడింది. తాజాగా వ్యాక్సిన్ల నుంచి తప్పించుకునే ‘మూ’ వేరియంట్ వెలుగుచూడడం ప్రపంచ శాస్త్రవేత్తలను కలవరానికి గురిచేస్తోంది.
కొవిడ్ నిబంధనలు సడలించిన ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందుతోంది. కొవిడ్ ఉత్పరివర్తనంతో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. అందులో కొన్ని స్వల్ప ప్రభావం చూపుతున్నప్పటికీ.. ఆల్ఫా, డెల్టా లాంటి వేరియంట్లు విజృంభించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫెక్షన్ల రేటు మళ్లీ పెరిగిపోయింది. ప్రస్తుతం ఆల్ఫా 193 దేశాల్లో విస్తరించగా.. 170 దేశాల్లో డెల్టా కేసులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలోనే తీవ్ర ప్రభావం చూపే మరో రెండు వేరియంట్లు వెలుగుచూడటం ఆందోళన కలిగించే అంశం.
Thanks for reading Variant MU: Another new variant MU
No comments:
Post a Comment