Facebook - Meta: ఫేస్‌బుక్ మాతృసంస్థ కొత్త పేరు ‘మెటా’
ఓక్లాండ్: ‘ఫేస్‌బుక్’ కంపెనీ పేరు మారింది. ఇకపై దాన్ని ‘మెటా’గా పిలవనున్నారు. ఈ మేరకు పేరు మార్పు విషయాన్ని ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ గురువారం వెల్లడించారు. భవిష్యత్తులో వర్చువల్ రియాలిటీ సాంకేతికత (మెటావర్స్)కు పెరగనున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఫేస్‌బుక్ కంపెనీ అధీనంలోని సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, వాట్సప్‌ల పేర్లలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదు. వీటి మాతృసంస్థ పేరును మాత్రమే మార్చారు. ప్రజలు వర్చువల్ విధానంలో కలుసుకొని, పనిచేసి, ఉత్పత్తులను తయారుచేసే సరికొత్త వేదికగా మెటావర్స్‌ను జుకర్‌బర్గ్ చెబుతున్నారు. రానున్న దశాబ్దంలో వంద కోట్ల మందికి ఈ వేదిక అందుబాటులోకి వస్తుందని, లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన తాజాగా పేర్కొన్నారు.
ప్రస్తుతం తమ సామాజిక మాధ్యమంలో ఇన్‌స్టాగ్రాం, మెసెంజర్, క్వెస్ట్ వీఆర్ హెడ్‌సెట్, హొరైజన్ వీఆర్ వంటివి భాగంగా ఉన్నాయని.. వాటన్నింటికీ ‘ఫేస్‌బుక్’ అనే పేరు దర్పణం పట్టడం లేదని చెప్పారు. తమను ప్రస్తుతం కేవలం సామాజిక మాధ్యమ సంస్థగానే పరిగణిస్తున్నారని తెలిపారు. కానీ వాస్తవానికి తమది- ప్రజల మధ్య అనుసంధానతను పెంచేందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేసే కంపెనీ అని వ్యాఖ్యానించారు. ‘మెటా’ అనేది గ్రీకు పదమని చెప్పారు. ఫేస్‌బుక్ పేపర్ల పేరిట ఇటీవల బయటపడ్డ పత్రాలతో సంస్థ తీవ్ర విమర్శల పాలైందని.. దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సంస్థ పేరు మార్చారని విశ్లేషకులు చెబుతుండటం గమనార్హం.
Thanks for reading FaceBook: Facebook has changed its name.
No comments:
Post a Comment