Precaution Dose : 18 ఏళ్లు పైబడిన అందరికీ ప్రికాషన్ డోసులు .. ప్రైవేటులో మాత్రమే .. !
దిల్లీ: దేశంలోకి ఒమిక్రాన్ 'ఎక్స్‌ఈ' వేరియంట్ ప్రవేశించినట్లు వస్తోన్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
వైరస్ వ్యాప్తిని అరికట్టేలా టీకా పంపిణీని మరింత విస్తరించింది. ఏప్రిల్ 10 నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ ప్రికాషన్ డోసులు పంపిణీ చేయనుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. అయితే ప్రైవేటు కేంద్రాల్లో మాత్రమే ఈ డోసుల పంపిణీ జరగనున్నట్లు తెలిపింది.
''18 ఏళ్లు పైబడిన వారందరికీ ప్రైవేటు కేంద్రాల ద్వారా ప్రికాషన్ డోసు పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఏప్రిల్ 10 (ఆదివారం) నుంచి ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఈ డోసు పంపిణీ ప్రారంభం కానుంది. రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తయిన 18ఏళ్లు పైబడిన అందరూ ప్రికాషన్ డోసు తీసుకునేందుకు అర్హులు. అన్ని ప్రైవేటు టీకా పంపిణీ కేంద్రాల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ప్రస్తుతమున్న తొలి, రెండు డోసు పంపిణీ, ఆరోగ్య కార్యకర్తలు/60ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ డోసు పంపిణీ అలాగే కొనసాగుతుంది'' అని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. తొలి రెండు డోసులు ఏ టీకా తీసుకున్నారో.. ప్రికాషన్ డోసు కూడా అదే టీకా తీసుకోవాల్సి ఉంటుంది.
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం దశల వారీగా టీకా పంపిణీని విస్తరిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 10 నుంచి ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లతో పాటు 60ఏళ్లు పైబడి ఇతర అనారోగ్య సమస్యలున్న వారికి ప్రికాషన్ డోసు పంపిణీని ప్రారంభించింది. ఆ తర్వాత 60 ఏళ్ల పైబడిన అందరికీ ఈ డోసును అందించగా.. తాజాగా 18ఏళ్లు పైబడిన వారికీ ప్రికాషన్ డోసు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది.
ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు దేశంలో 15ఏళ్లు పైబడిన 96శాతం మంది కనీసం ఒక డోసు తీసుకోగా.. 83శాతం మంది రెండు డోసులు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 2.4కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు ప్రికాషన్ డోసు తీసుకున్నారు. 12-14 ఏళ్ల వారిలో 45 శాతం మందికి తొలి డోసు అందించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Thanks for reading Precaution Dose: Precautionary doses for all over 18 years
No comments:
Post a Comment