Tokenisation: అక్టోబర్ 1 నుంచి డెబిట్, క్రెడిట్ కార్డు కొత్త రూల్స్..!
డెబిట్/క్రెడిట్ కార్డుతో చేసే చెల్లింపుల కోసం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త నియమాలను తీసుకొచ్చింది. ఈ రూల్స్ అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆన్‌లైన్, పాయింట్ ఆఫ్ సేల్, యాప్ లావాదేవీల్లో టోకనైజేషన్ విధానాన్ని అమలు చేయాలని ఆర్‌బీఐ సూచించింది. తొలుత 2021 జూన్ 30వ తేదీ వరకు గడువు నిర్దేశించగా.. పేమెంట్ అగ్రిగేటర్లు, వ్యాపారులు, బ్యాంకులు సన్నద్ధత తెలుపకపోవడంతో పలుమార్లు గడువు పొడిగించారు. ఈ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. అక్టోబరు 1 నుంచి కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి.
టోకెనైజేషన్ అంటే ఏంటి?
ఆర్‌బీఐ ప్రకారం.. టోకనైజేషన్ విధానంలో కార్డు అసలు వివరాలను టోకెన్ అని పిలిచే ప్రత్యామ్నాయ కోడ్‌తో భర్తీ చేస్తారు. దీంతో లావాదేవీని ప్రాసెస్ చేసే సమయంలో అసలు కార్డు వివరాలను వ్యాపార సంస్థల వద్ద షేర్ చేయరు. కాబట్టి టోకనైజ్ చేసిన కార్డు లావాదేవీలు సురక్షితంగా ఉంటాయి.
ఇప్పడు ఎలా జరుగుతున్నాయి?
ప్రతిరోజూ మనం వివిధ కారణాలతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ, జొమాటో, ఊబర్, ఓలా వంటి పలు యాప్స్ ఉపయోగిస్తుంటాం. ఇవి అందించిన సేవలకు క్రెడిట్/డెబిట్ కార్డుతో చెల్లింపులు చేస్తుంటాం. చెల్లింపులు చేసేటప్పుడు కార్డుకు సంబంధించిన కార్డు నంబర్, ఎక్స్‌పైరీ డేట్, సీవీవీ.. వంటి వివరాలను ఇచ్చి.. ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లావాదేవీ పూర్తి చేస్తుంటాం. మొదటిసారి లావాదేవీ చేసినప్పుడు మాత్రమే ఈ వివరాలు ఎంటర్ చేస్తుంటాం. ఆ తర్వాత అదే వెబ్‌సైట్ లేదా యాప్‌లో ఎన్ని సార్లు లావాదేవీలు చేసినా ఈ వివరాలు అందించనవసరం లేదు. మొదటిసారి ఎంటర్ చేసినప్పుడే మన కార్డు వివరాలు నిక్షిప్తం చేసేలా కార్డు-ఆన్-ఫైల్ (CoF) ఆప్షన్ అందిస్తున్నాయి. దీంతో ప్రతిసారీ కార్డు వివరాలు ఎంటర్ చేయకుండానే పని పూర్తి చేసే సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఈ సదుపాయం వల్ల వినియోగదారులకు సులభంగా సేవలు అందుతున్నప్పటికీ ఆయా యాప్‌లలో నిక్షిప్తమైన సున్నితమైన సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఉంది. దీనికి చెక్ పెట్టేందుకు ఆర్‌బీఐ టోకనైజేషన్ ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది.
టోకనైజేషన్ పద్ధతి ఎలా పనిచేస్తుంది?
టోకనైజేషన్ విధానంలో వినియోగదారులు ఇ-కామర్స్ సైట్‌లో షాపింగ్ చేసినప్పుడు.. ఆయా ప్లాట్‌ఫారంలపై ఏ రూపంలోనూ కార్డు వివరాలను నిల్వచేయలేరు. 'టోకన్'గా వ్యవహరించే ప్రత్యామ్నాయ కోడ్ సాయంతో లావాదేవీ పూర్తిచేయవచ్చు. ఈ 'టోకెన్' పొందాలంటే చెల్లింపు జరిపే సైట్‌లో 'టోకెన్ రిక్వెస్టర్' (వినియోగదారు నుంచి కార్డు టోకనైజేషన్ అభ్యర్థనను స్వీకరించే సంస్థ)కు అభ్యర్థన పెట్టుకోవాలి. ఈ సంస్థ మీ అభ్యర్థనను కార్డు నెట్‌వర్క్ సంస్థకు పంపిస్తుంది. కార్డు జారీదారు సమ్మతితో 'టోకెన్'ను కార్డు నెట్‌వర్క్ సంస్థ జారీచేస్తుంది. ఇలా కార్డు వివరాలకు బదులుగా టోకెన్ ఇవ్వడాన్ని 'టోకనైజేషన్' అంటారు. అన్ని చెల్లింపు ప్లాట్‌ఫారంలకు ఒకే టోకెన్ ఉండదు. ఒక్కో సంస్థకు ఒక్కో టోకెన్ ఉంటుంది. ఒకవేళ మీరు ఆ యాప్ నుంచి వైదొలిగితే మీ టోకెన్ రద్దు చేయాల్సిందిగా సదరు సంస్థను కోరవచ్చు. దీన్నే డీ-టోకనైజేషన్ అంటారు.
కార్డు దారులు టోకనైజేషన్ చేసే విధానం..
వస్తు, సేవలను కొనుగోలు చేసేందుకు ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో టోకనైజేషన్ చేసుకోవచ్చు.
కొనుగోలు ఎంపిక పూర్తయిన తర్వాత చెల్లింపుల పేజీకి వెళ్లినప్పుడు మీ కార్డు సంబంధిత, కావాల్సిన అన్ని వివరాలను జాగ్రత్తగా ఎంటర్ చేయాలి.
‘ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరించి మీ కార్డును సురక్షితం చేసుకోండి' అని ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని ఆ పేజీలో నమోదు చేయండి.
ఇది పూర్తయిన తర్వాత.. ఆ నిర్దిష్ట వ్యాపారికి టోకెన్ పంపుతారు. వ్యక్తిగత కార్డు వివరాల స్థానంలో దీన్ని సేవ్ చేస్తారు.
మరోసారి అదే ఈ-కామర్స్ ప్లాట్‌ఫారంపై చెల్లింపులు చేయాల్సివచ్చినప్పుడు మీరు సేవ్ చేసిన కార్డులోని చివరి నాలుగు అంకెలు కనిపిస్తాయి. మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు టోకనైజ్ చేసినట్లు ఇది సూచిస్తుంది.
చివరిగా..
ఒక వినియోగదారుడు తన కార్డును టోకనైజ్ చేసేందుకు అనుమతించాలా? వద్దా? అనేది పూర్తిగా వారి ఇష్టం. టోకనైజ్ చేయడానికి ఇష్టపడని వారు లావాదేవీ చేసిన ప్రతిసారీ కార్డు వివరాలను మాన్యువల్‌గా నమోదు చేయాల్సి ఉంటుంది. సంస్థలు టోకనైజ్ చేయాలని వినియోగదారుని ఒత్తిడి చేసేందుకు వీల్లేదు. టోకనైజ్ చేసేందుకు కార్డు జారీ సంస్థ ఎలాంటి రుసుములూ వసూలు చేయకూడదు.
Thanks for reading Tokenisation: Debit and credit card new rules from October 1..!
No comments:
Post a Comment