Financial Habits: ఈ ఆర్థిక అలవాట్లతో వేగంగా సంపద సృష్టించుకోవచ్చు!
జీవితంలో అలవర్చుకునే మంచి అలవాట్లే..విజయం వైపు దిశా నిర్దేశం చేస్తాయి. ఇదే సూత్రం ఆర్థిక విషయాల్లోనూ వర్తిస్తుంది.
జీవితంలో అలవర్చుకునే మంచి అలవాట్లే.. మనల్ని విజయం వైపు నడిపిస్తాయి. ఇదే సూత్రం ఆర్థిక విషయాల్లోనూ వర్తిస్తుంది. మదుపు చేయాలంటే ప్రారంభంలోనే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని కాదు. రూ.500 లాంటి చిన్న మొత్తంతో పెట్టుబడులు ప్రారంభించినా ఒక క్రమ పద్ధతిలో అలవాటుగా చేస్తూపోతే మంచి రాబడి సాధించవచ్చు. అలాగే ఆర్జించిన మొత్తంలో ఎక్కువ భాగం పొదుపు కోసం కేటాయించగలగాలి. ఖర్చులను నియంత్రణలో ఉంచగలగాలి. ఇదంతా మంచి ఆర్థిక అలవాట్లు ఉన్నవారికే సాధ్యం అవుతుంది. ఇంతకీ మంచి ఆర్థిక అలవాట్లు అంటే..?
ఏ పనైనా ప్రణాళిక ప్రకారం చేయాలి..
మనం చేసే ఏ పని కోసమైనా ముందుగా ప్లాన్ చేయడం అలవాటు చేసుకోవాలి. నెలవారీ ఆదాయాన్నే తీసుకోండి. ఎంత పొదుపు చేయాలి? ఖర్చుల కోసం ఎంత ప్లాన్ చేయాలి? అనేది చూసుకోవాలి. ఖర్చులను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఎక్కువ మొత్తాన్ని పొదుపు కోసం కేటాయించగలుగుతాం. అలాగే మనకు అనేక ఆర్థిక లక్ష్యాలు (పిల్లలు చదువులు, పదవీ విరమణ ఇలా) ఉంటాయి. పొదుపు చేసిన మొత్తం నుంచి ఏ లక్ష్యం కోసం ఎంత కేటాయించాలి? ఎక్కడ మదుపు చేయాలి? అనేది కూడా ప్లాన్ చేసుకోవాలి.
అనవసర ఖర్చులకు పోకుండా..
జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. ఆదాయం పెరిగింది. దీంతో పాటే ఖర్చులూ పెరిగాయి. కొన్ని సార్లు వద్దనుకున్నా.. స్నేహితుల ఒత్తిడితో ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇవి ఆదాయాన్ని మించిపోతుంటాయి. ఇది ప్రమాదకరం. కాబట్టి అనవసర ఖర్చులు చేసే అలవాట్లను మానుకోండి. ఖర్చుల కోసం ఒక బెంచ్‌మార్కును సెట్ చేసుకోండి. ఈ పరిధి దాటకుండా ఉండేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నించండి.
అప్పులకు దూరంగా ఉండండి..
అప్పు.. ఒక వ్యక్తి ఆర్థిక ప్రణాళికను దెబ్బతీసి రుణ ఊబిలో చిక్కుకుపోయేలా చేయగలదు. అందువల్ల రుణాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. రుణాలు ఎప్పుడూ పరిమితిలోనే ఉండాలి. ఏదైనా కొనుగోలు చేయడానికి మనం అప్పు చేస్తున్నామంటే.. భవిష్యత్‌లో దాని విలువ మనకి కనిపించాలి. ఉదాహరణకు విద్యారుణం తీసుకోండి. దీంతో మనం నైపుణ్యాన్ని పెంచుకుని భవిష్యత్‌లో మరింత ఆర్జించేందుకు అవకాశాన్ని ఇస్తుంది. అలాగే గృహ రుణం తీసుకుంటే.. భవిష్యత్‌లో మనం ఇంటిని సమకూర్చుకోగలుగుతాం. కాబట్టి ఇలాంటి రుణాలను తీసుకోవడంలో తప్పులేదు. అంతేగానీ కాలక్రమంలో విలువ తగ్గే ఆస్తుల కోసం, ఇతర విలాసాల కోసం అప్పు చేయడం మంచిది కాదు.
అలాగే, కొన్నిసార్లు తక్కువ వడ్డీ రేటుకే రుణం లభిస్తుందని అప్పు తీసుకుంటాం. కానీ, వడ్డీ రేట్లు పెరిగినప్పుడు చెల్లించాల్సిన ఈఎంఐ భారమైపోతుంది. అందువల్ల మీ రుణాలను ఏడాదికి ఒకసారైనా సమీక్షించండి. అందులో ఎక్కువ వడ్డీ రేటుతో కూడిన రూణాలను ముందుగా చెల్లించేందుకు ప్రయత్నించండి. ఇందుకు సంస్థ ఇచ్చే బోనస్ వంటి వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు.
పెట్టుబడుల్లో వైవిధ్యత ఉండాలి..
పొదుపు చేసిన డబ్బునంతా ఒకేచోట మదుపు చేయడం తెలివైన పనికాదు. ఇందులో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక పెట్టుబడిలో రాబడి అధికంగా వస్తుందని ఎవరైనా చెబితే.. మొత్తం డబ్బును తీసుకెళ్లి అందులోనే పెట్టేస్తుంటారు. ఒకవేళ ఆ పెట్టుబడులు తీవ్రస్థాయిలో దెబ్బతింటే తిరిగి కోలుకోలేని పరిస్థితులు రావచ్చు. అందువల్ల ఉన్న డబ్బంతా ఒకే చోట కాకుండా రిస్క్‌ను నియంత్రణలో ఉంచే విధంగా వివిధ ఆస్తి తరగతుల్లో మదుపు చేయాలి. రిస్క్‌తో పాటు, ఇతర ఖర్చులు, పన్నులనూ పరిగణనలోకి తీసుకుని పోర్ట్‌ఫోలియో నిర్మించుకోవాలి.
మీ కోసం కొంత పక్కన పెట్టండి..
ప్రతి నెలా ఆదాయం వస్తుంది. ఇందులో కొంత భాగాన్ని ఇంటి అద్దె, కరెంటు/ఇతర బిల్లులు, మీ/కుటుంబ సభ్యుల వినోదం కోసం ఖర్చు చేస్తుంటారు. మిగిలినది పిల్లల చదువులు, ఇతర కుటుంబ సభ్యుల కోసం కేటాయిస్తారు. మరి మీ భవిష్యత్ కోసం మీరు ఏమైనా పొదుపు చేస్తున్నారా.. చూసుకోండి. ఒకవేళ లేదూ అనుకుంటే ప్రతి నెలా మీ సంపాదన నుంచి కొంతైనా మీ కోసం కేటాయించండి. ఇది ఎంత చిన్న మొత్తం అయినా పర్వాలేదు. కాలక్రమంలో ఈ చిన్న మొత్తమే పెద్ద కార్పస్‌ను సృష్టిస్తుంది. ఇది మీ పదవీ విరమణ జీవితానికి కొండంత భరోసానిస్తుంది.
కుటుంబ సభ్యులతో చర్చించండి..
మనం ఏ పనైనా కుటుంబ సభ్యుల సహకారం లేనిదే చేయలేం. అలాగే, మనం తీసుకునే నిర్ణయాలు వారిని కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి, ఆర్థిక సంబంధిత విషయాలు కుటుంబ సభ్యులతో చర్చించడం అలవాటు చేసుకోండి. కుటుంబ సభ్యులను మించి డబ్బు విషయాల్లో నమ్మే వ్యక్తులు వేరే ఎవరూ ఉండరని గుర్తుంచుకోండి.
చివరిగా..
ఆరోగ్యకరమైన అలవాట్లు.. శారీరకంగానూ, మానసికంగానూ ప్రశాంతతను చేకూరుస్తాయి. క్రమశిక్షణ లేని వ్యక్తి ఎంత కష్టపడినా ఫలితం శూన్యమే అవుతుంది. అదే క్రమశిక్షణతో కష్టపడుతు తెలివిగా మదుపు చేయగలిగితే కొద్దిపాటి పొదుపుతోనైనా సంపదను సృష్టించవచ్చు. మంచి ఆర్థిక అలవాట్లు వేగంగా మీ లక్ష్యాలను చేరుకునేందుకు దోహదపడతాయి.
Thanks for reading Financial Habits: With these financial habits you can create wealth fast!
No comments:
Post a Comment